కామారెడ్డి జిల్లా బీర్కూర్ ప్రభుత్వ పాఠశాలలో ఘటన
నవతెలంగాణ- బీర్కూర్(నసురుల్లాబాద్)
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న శివశ్రీ(9) అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజుమాదిరిగానే శుక్రవారం ఉదయం శివశ్రీ పాఠశాలకు వెళ్ళింది. పాఠశాల ప్రార్థనా సమయంలో కడుపునొప్పితో బాధపడుతూ తరగతి గదిలోకి వెళ్లింది. గమనించిన ఇన్చార్జి ఉపాధ్యాయులు వెంటనే విద్యార్థినిని ఇంటికి పంపించారు. ఇంటి వద్ద తల్లిదండ్రులు ఎవరూ లేరు. ఇంటికి చేరుకున్న బాలిక.. వాంతులు, విరోచనాలు చేసుకుని పడిపోయింది. కాగా, వేరే పనిమీద బయటకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి చిన్నారి అస్వస్థతకు గురై ఉంది.
కానీ తల్లిదండ్రులు కూడా ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న ఆలోచన చేయలేదు. శనివారం ఉదయం 6 గంటలకు శివశ్రీ ఆరోగ్యం క్షీణించింది. దాంతో తల్లిదండ్రులు వెంటనే బాన్సువాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే బాలిక మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ మహేందర్ తెలిపారు. కాగా, అటు ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రులు బాలిక ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతోనే మృతిచెందిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బాలిక మృతి చెందిన విషయం తెలుసుకున్న సర్పంచ్ అరిగే ధర్మతేజ స్పందించి బాధిత కుటుంబానికి రూ.5వేలు, ఎస్ఐ మహేందర్ రూ.5వేలు ఆర్థికసాయం అందజేశారు.
అస్వస్థతకు గురై విద్యార్థిని మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



