బొగ్గు లారీలు అడ్డుకొని నిరసన
భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ సమావేశం
నవతెలంగాణ – మల్హర్ రావు
ఈ నేల 7న భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కాటారం సబ్ కలెక్టర్, జెన్కో అధికారులు,తాడిచెర్ల భూ నిర్వాసితులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జెన్కో అధికారులు మాట్లాడిన డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు తీసుకోమ్,ఇండ్ల కింద బొగ్గు నిల్వలు లెవ్,ఇండ్లను లీజుకు తీసుకుంటాం తదితర మాటలతో నిర్వాసితులు అయోమయానికి గురైయ్యారు. మంగళవారం భవిష్యత్ కార్యాచరణపై అత్యవసర సమావేశం మండల కేంద్రమైన తాడిచెర్లలోని ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న భూ నిర్వాసితులు పురాతన పాత భవనం దగ్గర దాదాపు 500 మంది సమావేశం అయ్యారు.
ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించడానికి సరిహద్దుల్లో ఆర్మీ జవాన్లు త్యాగం చేస్తున్నానేది ఎంత సత్యమో.. జాతీయ సంపధైన బొగ్గు (నల్ల బంగారం) అందించడానికి తాడిచెర్ల, కాపురం రైతులు బంగారు పంటలు పండే భూములు త్యాగం చేశారు.త్యాగానికి ముందు జెన్కో,రెవెన్యూ అధికారులు చిలకపలుకులు పలికి మీకు అన్నివిధాలా మేమున్నాం,మీ త్యాగం గొప్పది,డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు,భూములు సేకరించి పరిహారం,ప్యాకేజి,పునరావాసం కల్పిస్తాం అని ఇంటి నెంబర్లు, సామాజిక,ఆర్థిక సర్వేలు నిర్వహించి పబ్లిక్ గెజిట్ చేసి ఇదిగో పరిహారం అదిగో పరిహారం అని మాయమాటలు చెప్పి బొగ్గు తవ్వకాల పనులు తుది దశకు చేరాక ఇండ్లు తీసుకునేందుకు వెనకాడడం ఎంతవరకు కరెక్ట్ అని నిర్వాసితులు మండిపడ్డారు.
ఇచ్చిన మాటకు తాము కట్టుబడి ఉన్నప్పుడు అధికారులు కూడా మాటపై కట్టుబడి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు భూములు సేకరించాలని డిమాండ్ చేశారు.అధికారులు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఒక్క బొగ్గుపెళ్ల కూడా బయటకు పోకుండా బొగ్గు తవ్వకాలు, బొగ్గు రవాణా చేస్తున్న లారీలను అడ్డుకొని నాలుగు గంటలపాటు ఆందోళన, నిరసన చేపట్టారు.ఈ కార్యక్రమంలో వందలామంది నిర్వాసితులు పాల్గొన్నారు.




