ప్రయివేట్ సెంటర్లకు రోగుల పరుగులు
రెగ్యులర్ సూపరింటెండెంట్, వైద్యుల పోస్టులు భర్తీ చేయాలి
సిటీ స్కాన్ మిషన్ ఉన్నా ప్రభుత్వ అనుమతులివ్వరా..?
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య
భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి సందర్శన
నవతెలంగాణ-భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలోనే కనీస వసతుల్లేవని, దీంతో అక్కడి ప్రజలు హైదరాబాద్, ప్రయివేట్ ఆస్పత్రులను ఆశ్రయిం చే పరిస్థితి ఏర్పడిందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యం లో శనివారం జిల్లా కేంద్ర ఆస్పత్రిని ఆయన పరిశీలించా రు. రోగులు, వైద్యులు, సిబ్బందితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రి అభివృద్ధిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. నర్సింగ్ స్టాఫ్‌కు రెస్ట్ రూమ్ లేక ఇబ్బందులు పడుతున్నారని, వైద్యులకు కూడా సరైన సదుపాయాలు లేవని అన్నారు. ఓపీ కౌంటర్లు తక్కువగా ఉండటంతో రోగులు గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందని, రోగులకు కనీస విశ్రాంతి గది కూడా లేదని చెప్పారు. వార్డుల్లోని బాత్రూమ్‌లు అపరిశుభ్రంగా ఉన్నాయని, అక్కడికి వెళ్తే కొత్త రోగాలు వచ్చే పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లల వార్డులో మరుగుదొడ్లు సరిగా లేక దుర్వాసన వస్తోందని అన్నారు. ఆస్పత్రిలో సిటీ స్కాన్ మిషన్ ఉన్నా ప్రభుత్వ అనుమతులు రాకపోవడం విచిత్రంగా ఉందని తెలిపారు.
దీంతో రోగులు సిటీ స్కాన్ కోసం ప్రయివేట్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోందని, ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రుల మధ్య ఏమైనా లోపాయి కారి ఒప్పందాలు ఉన్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమస్యలన్నిటికీ ప్రధాన కారణం రెగ్యులర్ సూపరింటెండెంట్ లేకపోవడమేనని అన్నారు. ఇన్‌చార్జి సూపరింటెండెంట్లతో ఆస్పత్రి మెరుగుపడదని, సరైన వైద్యం అందదని అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ల సంఖ్య పెంచాలని కోరారు. రక్త నమూనాల రిపోర్టుల్లో జాప్యం జరుగుతోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రెగ్యులర్ సూపరింటెండెంట్‌ను నియమించా లని, ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న 30 వైద్య పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ తదితర పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
డెవలప్‌మెంట్ కమిటీ లేక అభివృద్ధి
నిలిచిపోయింది: ఎమ్‌డి. జహంగీర్
జిల్లా కేంద్ర ఆస్పత్రి డెవలప్‌మెంట్ కమిటీ 27 మందితో ఉండేదని, దాని పదవీకాలం ముగియడంతో సమావేశాలు జరగడంలేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్ తెలిపారు. దీంతో ఆస్పత్రి అభివృద్ధి అటకెక్కిందన్నారు. ఇప్పటికే కొన్ని ప్రయివేట్ ఆస్పత్రుల తో ఒప్పందాలు చేసుకుని అవసరం లేకున్నా రోగులను అక్కడికి పంపిస్తున్నారని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తమ పార్టీ ఆధ్వర్యం లో సందర్శించామని, వాటిలోని సమస్యలపై భవిష్యత్‌లో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని వివరించారు. ఈ పర్యటనలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కృష్ణ, దయ్యాల నరసింహ, గడ్డం వెంకటేష్ పాల్గొన్నారు.



