రూ.619 కోట్లు పెండింగ్ :
పంచాయతీరాజ్ చట్టసవరణ చర్చలో మంత్రి సీతక్క
ఉభయ సభల్లోనూ బిల్లుకు ఆమోదం
పల్లెలు,పట్టణాల మధ్య బీఆర్ఎస్ వివక్ష చూపిందని వ్యాఖ్య
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
పదిహేనో ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం గతంలో రెండేండ్లపాటు పెండింగ్‌లో పెట్టిందని రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. రూ.619 కోట్ల మేర నిలిపివేసిందని గుర్తుచేశారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఇటీవల నిధులు విడుదల అవుతున్నాయని చెప్పారు. ఆ కాలంలో పంచాయతీలు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కోన్నాయన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు ప్రతినెలా రూ.54 కోట్ల మేర నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు తెలియజేశారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా పంచాయతీ భవనాల నిర్మాణం చేస్తున్నట్టు ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూర్చుకునే అధికారం ఇచ్చినట్టు స్పష్టం చేశారు. కేంద, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పాటు పంచాయతీల సొంత ఆదాయం సమీప జాతీయ్య బ్యాంకు, సహకార బ్యాంకు, పోస్టాఫీసులో జమ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టి పంచాయతీరాజ్ శాఖ చట్ట సవరణ బిల్లుపై గురువారం అసెంబ్లీతో పాటు మండలిలోనూ చర్చ జరిగింది. చర్చ అనంతరం ఉభయ సభయల్లోనూ బిల్లు ఆమోదం పొందింది. దీంతో నిధుల వినియోగంలో పంచాయతీ లకు స్వేచ్ఛ లభించినట్టయింది. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన అసెంబ్లీలో బిల్లుపై చర్చలో పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్క చర్చ ముగింపు అనంతరం మాట్లాడుతూ పంచాయతీలకు సంబంధించిన నిధులను ట్రెజరీల్లో ఉంచటం మూలంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వాల నిధులు వినియోగించడంలో అనేక నిబంధనలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని చెప్పారు. సర్పంచులు కష్టాలు పడుతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 సవరణకు అసెంబ్లీలో ప్రతిపాదించినట్టు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెలు, పట్టణాలకు మధ్య వివక్ష చూపిందని విమర్శించారు. పట్టణాల విషయంలో నిధులు బ్యాంకుల్లో వేయడానికి సవరణ చేసిందనీ, గ్రామీణ ప్రాంతాలకు ఆ స్వేచ్ఛను ఇవ్వలేదని చెప్పారు. సర్పంచుల విజ్ఞప్తి మేరకు చట్టసవరణ చేస్తున్నట్టు వివరించారు. స్థానిక అధికారుల పర్యవేక్షణ మేరకు నిధులను వినియోగించుకోవచ్చని వివరించారు. ఎలాంటి దుర్వినియోగానికి అవకాశం లేదని అన్నారు. ఈ నిధులను ప్రభుత్వ జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జమ చేయడానికి ఈ బిల్లు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. ప్రయివేటు బ్యాంకుల్లో జయచేయడానికి వీలులేదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పారు. ఎంపీడీవో ఆఫీసుల నిర్మాణానికి సైతం నిధులు ఇస్తున్నట్టు చెప్పారు.
గ్రామాల్లో రోడ్లు వేయడానికి అటవీ అనుమతుల పేర సమస్యలు వస్తున్నాయని చెప్పారు. త్వరలోనే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. గ్రామసభల్లో తీర్మానం చేసుకుని అందుబాటులో ఉన్న ఉన్న నిధులను స్వేచ్ఛగా ఉపయోగించుకునే అధికారం ఈ బిల్లు పంచాయతీలకు వస్తుందన్నారు. సభ్యులు భూపతిరెడ్డి, పాల్వాయి హరీష్, విజయ రమణారావు, మాజిద్ హుస్సేన్, పాయల్ శంకర్, గండ్ర సత్యనారాయణ, చిక్కుడు వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, రామ్మోహన్‌రెడ్డి బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. పంచాయతీల అభివృద్ధిలో నిధుల ఫ్రీజింగ్ ఆటంకంగా ఉందని చెప్పారు. ఏడాదిలో దాదాపు 11 నెలలకుపైగా ఫ్రీజింగ్ ఉంటే స్థానిక సంస్థలు ఎలా స్వయం సమృద్ధిని సాధిస్తాయని ప్రశ్నించారు. గ్రామాల్లో మౌలిక వసతులు, వనరులు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన వందరోజుల ప్రణాళిక గ్రామాల్లో సమర్థవంతంగా అమలైందని చెప్పారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ, పంచాయతీరాజ్ శాఖులు చురుగ్గా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నేరుగా నిధులు వచ్చేలా చేయాలని కోరారు. చర్చ అనంతరం స్పీకర్ ప్రసాద్‌కుమార్ సభ ఆమోదానికి పెట్టడంతో పంచాయతీరాజ్ చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలియజేసింది. శాసనమండలిలోనూ సభ్యులు చర్చ అనంతరం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ బిల్లు గవర్నర్ ఆమోదం అనంతరం చట్టంగా మారనుంది.


