Wednesday, May 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనత్తనడకన స్క్రాపేజ్ విధానం

నత్తనడకన స్క్రాపేజ్ విధానం

- Advertisement -

అమల్లో సర్కారు తడబాటు
 30 లక్షల పాత వాహనాలకు
 స్ర్కాప్‌ అయినవి స్వల్పమే
పెరుగుతున్న కాలుష్యం
గాల్లో కలుస్తున్న విలువైన ప్రాణాలు


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కాలుష్యాన్ని తగ్గించేందుకు సర్కారు చేపడుతున్న చర్యలు చురుగ్గా సాగడం లేదు. ప్రధానంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న స్ర్కాపేజ్‌ ‌విధానం ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ప్రభుత్వం హడావిడి చేస్తున్నా, ప్రయోజనం పెద్దగా కనిపించడం లేదు. రవాణా శాఖ ఇప్పటికే స్ర్కాపేజ్‌ ‌విధానాన్ని అమలుచేస్తున్నా, వాహనాల స్ర్కాపింగ్‌ ‌వ్యవహారం ఆశించిన స్థాయంలో జరగడం లేదు. సర్కారీ లెక్కలే ఇందుకు సాక్ష‍ంగా నిలుస్తున్నాయి. రాష్ర్టంలో ఈ విధానం తడబడతున్నది. ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కిలా కనిపిస్తున్నది. రాష్ట్రంలో 30 లక్ష‍ల పాత వాహనాలు ఉన్నట్టు రవాణా శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇవి 15 సంవత్సరాల కంటే పాతవి. వాటిలో 17 లక్ష‍ల ద్విచక్ర వాహనాలు, 3.5 లక్ష‍ల కార్లు, లక్ష‍ గూడ్స్‌ ‌వాహనాలు, ఇంకా ఆర్టీసీ బస్సులు, స్కూల్‌ ‌బస్సులు, ఆటోలు ఉన్నాయి.

1100 లా…? 7000 లా ?
గత ఏడాది జనవరి ఒకటి నుంచి వాహన స్క్రాపేజ్ విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ వాహనాలు 1,112, ప్రయివేటు వాహనాలు 59 మొత్తం 1171 వాహనాలను స్ర్కాప్‌ ‌చేసినట్టుగా సమాచారం. రవాణా శాఖ అధికారులు మాత్రం 7000 వాహనాల వరకు స్ర్కాప్‌ ‌చేసినట్టు చెబుతున్నారు. గత 18 నెలల్లో స్ర్కాపింగ్ కు అవకాశం ఉన్న వాహనాల్లో 0.039 శాతం మాత్రమే స్క్రాప్ అయినట్టు తెలిసింది. ఈ రేటు ప్రకారం 30 లక్షల వాహనాలను స్ర్కాప్‌ ‌చేయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పాల్సిన అవసరం లేదు.
ఇదిలా ఉండగా, 1,000 ఆర్టీసీ బస్సులు, 2,000 స్కూల్ బస్సులు పనికిరానివిగా ప్రకటించాల్సిన జాబితాలో ఉన్నట్టు తెలిసింది. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదనీ, ఇవి కదులుతున్న భద్రతా ప్రమాద సూచికలనే వాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

గాల్లో దీపాలు…
లోపభూయిష్టమైన వాహనాల మూలంగా ఒక్క 2022 సంవత్సరంలోనే, 15 ఏండ్లు నిండిన పాత వాహనాలతో 1000కు పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు సమాచారం. వీటిలో 418 మంది ప్రాణాలు గాల్లో కలవగా, 1100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదాలకు బ్రేకుల వైఫల్యాలు, క్లచ్ సమస్యలు, ఇతరాలు కారణమని రోడ్డు భద్రతా నిపుణులు చెబుతున్నారు.

నెలకు స్వల్పమే
హైదరాబాద్ ఆర్టీఏ స్క్రాపింగ్‌ను ప్రారంభించినప్పుడు కేవలం నెలకు 20-25 వాహనాలు మాత్రమే వచ్చాయి. ఇందులో వాహన యజమానులు లొసుగులను పసిగట్టారు. రూ.5,000 గ్రీన్ ట్యాక్స్‌‌తోపాటు రూ.2,000 ఫిట్‌నెస్ ఫీజు చెల్లించి, మరో మూడు నుంచి సంవత్సరాలు వాహనాలను వాడుకోవచ్చు. మీ 15 ఏండ్ల పాత వాహనం ఇంకా నడిచే అవకాశం ఉండగా గ్రీన్ ట్యాక్స్ రూ.7,000 చెల్లించడానికి మాత్రమే వాహనదారుడు ఇష్టపడుతున్నాడు. రూ. 15 వేలకు స్ర్కాప్‌ ‌చేయడానికి ఎందుకు ముందుకొస్తాడనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

అసలు చిక్కు ఇదే
స్ర్కాప్‌ ‌చేయాల్సిన పాత వాహనాల్లో 17 లక్ష‍ల మేర ద్విచక్ర వాహనాలే ఉండటం గమనార్హం. 15 ఏండ్ల నాటి ఒక స్కూటర్‌‌ స్ర్కాప్‌ ‌విలువ కేవలం రూ. 3 వేలు మాత్రమే. కొత్త బండి సగటు రేటు రూ. 90 వేలు ఉంటుంది. దీనిపై 15 శాతం పన్ను మినహాయించి లెక్కిస్తే రూ. 13,500 వస్తుంది. కొత్త వాహనం కోసం నికరంగా రూ. 75 వేలకుపైగా ఖర్చు చేయడం కంటే , చాలా మంది వాహనదారులు రూ. 7 వేల పర్యావరణ పన్ను(గ్రీన్‌ ‌టాక్స్‌) ‌కట్టడానికి మొగ్గుచూపున్నట్టు సమాచారం.

​ఆర్టీసీవి 1000 బస్సులు
తెలంగాణ ఆర్టీసీ వద్ద మొత్తం 9,300కు పైగా బస్సులు ఉన్నాయి. వీటిలో కనీసం 1,000 బస్సులు 15 ఏండ్లకుపబడిన పాతవి. ప్రభుత్వ విధానం ప్రకారం ఈ బస్సులు ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమైతే వాటిని తప్పనిసరిగా రద్దు చేయాల్సి ఉంటుంది.కొత్త ఎలక్ట్రిక్ బస్సు ధర సుమారు రూ.1.2 కోట్లుగా ఉంది. పాత డీజిల్ బస్సు స్క్రాప్ విలువ సుమారు రూ 2 నుంచి రూ 3 లక్షలు . ఒక బస్సును మార్చడానికి అయ్యే నికర ఖర్చు రూ1.17 కోట్లు కావాలి. మొత్తం 1000 బస్సులను మార్చడానికి అవసరమయ్యే ఖర్చు రూ. 11,700 కోట్లు. 2026 రవాణా బడ్జెట్‌లో ‘రోడ్డు రవాణా, భద్రత’ కోసం కేటాయించిన మొత్తం రూ. 400 కోట్లు మాత్రమే. ఈ నిధులతో సుమారు 34 బస్సులను మాత్రమే సమకూర్చుకోగలరు. ఈ కారణంగానే, ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రయివేటీకరణగా చెబుతున్నాయి. 1,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసే బదులు అది ప్రయివేటు అపరేటర్లకు అప్పగించడం తెలిసిందే. ఏప్రిల్ 2026లో జరిగిన ఆర్టీసీ సమ్మె సమయంలో ఈ అంశమే ప్రధాన డిమాండ్‌‌గా మారిన విషయం విదితమే.

మౌలిక సదుపాయాల పరిస్థితి
తెలంగాణ రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల కోసం రూ.296 కోట్లు సర్కారు మంజూరు చేసింది. 2026 నాటికి, కేవలం మూడు హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌‌లో మాత్రమే స్క్రాపింగ్ కంపెనీలు ఏర్పాటు అయ్యాయి. ఆ కంపెనీలు రోజుకు 10 వాహనాలను స్క్రాప్ చేస్తే, మూడు కేంద్రాల్లో రోజుకు 30 వాహనాలు మాత్రమే స్ర్కాప్‌‌చేయడానికి అవకాశముంది. అంటే ఏడాదికి 10,950 వాహనాల స్ర్కాప్‌‌కు వీలుంది. ప్రస్తుత సామర్థ్యంతో 30 లక్షల వాహనాలను స్క్రాప్ చేయడానికి ఏండ్లతరబడి సమయం పట్టొచ్చు. ఆటోమేటేడ్‌ ‌కేంద్రాల సంఖ్యను పెంచకపోతే స్ర్కాపేజ్‌ ‌విధానం మూలనపడినట్టే. డిసెంబర్ 2024లో 1,950 వదిలివేసిన వాహనాలను వేలం వేయగా, వాటిలో 1,873 స్క్రాప్‌గా అమ్ముడయ్యాయి. మరో 1,130 వాహనాలు మే 2026లో వేలానికి అవకాశమున్నట్టు తేల్చారు.

​రోడ్డు భద్రతకు మార్గాలు
​1.ఢిల్లీ తరహాలో15 ఏండ్లు నిండిన వాహనాలను పూర్తిగా నిషేధించాలి . తెలంగాణ ఫిట్‌నెస్ పన్నును ఉపసంహరించాలి. భద్రతే ప్రామాణికమైతే ఢిల్లీ తరహా విధానాన్ని అనుసరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని సమాచారం. ప్రస్తుత ప్రోత్సాహకాలు రూ.10 లక్షల కార్లకు మాత్రమే వర్తిస్తాయి. రూ.50,000 బైక్‌లకు కాదు. స్క్రాప్ చేసిన ద్విచక్ర వాహనాలకు నేరుగా ₹10,000 నగదు ప్రోత్సాహకం ఇస్తే ఫలితాలు మరింత ఆశావహంగా ఉంటాయని అంటున్నారు. ఆర్టీసీ పునరుద్ధరణకు రూ.11,700 కోట్లు అవసరం. 2026 బడ్జెట్ రూ. 400 కోట్లు మాత్రమే కేటాయించింది. కేటాయింపును మరింత పెంచపోతే ఉపయోగముండదు. సంఘాలతోనూ సంప్రదింపులు అవసరం. స్ర్కాపింగ్‌ ‌కేంద్రాలను పెంచడం ద్వారా వేగంగా వాహనా కాలుష్యాన్ని తగ్గించవచ్చు. 30 లక్షల వాహనాలకు కేవలం మూడు కేంద్రాలు మాత్రమే సరిపోవు. ప్రతి రెండు లక్షల వాహనాలకు ఒక స్ర్కాప్‌ ‌కేంద్రం అవసరమవుతుంది. కనీసం 15 స్ర్కాప్‌ ‌కేంద్రాలు కావాలని పర్యావరణ నిపుణులు భిప్రాయపడుతున్నారు. తద్వారా వాహన కాలుష్యంతోపాటు ప్రజల విలువైన ప్రాణాలను కాపాడుకునే అవకాశాలు మెరుగుపడతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -