వారం రోజులకు చేరిన వీఓఏల సమ్మె కనీస వేతనం, జాబ్ చార్ట్ కోసం డిమాండ్
గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్నా గుర్తింపు కరువు మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నా మారని బతుకులు ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ లోనూ పని చేసినా అరకొర వేతనాలే
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
మహిళలను సంఘాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుంది. తాజాగా మండల సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులను సైతం అందజేసింది. వీరి ఆర్థికాభివృద్ధితో కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడి తద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకంతో కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో వీవోఏలు గ్రామీణ స్థాయి నుంచి సంఘాలు, సమాఖ్యలు బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నా.. వారికి కనీసం వేతనం అందని పరిస్థితి నెలకొంది. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో పనులు, నమోదు కార్యక్రమాలు చేస్తున్నా తమ సేవలను గుర్తించడం లేదని వీవోఏ (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్)లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఉండి కష్టపడి పనిచేస్తుంటే ఫలితాలు మాత్రం ఇతరులకు దక్కుతుందని వాపోతున్నారు. 40 రకాల విధులు చేయించుకుంటూ వేతనం మాత్రం 5 వేలు మాత్రమే చెల్లిస్తున్న పరిస్థితి. కనీస వేతనంతో పాటు ఇతరాత్ర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారు చేపట్టిన సమ్మె ఆదివారానికి ఏడు రోజులకు చేరింది. వీరి సమస్యలపై నవతెలంగాణ ప్రత్యేక కథనం.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో 25,207 మహిళా సంఘాలు ఉండగా.. 2,52,667 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. గ్రామాల్లో 20 నుంచి 30 సంఘాలతో కలిపి గ్రామ సమాఖ్య ఉండగా.. సదరు గ్రామంలో అంతకంటే ఎక్కువ సంఘాలు ఉంటే రెండు సమాఖ్యలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సమాఖ్యలతో పాటు సంఘాలకు నెలవారీగా మీటింగ్‌లు నిర్వహించడం, లోన్‌లు ఇప్పించడం, రుణాలు సకాలంలో చెల్లించేలా చూడటం లాంటి బాధ్యతలను వీవోఏలు నిర్వర్తిస్తున్నారు. ఇందుకోసం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 806 మంది వీవోఏలు పని చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 వేల మంది వీవోఏలు ఉన్నారు.
పనులెక్కువ.. వేతనం తక్కువ
గ్రామీణ స్థాయిలో వీవోఏలు.. సంఘాలతో పాటు సమాఖ్యలతో ప్రతి నెలా మీటింగ్ నిర్వహించి గ్రూప్ ఫోటోలు, ఐరీస్‌తో తీసుకుంటూ లోకోస్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. దాంతో పాటు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకుంటున్న రుణాలు, వాటి చెల్లింపులు, అసలు, వడ్డీ ఎంత వరకు చెల్లించారు వంటి లెక్కలను ప్రతి నెల యాప్‌లో ఎంట్రీ చేస్తూ మండలానికి అప్‌డేట్ చేస్తుండాలి. సంఘాలు చెల్లించే రుణాల స్థితిని బట్టి గ్రేడ్‌లు కేటాయిస్తారు. ఏ, బీ ఉంటే వేతనం వస్తుంది. సీ, డీలో ఉంటే ఆ నెల వేతనాలు నిలిచిపోతాయి. ఆరు నెలలకోసారి జరిగే ఆడిట్‌కు లెక్కలు సమర్పించాలి. వీటితో పాటు మÖడు నెలలకోసారి 80 మంది సభ్యులతో కొత్త యాక్టివిటీ చేయించి వివరాలు అప్‌లోడ్ చేయించాలి. ఇలా సుమారు 40 రకాల పనులు చేయిస్తున్నా ప్రభుత్వం చెల్లించే వేతనం కేవలం రూ.5000 మాత్రమే. సమాఖ్యల లాభాలను బట్టి రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఇస్తున్నారు. సమాఖ్యలు నష్టాల్లో ఉంటే అవి కూడా చేతికి అందవు.
జాబ్ చార్ట్ లేదు.. ఉద్యోగ భద్రత కరువు
మహిళా సంఘాలు బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నా.. వీరి సేవలను గుర్తించిన దాఖలాలు లేవని వాపోతున్నారు. తాము ఇచ్చిన వివరాలతో సెర్ప్ ఉద్యోగులు మెప్ప్పు పొందుతున్నారు కానీ తమ సేవలను గుర్తించడం లేదు. పీఎఫ్, ఈఎస్ఐ లేదు. జాబ్ చార్ట్ లేదు. ఇది వరకే 40 రకాల విధులు నిర్వర్తిస్తుంటే వీటికి అదనంగా మహిళలకు చదువులు చెప్పించడం, ఓపెన్ టెన్త్ పరీక్షలు రాయించడం, బీఎల్‌వో డ్యూటీలు, కౌమార బాలికలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఏ సమావేశం ఉన్నా మహిళలను తీసుకెళ్లే బాధ్యత వీరికి అప్పగిస్తుండటం గమనార్హం. ఇంత చేస్తున్నా కనీసం వేతనం లేదు. దాంతో ఈ నెల 25వ తేదీ సోమవారం నుంచి సమ్మె బాట పట్టారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేసి, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ట్యాబ్‌లు అందజేసి ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేయించాలని, పని భారం తగ్గించాలని కోరుతున్నారు.
జాబ్ చార్ట్ అమలు చేయాలి
వీవోఏలకు జాబ్ చార్ట్ అమలు చేయాలి. ఇది వరకే 40 రకాల పనులు చేస్తున్నా ఇంకా జాబ్ చార్ట్‌లో లేని పనులు మాతో చేయిస్తున్నారు. ఇంత చేస్తున్నా వేతనం మాత్రం నెలకు 5 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఇంత తక్కువ వేతనంతో పని చేసేది రాష్ట్రంలో వీవోఏలు మాత్రమే. జాబ్ చార్ట్ అమలు చేయాలి. సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయాలి. ఈఎసఐ, పీఎఫ్ అమలు చేయాలి.
పోశెట్టి. వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షులు
పనికి తగ్గ వేతనం ఇప్పించాలి
ఒక్కో వీవోఏకు 20 నుంచి 30 సంఘాల బాధ్యతలు చూస్తున్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేం దుకు మా వంతుగా శక్తివంచన లేకుండా పని చేస్తున్నా వేతనం మాత్రం రూ.5 వేలే ఇస్తున్నారు. సమాఖ్య లాభాలను బట్టి అదనంగా వేతనం అంటే కొన్ని సంఘాలు నష్టాల్లో ఉన్నవి. అనేక రకాల పనులు చేయించుకుంటున్న వీవోఏలకు పనికి తగ్గ వేతనం చెల్లించాలి. అన్ని రకాల ఆన్‌లైన్ నమోదు మేము చేస్తుంటే సెర్ప్ ఉద్యోగులకే లాగిన్ ఉంది. మాకు కూడా లాగిన్ ఇస్తే మా పనితీరు తెలుస్తుంది. కేవలం పుస్తక నిర్వహణ కోసమే పని చేస్తున్నట్టు తప్ప్పుడు నివేదికలు ప్రభుత్వానికి ఇస్తున్నారు. అది సరికాదు.
అరుణ. వీవోఏల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు



