నవతెలంగాణ-సిర్పూర్(టి)
సూక్ష్మ కళ ద్వారా చరిత్ర, సాహిత్యం, సంస్కృతిని భావితరాలకు చేరవేస్తున్న యువ కళాకారుడు దుర్గం వినయ్ కుమార్ మరో వినూత్న కళాఖండంతో ప్రశంసలు అందుకుంటున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అచ్చెలి గ్రామపంచాయతీ పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన వినయ్ కుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ జీవిత చరిత్రను రాష్ట్ర వృక్షమైన జమ్మి ఆకులపై లిఖించి తన ప్రత్యేక ప్రతిభను చాటుకున్నారు.
ముఖ్యమంత్రి జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని, కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ కళాఖండాన్ని రూపొందించారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, ప్రజాసేవా కార్యక్రమాలు, నాయకత్వ విశేషాలను సూక్ష్మ అక్షరాలతో జమ్మి ఆకులపై పొందుపరచడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రజలు, విద్యార్థులు, సాహిత్యాభిమానులు ఆయన కృషిని అభినందిస్తున్నారు.
ప్రస్తుతం కరీంనగర్‌లోని శ్రీ వశిష్ట విద్యాశిక్షణ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న వినయ్ కుమార్, తెలంగాణ చరిత్రను ఆకులపై లిఖించే ప్రత్యేక శైలితో ఇప్పటికే గుర్తింపు పొందారు. సూక్ష్మ కళ పట్ల ఆయనకున్న ఆసక్తి, ఓర్పు, అంకితభావం ప్రతి కళాఖండంలో ప్రతిఫలిస్తోంది. అత్యంత చిన్న ఉపరితలాలపై వేలాది అక్షరాలను పొందుపరచడం వెనుక నిరంతర సాధన, ఏకాగ్రత, సృజనాత్మక దృష్టి ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
గతంలో వినయ్ కుమార్ రూపొందించిన కళాఖండాలు కూడా విశేష ఆదరణ పొందాయి. గింజలపై జాతీయ గీతం, తంగేడు ఆకులపై తెలంగాణ అంశాలు, అగ్గిపుల్లలపై అంబేద్కర్ ఆశయాలు, చింతాకులపై హనుమాన్ చాలీసా, సబ్బుబిళ్లపై తెలంగాణ పట చిత్రం, చాక్ ముక్కలతో కళారూపాలు, పెన్సిల్ మొనపై తెలంగాణ అక్షరాలు, నవధాన్యాలపై ప్రభుత్వ పథకాలు, బియ్యపు గింజలతో మహాత్మా గాంధీ చిత్రాన్ని రూపొందించి ప్రత్యేక గుర్తింపు పొందారు.
సూక్ష్మ కళ ద్వారా చరిత్ర, సాహిత్యం, సంస్కృతి, సామాజిక సందేశాలను ప్రజలకు చేరవేయడమే తన లక్ష్యమని వినయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, నాయకుల చరిత్రను యువతకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కళాఖండాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఆయన రూపొందిస్తున్న వినూత్న కళారూపాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తుండగా, ప్రస్తుతం మరిన్ని సృజనాత్మక కళాఖండాల రూపకల్పనలో నిమగ్నమై ఉన్నారు.



