Wednesday, May 27, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి సరెండర్‌

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి సరెండర్‌

- Advertisement -

ఆయన భార్య కూడా..
ఇంకా 47 మంది మావోయిస్టులు మిగిలి ఉన్నారు
వారి స్థితిగతులను పరిశీలిస్తా
గ్రేహౌండ్స్‌, ఎస్‌ఐబీలు కొనసాగుతాయి
గణపతి, ఆయన భార్య జోడె లక్ష్మీబాయి, వార్త శేఖర్‌లు లొంగిపోండి : డీజీపీ 
సి.వి ఆనంద్‌ పిలుపు

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
మావోయిస్టు మరో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు పుసునూరి నరహరి (64), తన భార్య దానమ్మతో సహా రాష్ట్ర డీజీపీ సి.వి ఆనంద్‌ సమక్షంలో మంగళవారం జనజీవన స్రవంతిలో కలిశారు. వీరి లొంగుబాటుతో మావోయిస్టు కేంద్ర కమిటీలో ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు ఎలియాస్‌ గణపతి, ఆయన భార్య జోడె లక్ష్మీబాయి, మరో నాయకుడు వార్త శేఖర్‌లు మాత్రమే తెలంగాణకు చెందినవారు మిగిలి ఉన్నారు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర డీజీపీ సి.వి ఆనంద్‌ మాట్లాడుతూ.. నరహరి, భార్య దానమ్మలు ఇటీవలనే ఎస్‌ఐబీ అధికారుల వద్దకు చేరారనీ, వారికి మలేరియా, డెంగ్యూ వ్యాధులు ఉండటంతో చాలా నీరసించి పోయారనీ, వారికి అత్యవసర చికిత్సలను అందించడంతో వారి ఆరోగ్య పరిస్థితి మెరుగైందని డీజీపీ తెలిపారు. వీరి లంగుబాటుతో మావోయిస్టుల ఉనికి దాదాపుగా కోల్పోయినట్టేననీ, అయితే రాష్ట్రానికి చెందిన ముగ్గురు, ఏపీకి చెందిన ఒకరితో కలిపి ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌లకు చెందిన మొత్తం 47 మంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారనీ, వారు కూడా త్వరలోనే జనజీవన స్రవంతిలోకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పునరావాస సంక్షేమ పథకాలను అందుకొని నూతన జీవితాన్ని గడపాలని ఆయన పిలుపునిచ్చారు.

లంగిపోయిన ఇద్దరు మావోయిస్టులకు సంబంధించిన రివార్డులో నరహరికి రూ.25 లక్షలు, దానమ్మకు రూ.35 లక్షల చెక్కులను మొదటి వాయిదా కింద అందజేస్తున్నామని ఆయన తెలిపారు. దేశంలోనే మావోయిస్టు తీవ్రవాదాన్ని అరికట్టడంలో ఆరితేరిన రాష్ట్ర గ్రేహౌండ్స్‌, ఎస్‌ఐబీ విభాగాల కార్యకలాపాలు ఇకముందు కూడా కొనసాగుతాయని ఆయన ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. మావోయిస్టుల కార్యలాపాలు పూర్తిగా అరికట్టామని కేంద్ర హౌం మంత్రి అమిత్‌షా చేసిన ప్రకటనకు, ఇంకా ఉన్నారంటూ మీరు తెలిపిన సమాచారం పరస్పరం విరుద్ధం కాదా అనే ప్రశ్నకు… అలాంటిదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో లంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పునరావాస కార్యాకలాపాలు, ఆర్థికంగా ఇస్తున్న చేయూత సక్రమంగా అందుతున్నాయనీ, అయితే రెండు నెలలకోసారి తానే స్వయంగా క్షేత్రస్థాయిలో తిరిగి మాజీ మావోయిస్టుల స్థితిగతులు ఎలా ఉన్నాయి, వారికి ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయి, తదితర అంశాలను సమీక్షించి, తగిన చర్యలు తీసుకుంటానని ఆనంద్‌ తెలిపారు.

నరహరి నేపథ్యం
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నరహరి విద్యార్థి దశలోనే రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ప్రభావంతో ఉద్యమంలో చేరి, 1982లో సీపీఐ (ఎంఎల్‌) పీపుల్స్‌ వార్‌లో సభ్యుడిగా చేరారు. అనంతరం ఛత్తీస్‌గఢ్‌, నాగ్‌పూర్‌, బీహార్‌, జార్ఖండ్‌ ప్రాంతాల్లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ సంస్థలో ఉన్నతస్థాయికి ఎదిగారు. 2017లో కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది, తర్వాత బీహార్‌-జార్ఖండ్‌ ప్రత్యేక ప్రాంత కమిటీకి కీలక బాధ్యతలు చేపట్టారు. నరహరి ఆయుధాల తయారీ, మరమతులు, నిర్వహణలో నైపుణ్యం కలిగి ఉండటంతో పాటు తుపాకులు, మోర్టార్లు, రాకెట్లు, రాకెట్‌ ప్రొఫెల్డ్‌ గ్రెనేడ్లు, బూబీ ట్రాప్‌ల తయారీలో కీలక పాత్ర పోషించాడని పోలీసులు తెలిపారు. సంస్థ క్యాడర్‌కు సాంకేతిక శిక్షణ కూడా అందించినట్టు వివరించారు.

దానమ్మ నేపథ్యం
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గ్రామలపాడుకు చెందిన మేదర దానమ్మ 1986లో ఉద్యమంలో చేరి, అనంతరం వివిధ బాధ్యతలు నిర్వహించారు. 2004లో నాగ్‌పూర్‌లో అరెస్టై, 2011 వరకు జైలులో ఉండి, బెయిల్‌పై విడుదలైన తర్వాత తిరిగి పార్టీలో చేరారు. 2018లో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా పదోన్నతి పొంది బీహార్‌-జార్ఖండ్‌్‌ ప్రాంతంలో సంస్థాగత, సాంకేతిక బాధ్యతలు నిర్వహించారు.

‘822 మంది లంగిపోయారు’
డీజీపీ కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం… 2024 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 822 మంది మావోయిస్టులు లంగిపోయారు. ఇందులో ఐదుగురు కేంద్ర కమిటీ సభ్యులు, 23 మంది రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక ప్రాంతీయ కమిటీ సభ్యుడు ఉన్నారు. అదే కాలంలో 334 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. పరిస్థితులు బాగాలేవు.. వచ్చేయండి : అజ్ఞాత మావోయిస్టులకు నరహరి పిలుపు పరిస్థితులు బాగాలేవనీ, సాయుధ పోరాటాన్ని ముందుకు నడిపించే ఎలాంటి సానుకూల వాతావరణం లేదనీ, వెంటనే అజ్ఞాత జీవితం వీడి తెలంగాణ ప్రభుత్వం ముందు లంగిపోవాలని మావోయిస్టు అగ్రనేత పుసునూరి నరహరి పిలుపునిచ్చారు. తాను తన భార్య కూడా పరిస్థితులు బాగాలేకనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మిస్రి అనుమతి తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జనజీవన స్రవంతిలో కలిశామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -