నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని ఏకేజీ భవన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సంయుక్త కార్యదర్శి ఐషీ ఘోష్‌ను అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులు చేసిన ప్రయత్నాన్ని సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ రాజ్యసభలో లేవనెత్తారు. బ్రిట్టాస్ మాట్లాడుతున్న సమయంలో తనను సభా కార్యకలాపాలను ప్రసారం చేసే సంసద్ టీవీ ప్రసారం చేయలేదు. తనను కెమెరాలో ఎందుకు చూపించలేదని ఎంపీ ప్రశ్నించగా, స్పీకర్ సమాధానం ఇవ్వలేదు. సభలో జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ.. 2021 కేసు పేరుతో పోలీసులు యూనిఫాం, వారెంట్ లేకుండానే ఏకేజీ భవన్‌లోకి ప్రవేశించి ఐషీ ఘోష్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే, కేంద్ర మంత్రి జేపీ నడ్డా జోక్యం చేసుకుని పోలీసుల చర్యను సమర్థించారు. ఇది చట్టపరమైన సాధారణ ప్రక్రియలో భాగమేనని, విద్యార్థి నాయకులకు సంబంధించిన కేసుల్లో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయని వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పార్టీ కార్యాలయంలోకి పోలీసులు ప్రవేశించి అరెస్టు ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ప్రతిపక్ష నేతలు కూడా ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు నిరసన తెలపడంతో, స్పీకర్ ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. అనంతరం రాజ్యసభ రెండు గంటల వరకు వాయిదా పడింది.



