– యూరోపియన్ దేశాలతో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్న ట్రంప్
– నానాటికీ పెరిగిపోతున్న దూరం
వాషింగ్టన్ : సంవత్సరం క్రితం జరిగిన మ్యూచిన్ భద్రతా సమావేశంలో అమెరికా ఉపా ధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రసంగం అందరినీ నివ్వెర పరచింది. వలసలు, భావ ప్రకటనా స్వేచ్ఛపై యూరప్ అనుసరిస్తున్న విధానాలను వాన్స్ తన ప్రసంగంలో తప్పుపట్టారు.
యూరప్ ఖండానికి లోపలి నుంచే ముప్పు పొంచి ఉన్నదని ఆయన చెప్పారు. అప్పటి నుంచి అమెరికా అధ్యక్ష భవనం ప్రపంచ క్రమాన్ని తలకిందులు చేస్తూనే ఉంది. యూరప్‌లోని శత్రు దేశాలతో పాటు మిత్ర దేశాలను కూడా ట్రంప్ ప్రతీకార సుంకాలతో ఇబ్బంది పెడు తున్నారు. కుంటిసాకులు చెబుతూ వెనిజులాపై అత్యంత అమానవీయంగా, నిస్సిగ్గుగా దాడి చేశారు. రష్యాకు అనుకూలంగా ఉండే నిబంధనలతో ఉక్రెయి న్‌లో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిం చారు. కెన డాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మార్చేయాలం టూ ఓ వింత డిమాండ్‌ను ముందుకు తెచ్చారు.
దూరం పెరుగుతోంది
ఈ వారం చివరలో మరోసారి మ్యూనిచ్‌లో భద్రతా సమావేశం జరగబోతోంది. ఇది నిర్ణయాత్మక భేటీలా కన్పిస్తోంది.
అమెరికా ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారు మార్కో రుబియో నేతృత్వం వహించబోతున్నారు. ఈ సమావేశానికి యాభైకి పైగా ప్రపంచ నేతలను ఆహ్వానించారు. యూరప్ భద్రత మరింత ప్రమాదకరంగా కన్పిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. యూరప్ తన కాళ్లపై తాను నిలబడాలని, అది తన స్వీయ రక్షణకు బాధ్యత వహించాలని గత సంవత్సరం చివరలో ప్రచురించిన అమెరికా భద్రతా వ్యూహం (ఎన్‌ఎస్‌ఎస్) సూచించింది. అంటే యూరప్ రక్షణకు తాను మద్దతు ఇచ్చేది లేదని అమెరికా దీని ద్వారా స్పష్టం చేసినట్లయింది. గ్రీన్‌లాండ్ విషయంలో నెలకొన్న సంక్షోభం అమెరికా, యూరప్ మధ్య దూరాన్ని బాగా పెంచింది. అమెరికాతో పాటు ప్రపంచ భద్రత కోసం గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని ట్రంప్ అనేక సందర్భాలలో చెబుతున్నారు. అవసరమైన గ్రీన్‌లాండ్‌పై బల ప్రయోగానికి కూడా సిద్ధమేనని ఆయన గతంలో హెచ్చరించారు కూడా. అయితే అమెరికా వైఖరిని డెన్మార్క్ ప్రధాని తీవ్రంగా నిరసించారు. అమెరికా సైనిక ఎత్తుగడలు నాటో కూటమిని విచ్ఛిన్నం చేస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ఇతర ప్రాధాన్యతల దృష్ట్యా ప్రస్తుతానికి గ్రీన్‌లాండ్ వివాదం సద్దుమణిగింది.
యూరప్ రక్షణ అవసరాలు తీరుస్తున్న అమెరికా
అమెరికా-యూరప్ మధ్య భద్రతా సంబంధాలు మరమ్మతు చేయలేని విధంగా దెబ్బతింటాయా అనే ప్రశ్న ఇప్పుడు అందరినీ కలవరపరుస్తోంది. అమెరికా పన్ను చెల్లింపుదారులు గత కొన్ని దశాబ్దాలుగా యూరప్ రక్షణ అవసరాలను తీరుస్తున్నారన్న మాట వాస్తవం. రక్షణ వ్యయం విషయంలో అట్లాంటిక్ కూటమిలోని దేశాల మధ్య అసమానతలు కన్పిస్తున్నాయి. ఉదాహరణకు స్పెయిన్ తన జీడీపీలో కనీసం రెండు శాతాన్ని కూడా రక్షణ అవసరాలకు కేటాయించలేకపోతోంది. అదే రష్యా ఏడు శాతానికి పైగా ఖర్చు చేస్తుండగా బ్రిటన్ వ్యయం రెండున్నర శాతం కంటే తక్కువగానే ఉంది. వాణిజ్యం, వలసలు, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి అంశాలపై అమెరికా, యూరప్ మధ్య విభేదాలు నెలకొన్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ సంబంధాలు, రష్యా దాడిని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌పై ట్రంప్ నిందలను గమనిస్తున్న యూరోపియన్ ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.
నాటో నిబంధన అమలయ్యేనా?
అమెరికా అధ్యక్ష భవనం ఆలోచనలు ఎక్కువగా ఆ దేశ జాతీయ భద్రతా వ్యూహం చుట్టూ తిరుగుతుంటాయి. అమెరికాకు మిత్రులుగా ఉన్న యూరోపియన్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సమూహాలకు ఈ వ్యూహం ప్రాధాన్యత ఇస్తోంది. సభ్య దేశాలలో దేనిపైన దాడి జరిగినా దానిని అందరిపై జరిగిన దాడిగానే చూడాలని నాటో ఛార్టర్‌లోని ఐదో ఆర్టికల్ చెబుతోంది. 1949 నుంచి గత సంవత్సరం వరకూ సభ్య దేశాలన్నీ దీనిని పాటించాయి. అయితే ట్రంప్ చర్యలు, యూరప్ విషయంలో ఆయనకు ఉన్న వ్యతిరేకతను చూస్తుంటే దాని ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. నాటో సభ్య దేశమైన డెన్మార్క్ నుంచి గ్రీన్‌లండ్‌ను స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్ ఎప్పుడు ఎలా స్పందిస్తారో ఎవరినీ తెలియదు.



