Tuesday, August 4, 2026
E-PAPER
Homeక్రైమ్నల్లటి పేపర్లను రూ.500 నోట్లుగా మారుస్తానంటూ రూ.13 లక్షల మోసం

నల్లటి పేపర్లను రూ.500 నోట్లుగా మారుస్తానంటూ రూ.13 లక్షల మోసం

- Advertisement -

– నిందితుడి అరెస్ట్.. 
– బ్లాక్ పేపర్లు, రసాయనాలు స్వాధీనం
– గతంలోనూ నకిలీ కరెన్సీ, వాహన చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రేమ్ చంద్
నవతెలంగాణ – అశ్వారావుపేట

నల్లటి పేపర్లను ప్రత్యేక రసాయనాలతో కడిగితే అవి రూ.500 లు కరెన్సీ నోట్లుగా మారతాయని నమ్మించి ఒక వ్యక్తి నుంచి రూ.13 లక్షలు కాజేసిన మరో వ్యక్తిని అశ్వారావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం అశ్వారావుపేట సీఐ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్తిపాటి ప్రేమ్ చంద్ అనే వ్యక్తి అశ్వారావుపేట కు చెందిన మధుబాబు ను బ్లాక్ పేపర్లను కెమికల్‌ తో కడిగితే రూ.500 లు నోట్లుగా మారుతాయని నమ్మించాడు. ముందుగా నల్లటి పేపర్ల కట్టలు ఇచ్చినందుకు రూ.11 లక్షలు, అనంతరం వాటిని నోట్లుగా మార్చేందుకు అవసరమైన రసాయనాల పేరుతో మరో రూ.2 లక్షలు తీసుకుని మొత్తం రూ.13 లక్షలు మోసం చేసినట్లు విచారణలో నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు.

నిందితుడి వద్ద నుంచి మోసానికి ఉపయోగించిన రూ.500 లు నోట్ల పరిమాణంలో కత్తిరించిన సుమారు 20 వేల బ్లాక్ పేపర్లు, వాటిని కరెన్సీ నోట్లుగా మారుస్తామని చెప్పేందుకు వినియోగించిన రెండు రకాల రసాయనాల బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విచారణలో నిందితుడు గతంలో నకిలీ కరెన్సీ, మోటార్ సైకిల్ దొంగతనాలకు సంబంధించిన కేసుల్లో బాచుపల్లి, రామచంద్రాపురం, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నిందితుడిగా ఉండి జైలుశిక్ష అనుభవించినట్లు తేలిందని డీఎస్పీ తెలిపారు.

ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీ, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయంటూ ఆశ చూపే మోసగాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఇటువంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో అశ్వారావుపేట సీఐ పింగళి నాగరాజు,ఎస్.హెచ్.ఓ ఎస్ఐ యాయాతి రాజు,అదనపు ఎస్సై దేవ్ సింగ్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -