Monday, June 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుయుద్ధం పేరుతో ప్రజల సొమ్ము లూటీ

యుద్ధం పేరుతో ప్రజల సొమ్ము లూటీ

- Advertisement -

కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్రం
ట్రంప్ చేతిలో కీలుబొమ్మలా మోడీ
ప్రజా ఉద్యమాలు నిర్మించిన కాసాని స్ఫూర్తితో మరిన్ని పోరాటాలు చేయాలి : 
పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
కాసాని ఐలయ్య స్మారక స్థూప ఆవిష్కరణ, సభ

నవతెలంగాణ -కొత్తగూడెం
ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధం వల్ల భారతదేశానికి రావాల్సిన క్రూడ్ ఆయిల్ అందకపోవడంతో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజా సొమ్మును కార్పొరేట్ సంస్థలకు మోడీ ప్రభుత్వం కట్టబెడుతుందని సీపీఐ(ఎం) పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌‌లో ఏర్పాటు చేసిన సీపీఐ(ఎం) రాష్ట్ర నేత కామ్రేడ్ కాసాని ఐలయ్య స్మారక స్థూపాన్ని పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎం. సాయిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావుతో కలిసి బీవీ రాఘవులు ఆవిష్కరించారు. కొత్తగూడెం సెవెన్ హిల్స్ ఏరియాలో ఏర్పాటు చేసిన కాసాని ఐలయ్య స్మారక స్థూపాన్ని ఎం. సాయిబాబు ఆవిష్కరించారు. అనంతరం సుజాతనగర్‌‌లో జరిగిన సభలో అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా, ముందుగా పోతినేని సుదర్శన్ రావు జెండా ఆవిష్కరించారు. అనంతరం స్థానిక కళ్యాణ మండపంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కున్సోత్ ధర్మ అధ్యక్షతన జరిగిన సభలో రాఘవులు మాట్లాడారు. ​కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ముక్కలు చేసేందుకు కుట్రలు చేస్తున్నదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు హాని చేసే చర్యలు తీసుకుంటున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టాలని యోచిస్తున్నారని, దీని వల్ల రైతులకు మరింత ఆర్థిక భారం పెరిగే ప్రమాదం ఉందన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల అదానీ, అంబానీల విద్యుత్ సంస్థలకు లబ్ది చేకూర్చడమేనని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమెరికా ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నదని, ట్రంప్‌ చేతిలో మోడీ కీలుబొమ్మలా మారాడని విమర్శించారు.

యుద్ధం పేరుతో గ్యాస్, డీజిల్, పెట్రోల్ పై విపరీతంగా ధరలు పెంచి ప్రజల సొమ్మును కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేస్తున్నారని విమర్శించారు. క్రూడ్ ఆయిల్ కొరత వల్ల ఎరువులు, ఆహార పదార్థాలు, ఇతర వస్తువులపై ధరలు పెరిగే ప్రభావం ఉందని అన్నారు. ఇంట్లో పొయ్యి వెలగాలన్న, గ్రామాల్లో ట్రాక్టర్ నడవాలన్నా, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అమెరికా చేస్తున్న అహంకార ధోరణి నిలదీసే ధైర్యం మోడీకి లేదని, అందుకే మౌనంగా ఉంటున్నాడని విమర్శించారు. మరో 15 రోజులు యుద్ధం కొనసాగితే డీజిల్, పెట్రోల్, గ్యాస్ ఇతర వస్తువులపై విపరీతమైన రేట్లు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. దేశంలో యువత ఉపాధి లేక తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. దాంతో వారంతా దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారని అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ యుద్ధాన్ని ఆపాలని అడగాలని, దానికోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఆసన్నమైందని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరం సత్యనారాయణ, సుజాతనగర్ 21 వ డివిజన్ కార్పొరేటర్ చింతలపూడి శ్రావణి, సుజాతనగర్ మండల కార్యదర్శి వీర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -