సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
లోయర్ ట్యాంక్‌బండ్ వద్దనున్న
ఐలమ్మ విగ్రహానికి నివాళులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వీరనారి చిట్యాల ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) శ్రేణులకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. ఐలమ్మను స్మరించుకోవడమంటే పీడిత వర్గాల విముక్తి పోరాటాన్ని గుర్తుచేసుకోవడమేనని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాల ప్రారంభం సందర్భంగా గురువారం హైదరాబాదులోని లోయర్ ట్యాంక్ బండ్ వద్దగల వీరనారి ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యులు స్కైలాబ్ బాబు, ఎం వెంకటేష్, హైదరాబాద్ నగర నాయకులు ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ..నైజాం పాలనలో పాలకుర్తి ప్రాంతంలో విస్నూరి రామచంద్రారెడ్డి భూస్వామి అక్రమాలను వీరనారి చిట్యాల ఐలమ్మ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ధైర్యంగా ప్రతిఘటించారని గుర్తుచేశారు. ఆ స్ఫూర్తితోనే తెలంగాణ వ్యాప్తంగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం చారిత్రాత్మకమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగిందనీ, ఇది శ్రామిక వర్గాల విముక్తి కోసం జరిగిన గొప్ప పోరాటమని వివరించారు.
ఆ పోరాటంలో భాగంగా సుమారు 3 వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాల ద్వారా వెట్టి చాకిరిని రద్దు చేసి నిరుపేదలకు 10 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేశారని గుర్తుచేశారు. నైజాం రజాకార్లు, దొరలు, భూస్వాముల అణచివేతలను ఎదుర్కొంటూ సాగిన ఆ పోరాటంలో వేలాది వేల మంది అమరులయ్యారనీ, వేలాది మంది దాడులు, చిత్రహింసలను ఎదుర్కొని నిలబడ్డారని తెలిపారు. వీరనారి ఐలమ్మను స్మరించడం అంటే పీడిత వర్గాల విముక్తి పోరాటాన్ని గుర్తుచేసుకోవడమేనని చెప్పారు. సెప్టెంబర్ 10 నుండి సెప్టెంబర్ 17 వరకు రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సదస్సులు, ప్రదర్శనలు, మోటార్ సైకిల్ యాత్రలు, బహిరంగ సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సాయుధ పోరాట స్ఫూర్తిని చాటిచెప్పే కార్యక్రమాలన్నింటినీ ప్రజలు, పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు.



