220 మంది తమిళనాడు ఎమ్మెల్యేల విజయంపై ఎడిఆర్ నివేదిక
చెన్నై : ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థుల్లో కనీసం 220 మంది తమ నియోజకవర్గాల్లో పోలైన మొత్తం ఓట్లలో 50% కంటే తక్కువ ఓట్లనే సాధించారు. ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ (ఎడిఆర్), ‘తమిళనాడు ఎలక్షన్ వాచ్’ (టిఎన్‌ఇడబ్ల్య) మంగళవారం విడుదల చేసిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.
రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల ఓట్ల వాటాను వారు విశ్లేషించారు. 2026 ఎన్నికల్లో ఓటింగ్ శాతం 85.91%గా నమోదవ్వగా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ శాతం 73.45%గా ఉంది.
ఈ నివేదిక ప్రకారం, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలు పోలైన మొత్తం ఓట్లలో సగటున 38.99% ఓట్లతో గెలుపొందారు. 2021 ఎన్నికల్లో విజేతలు సగటున 48.37% ఓట్లతో గెలిచారని ఆ నివేదిక పేర్కొంది. విజయం సాధించిన 14 మంది అభ్యర్థులు తమతమ నియోజకవర్గాల్లో పోలైన మొత్తం ఓట్లలో 50% లేదా అంతకంటే ఎక్కువ ఓట్లను దక్కించుకున్నారు. మొత్తం 15 మంది విజేతలు వెయ్యి ఓట్ల కంటే తక్కువ మెజారిటీతో గెలుపొందగా, ఎనిమిది మంది విజేతలు 25% కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచారని ఆ నివేదిక పేర్కొంది. మొత్తం 194 మంది కోటీశ్వరులైన విజేతలలో 11 మంది 50% లేదా అంతకంటే ఎక్కువ ఓట్ల వాటాతో గెలుపొందగా, 40 మంది కోటీశ్వరులు కాని విజేతలలో ముగ్గురు 50% లేదా అంతకంటే ఎక్కువ ఓట్ల వాటాతో విజయం సాధించారు. తిరుపత్తూరులో కేవలం ఒక్క ఓటు తేడాతో డిఎంకె మంత్రి పెరియ కరుప్పన్ ఓటమి పాలయ్యారు.
మహిళా విజేతలు
మొత్తం 234 మంది విజేతలలో 23 మంది మహిళలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరందరూ తమతమ నియోజకవర్గాల్లో 32% లేదా అంతకంటే ఎక్కువ శాతం ఓట్లతో విజయం సాధించారు. మహిళా విజేతలలో, తిరుప్పూర్ (ఉత్తర) నియోజకవర్గం నుండి పోటీ చేసిన వి. సత్యభామ (టివికె) తన నియోజకవర్గంలో అత్యధికంగా 49.88% ఓట్లతో విజయం సాధించారు,” అని ఆ నివేదిక పేర్కొంది. పోలైన మొత్తం 4,93,24,125 ఓట్లలో, 1,99,805 (0.41%) ఓట్లు నోటాకు పోలయ్యాయి.
తిరుప్పూరులో రిటర్నింగ్ అధికారి నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించినట్లు ధ్రువీకరణ పత్రం స్వీకరిస్తున్న వి. సత్యభామ (పైల్) (తమిళనాడు మహిళా అభ్యర్థుల్లో అత్యధికంగా 49.88% ఓట్లు సాధించారు)
50 శాతం కంటే తక్కువ ఓట్లతోనే గెలుపు
- Advertisement -
- Advertisement -



