నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణ శివారులో పార్థసారథి వ్యవసాయ క్షేత్రంలో శనివారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పశువుల కోట్టము, 200 నాటు కోళ్లు మంటల్లో కాలిపోయాయి. దీంతో పాటు వ్యవసాయ సామగ్రి, పశుగ్రాసం, అగ్నికి ఆహుతయ్యాయి. అంతే కాదు కరెంటు మోటార్లు దగ్ధమయ్యాయి. మామిడి తోటకు చెందిన చెట్లు, పంటలు కాలిపోయాయి. అదేవిధంగా ప్రమాదంలో డ్రిప్ పైప్‌లైన్ పూర్తిగా దగ్ధమైంది.
కరెంటు వైర్లు, పశుగ్రాసంగా నిల్వ ఉంచిన పచ్చి సోప్ప కూడా మంటల్లో కాలిపోయింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సంబంధిత అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి నష్టంపై అంచనా వేయాల్సి ఉంది. రైతుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని బాధిత రైతు కోరుతున్నారు. ఈ అగ్ని ప్రమాదం వలన లక్షల్లో నష్టపోయామని బాదిత రైతు వాపోయారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మమ్ములను ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.



