బస్తాకు రూ.200 అదనంగా ఇస్తేనే విక్రయం
ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలూ పెరుగుదల
వ్యాపారుల బ్లాక్ దందా..
ఆర్థికంగా నష్టపోతున్న అన్నదాతలు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
వానాకాలం సీజన్‌కు ముందే ఎరువుల బ్లాక్ మార్కెట్ మొదలైంది. వరి సాగులో అధికంగా వినియోగించే డీఏపీ ఎరువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి కొరత సృష్టిస్తున్న వ్యాపారులు బస్తాకు రూ.200 చొప్పున అధిక ధరకు విక్రయిస్తున్నారు. నెలరోజుల కిందట కాంప్లెక్స్ ఎరువుల ధరలను భారీగా పెంచడంతో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న డీఏపీని ముందస్తుగా కొనుగోలు చేసేందుకు రైతులు బారులు తీరుతున్నారు. దాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు డీఏపీ నిల్వలను బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వానా కాలం సీజన్ వచ్చేసరికి డీఏపీ అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడుతుందని, బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించాలని రైతులు కోరుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎరువుల మార్కెట్‌కు పేరుగాంచిన సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, జోగిపేట, మెదక్, నర్సాపూర్, రామాయంపేట, గజ్వేల్, మర్కుక్, సిద్దిపేట, దుబ్బాక కేంద్రంగా డీఏపీ బ్లాక్ మార్కెట్ దందా కొనసాగుతోంది. ఇటీవల కేంద్రం డీఏపీ మినహా ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలను భారీగా పెంచింది. దీంతో వానాకాలం పంటలకు రైతులంతా ముందస్తుగా డీఏపీని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు డీఏపీని కృత్రిమ కొరత సృష్టించి బస్తాకు రూ.200 వరకు అదనపు ధర వసూలు చేస్తున్నారు. డీఏపీ బస్తా ఎమ్మార్పీ ధర రూ.1350 ఉండగా, హోల్‌సేల్ పాయింట్ వద్ద స్టాకుల్లేవని పేర్కొంటూ, తమకు అనుకూలమైన రిటైల్ డీలర్లకు మాత్రమే రూ.100 అదనపు ధరకు విక్రయిస్తున్నారు. ఈ ధరకు డీఏపీని కొనుగోలు చేస్తున్న రిటైల్ డీలర్లు తమకు నమ్మకమైన రైతులు, ఖాతాదారులకు ఫోన్ చేసి డీఏపీ కొంత మాత్రమే అందుబాటులో ఉందని, భవిష్యత్‌లో రాకపోవచ్చని, బస్తాకు రూ.200 అదనపు ధర ఇస్తే డెలివరీ ఇస్తామని చెబుతుండటంతో రైతులు రిటైల్ డీలర్ల వద్ద రూ.200 అదనంగా అంటే రూ.1550కు కొంటున్నారు.
ఎరువులు బ్లాక్‌లో అమ్మితే చర్యలు తీసుకోవాలి :
రైతు సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జయరాజు కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను భారీగా పెంచింది. తక్కువ ధర ఉన్న డీఏపీ కొనుగోలు చేయాలని రైతులు దుకాణాల వద్దకు వెళితే లేదని చెప్పి.. బ్లాక్ మార్కెట్‌లో విక్రయించడం దారుణం. డీఏపీ బస్తా ధర రూ.1350 ఉంటే రూ.200 అధికంగా తీసుకుని విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వర్షాలు వస్తుండటంతో రైతులు తక్కువ ధర ఉన్న డీఏపీని కొనుగోలు చేసేందుకు వెళ్తే అధిక ధరలకు విక్రయించడం దారుణం. ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచాలి. అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తాం :
శివప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి జిల్లాలో ప్రస్తుతం ఎరువుల డిమాండ్ ఏమీ లేదు. 3,022 మెట్రిక్ టన్నుల డీఏపీ అందుబాటులో ఉంది. రూ.1,350 ఎమ్మార్పీకి మాత్రమే డీఏపీ విక్రయించాల్సి ఉంది. అంతకుమించి ఎవరు అమ్మినా లైసెన్స్‌లు రద్దు చేస్తాం. డీఏపీ బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే మాకు ఫిర్యాదు చేయాలి. రైతులెవరూ అధిక ధరకు కొనొద్దు. అధిక ధరలకు ఎరువులు విక్రయించే వారిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. బలవంతంగా ఇతర మందులు కొనాలని ఒత్తిడి చేయకూడదు.
బ్లాక్ మార్కెట్‌లో ‘డీఏపీ’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



