Friday, September 11, 2026
E-PAPER
Homeజాతీయంబ్రిక్స్‌తో భారత వాణిజ్య లోటు మూడింతలు

బ్రిక్స్‌తో భారత వాణిజ్య లోటు మూడింతలు

- Advertisement -

దిగుమతుల్లో 42 శాతం వాటా..
ఎగుమతులు 22 శాతమే

న్యూఢిల్లీ : బ్రిక్స్ కూటమి దేశాలతో భారత వాణిజ్య సంబంధాలు వేగంగా విస్తరిస్తున్న ప్పటికీ.. అంతకంటే దిగుమతులు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఇటీవల ఎగుమతులు–దిగుమతుల మధ్య భారీ అంతరం మరింత పెరుగుతోంది. భారత్ మొత్తం దిగుమతుల్లో బ్రిక్స్ దేశాల వాటా 42 శాతానికి చేరగా, ఎగుమతుల్లో వాటా కేవలం 22 శాతంగా ఉంది. దీంతో ఈ కూటమితో భారత్ వాణిజ్య లోటు భారీగా పెరిగింది. ‘ది వైర్’ రిపోర్ట్‌ ప్రకా రం.. 2021 నుంచి 2026 మధ్య బ్రిక్స్ దేశాల తో భారత్ మొత్తం వస్తు వాణిజ్యం 203.1 బిలియన్ డాలర్ల నుంచి 417.5 బిలియన్ డాల ర్లకు పెరిగింది. ‌దాదాపు రెట్టింపు అయ్యింది.

దిగుమతులే వేగంగా…
ఈ కాలంలో బ్రిక్స్ దేశాలకు భారత ఎగుమతులు 64.3 బిలియన్ డాలర్ల నుంచి 95.7 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంటే 48.8 శాతం పెరిగాయి. అదే సమయంలో దిగుమతులు మాత్రం ఏకంగా 131.8 శాతం ఎగిసి 138.8 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 321.8 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫలితంగా బ్రిక్స్ దేశాలతో భారత్ వాణిజ్య లోటు 74.5 బిలియన్ డాలర్ల నుంచి 226.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. దాదాపు మూడు రెట్లకు పైగా వాణిజ్యలోటు పెరిగినట్టయింది.

చైనా, రష్యా నుంచే అధిక దిగుమతులు
బ్రిక్స్ దేశాల నుంచి భారత దిగుమతుల్లో చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. చైనా నుంచి దిగుమతులు 65.2 బిలియన్ డాలర్ల నుంచి 131.6 బిలియన్ డాలర్లకు చేరాయి. భారత బ్రిక్స్ దిగుమతుల్లో చైనా వాటా దాదాపు 41 శాతంగా ఉంది. యుఎఇ నుంచి 63.9 బిలియన్ డాలర్లు, రష్యా నుంచి 55.4 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు దిగుమతయ్యాయి. రష్యా నుంచి దిగుమతులు 5.5 బిలియన్ డాలర్ల నుంచి 55.4 బిలియన్ డాలర్లకు పెరగడానికి ప్రధానంగా ఇంధన కొనుగోళ్లే కారణం. ఈ మూడు దేశాల నుంచే బ్రిక్స్ కూటమి నుంచి భారత్ చేసుకునే దిగుమతుల్లో దాదాపు 84 శాతం ఉన్నాయి.

యుఎఇకి అత్యధిక ఎగుమతులు
ఎగుమతుల పరంగా చూస్తే యుఎఇ భారత్‌కు అతిపెద్ద బ్రిక్స్ మార్కెట్‌గా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో యుఎఇకి భారత్ ఎగుమతులు 37.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చైనాకు 19.5 బిలియన్ డాలర్లు, సౌదీ అరేబియాకు 10.3 బిలియన్ డాలర్లు ఎగుమతయ్యాయి. బ్రెజిల్, దక్షిణాఫ్రికాకు 7 బిలియన్ డాలర్లు చొప్పున, రష్యా, ఇండోనేషియాకు 4.5 బిలియన్ డాలర్ల చొప్పున ఎగుమతులు జరిగాయి. అయితే ఇండోనేషియా, ఇరాన్, ఇథియోపియాలకు భారత్ ఎగుమతులు తగ్గాయి.

చైనాదే ఆధిపత్యం..
బ్రిక్స్ దేశాల మధ్య అంతర్గత వస్తు వాణిజ్యం కూడా భారీ స్థాయిలో ఉంది. కూటమి దేశాల మధ్య సుమారు 1.1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు, 1.4 ట్రిలియన్ డాలర్ల దిగుమతులు జరుగుతున్నాయి. ఇందు లో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. ఇతర బ్రిక్స్ దేశాలకు చైనా 550.8 బిలియన్ డాలర్ల విలువై న వస్తువులు ఎగుమతి చేస్తుండగా.. వాటి నుంచి 464.9 బిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకుంటోంది. బ్రిక్స్ సభ్య దేశాలన్నింటిలో భారత్‌కే అత్యధికంగా 226.1 బిలియన్ డాల ర్ల వాణిజ్య లోటు ఉండటం ఆందోళనకరం.

దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలి
యంత్రాలు, పారిశ్రామిక ముడిసరు కులు, ఇంధనం వంటి కీలక అవసరాలకు బ్రిక్స్ దేశాలపై భారత్ ఆధారపడు తున్నప్పటికీ.. అదే స్థాయిలో ఎగుమతులను పెంచుకోలేకపోతోంది. ముఖ్యంగా చైనా, రష్యా, ఇండోనేషియా వంటి మార్కెట్లలో భారత ఉత్పత్తులకు మరింత ప్రాధాన్యం పెంచడం, అధిక విలువ కలిగిన వస్తువుల ఎగుమతులను విస్తరించడం, కొన్ని దేశాలపై దిగుమతుల ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా ఈ వాణిజ్యలోటు అసమతుల్యతను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే బ్రిక్స్ కూటమితో భారత్ వాణిజ్య లోటు మరింత విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -