న్యూఢిల్లీ : తెలంగాణతో కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు గురువారం వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై అక్టోబర్ 13న విచారణ చేపట్టనున్నట్లు జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. గతంలో కృష్ణా పరీవాహక ప్రాంత పరిధిలోని రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేస్తూ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ చేయాల్సి ఉందని ఏపి ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో ఈ అంశానికి సంబంధించిన విధివిధానాలను ప్రస్తుతం కొనసాగుతున్న ట్రిబ్యునల్ పరిధిలోనే ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే కేంద్రం జారీ చేసిన ఈ గెజిట్‌ను సవాలు చేస్తూ ఏపి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన ట్రిబ్యునల్‌లో వాదనలు తుది దశకు చేరుకున్న విషయాన్ని ఏపి ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి తదుపరి ఉత్తర్వులు ఉండాలని ట్రిబ్యునల్‌కు స్పష్టం చేసిన విషయాన్ని కూడా గుర్తుచేసింది. అందువల్ల ట్రిబ్యునల్ విచారణను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఏపి ప్రభుత్వం ధర్మాసనాన్ని కోరింది. ఈ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన జస్టిస్ విక్రమ్‌నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం, అక్టోబర్ 13న రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.



