170 ఎకరాల
ప్రభుత్వ భూమి పట్టా ఎలా అయ్యింది?
ఆర్డీవో, తహశీల్దార్ వేర్వేరు నివేదికలు ఇవ్వడమేంటీ
ఈ స్కాం వెనుక ప్రభుత్వ పెద్దలెవరో తేల్చాలి
సిట్ లేదా సీఐడీ విచారణ జరపాలి :
మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రైతుల ధాన్యం కొనుగోలు చేతగాదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతగాదు గానీ, ప్రభుత్వ భూములను అందిన కాడికి కాంగ్రెస్ నాయకులు కొల్లగొడుతున్నారని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు విమర్శించారు. శంషాబాద్‌లో రూ.వెయ్యి కోట్ల భూ కుంభకోణాన్ని ధారాలతో సహా బయట పెడుతున్నామని అన్నారు. దీనిపై సిట్ లేదా సీఐడీ విచారణ జరిపి ప్రభుత్వ భూములను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇందులో భాగస్వాములైన పెద్దలెవరో తేల్చాలనీ, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ లో173 నుంచి 183 మధ్య ఉన్న భూమిలో 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే కుట్ర జరిగిందని చెప్పారు.
అది ప్రభుత్వ భూమి అని, దాన్ని ఆక్రమణకు గురి కాకుండా ఉండాలని తహశీల్దార్ ను ఆర్డీవో ఆదేశించారని గుర్తు చేశారు. ప్రొహిబిషన్ జాబితా 22ఏలో పెట్టాలన్నారని చెప్పారు. ఈ ఏడాది జనవరి 30న హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో పొందుపర్చారని అన్నారు. ఇది ప్రభుత్వ భూమి అని ఫ్రిబవరి 24న తహశీల్దార్ తేల్చారని వివరించారు. నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 28న ఈ భూమి ప్రయివేటు వ్యక్తులకు చెందుతుందని తహశీల్దార్ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. నాలుగు రోజుల్లోనే ప్రభుత్వ భూమి ప్రయివేటు భూమి ఎలా అయ్యిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ భూమిని భూ భారతి ఆన్ లైన్ లో కూడా పెట్టాలన్నారని చెప్పారు.ఆర్డీవో, తహశీల్దార్ రెండు భిన్నమైన నివేదికలు ఇస్తే జీపీ రెవెన్యూ హైకోర్టుకు ఎలా ఇచ్చారని అడిగారు. ఏ ఆదేశాలైనా కలెక్టర్ ఆమోదంతో హైకోర్టుకు వెళ్తుందనీ, కలెక్టర్ ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. దీన్ని అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఏ రకంగా ఆమోదించారని అన్నారు. రూ.వెయ్యి కోట్ల విలువైన భూములకు సంబంధించి ఇంత పెద్ద కుంభకోణం జరిగితే అధికారులపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ స్కాం గురించి మీడియాలో వస్తే ఈ కేసులో కేవలం తహశీల్దార్‌ను కలెక్టరేట్ కు బదిలీ చేసి ఊరుకున్నారని చెప్పారు. ఏసీబీ అధికారులు తనిఖీలకు వెళ్లారనీ, ప్రభుత్వ పెద్దలు ఏం చెప్పారో ఏసీబీ వారు వెనక్కి వచ్చారని వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యంత సన్నిహితుడు ఇందులో ఉన్నాడు కాబట్టే ఏసీబీ వెనక్కి వచ్చిందని ఆరోపించారు. ఒత్తిడి కారణంగానే తహశీల్దార్ కేవలం బదిలీ అయ్యారని చెప్పారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.తహశీల్దార్‌ను కాపాడటంలో ఉన్న పెద్దలెవరు? వారు బయటకు రావాలని డిమాండ్ చేశారు. భూ భారతిలో భూమి చేరాలంటే దరఖాస్తు పెట్టాలనీ, ఆర్డీవో దాన్ని ఆమోదించాలని చట్టంలో ఉందన్నారు. కానీ తహశీల్దార్ భూ భారతిలో పెట్టాలని చెప్పగానే అది నమోదైందని వివరించారు. 170 ఎకరాలు ప్రభుత్వ పట్టా భూమిని ఎలా ఎక్కించారని ప్రశ్నించారు.ఈ భూమిని ఎందుకు వెనక్కి తీసుకోరనీ, ఎందుకు నిషేధిత జాబితాలో పెట్టరని అడిగారు. తహశీల్దార్ ఆదేశాలను సస్పెండ్ చేయాలనీ, ఆ అధికారిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ఆర్డర్ మీద అప్పీల్‌కు వెళ్లాలనీ, ఆ భూమిని తిరిగి నిషేధిత జాబితో పెట్టాలని కోరారు. జగిత్యాలలో ఆర్టీసీ డ్రైవర్ పై సస్పెన్షన్ వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. డ్రైవర్ అశోక్ ధాన్యం కొనుగోలు చేయాలని మాట్లాడితే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్చ ఉంటుందన్నారు. ఆయన సస్పెన్షన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ డ్రైవర్ అశోక్ కు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. దీనిపై న్యాయపోరాటం, ప్రత్యక్ష పోరాటానికి పూనుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు పి సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ హఠావో -సింగరేణి బచావో : హరీశ్‌రావు
కాంగ్రెస్ హఠావో – సింగరేణి బచావో అనేది బొగ్గు గని కార్మికుల నినాదం కావాలని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితి ఇట్లనే ఉంటే సింగరేణి లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుందన్నారు. కాంగ్రెస్ హయాంలో సింగరేణి స్కాం లకు గనిలా మారిందని చెప్పారు. నైనీ బ్లాక్ బొగ్గు గనుల టెండర్ అంశం కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి ని బయట పెట్టిందని అన్నారు. త్వరలో సింగరేణి కి సంబం ధించి కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలు మరిన్ని బయట పెడతామని చెప్పారు.
సింగరేణి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ : కొప్పుల ఈశ్వర్
సింగరేణి ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ సంఘం గౌరవాధ్యక్షులు, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఏ కార్మిక సంఘంతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష సిరికొండ మధుసూదనాచారి, టీబీజీకేఎస్ అధ్యక్షులు రాజిరెడ్డి, సింగరేణి ప్రాంత బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



