Thursday, February 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్‌ మహానగరం

మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్‌ మహానగరం

- Advertisement -

జీహెచ్‌ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్‌ కార్పొరేషన్లు
జీహెచ్‌ఎంసీ కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌
సైబరాబాద్‌ కమిషనర్‌గా శ్రీజన.. మల్కాజ్‌గిరికి వినయ్ కృష్ణారెడ్డి
ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం
క్యూర్‌ (సీయూఆర్‌ఈ) పరిధిలో నగర పాలన పునర్వ్యవస్థీకరణ జలమండలి కూడా…

నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)ని రాష్ట్ర ప్రభుత్వం మూడుగా విభజించింది. హైదరాబాద్‌ మహానగర పరిధిలో వికేంద్రీకృత నగర పాలనను బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం క్యూర్‌ (కోర్‌ అర్భన్‌ రీజియన్‌-సీయూఆర్‌ఈ) పరిధిలో పరిపాలనా పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. మెట్రోపాలిటన్‌ ఏరియా అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ (జీహెచ్‌ఎంసీ-1) శాఖ జారీ చేసిన జీ.ఓ.ఎంఎస్‌. నెం.55 ద్వారా ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. వేగంగా విస్తరిస్తున్న మహానగర ప్రాంతంలో పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడం, పౌర సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా జీహెచ్‌ఎంసీతో పాటు సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ), మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ)గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. మెట్రోపాలిటన్‌ ఏరియా అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌కు గ్రేటర్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజ్‌ గిరి మూడు మున్సిపల్‌ కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ను యథాతథంగా కొనసాగించింది. సీఎంసీకి శ్రీజన, ఎంఎంసీకి వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాత గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 150 డివిజన్లు డీలిమిటేషన్‌తో 243 అయ్యాయి. విలీన మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధిలో 57 డివిజన్లు ఏర్పాటయ్యాయి. మొత్తం 300 డివిజన్లకు విస్తరించింది.

జీహెచ్‌ఎంసీ పునర్విభజన..
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)ని మొత్తం 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులుగా ప్రభుత్వం విభజించింది. శంషాబాద్‌, రాజేంద్రనగర్‌, చార్మినార్‌, గోల్కొండ, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌లను జోన్లుగా నిర్ణయించింది. ఆయా జోన్ల పరిధిలో సర్కిళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
శంషాబాద్‌ జోన్‌: ఆదిభట్ల, బడంగ్‌పేట్‌, జల్‌పల్లి, శంషాబాద్‌
చార్మినార్‌ జోన్‌: సంతోష్‌ నగర్‌, యాకత్‌పురా, మలక్‌పేట, చార్మినార్‌, మూసారాంబాగ్‌.
ఖైరతాబాద్‌ జోన్‌: ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, బోరబండ, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట
రాజేంద్రనగర్‌ జోన్‌: రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, బహదూర్‌పుర, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, జంగమ్మెట్‌
గోల్కొండ జోన్‌: గోషామహల్‌, కార్వాన్‌, గోల్కొండ, మెహిదీపట్నం, మాసాబ్‌ ట్యాంక్‌
సికింద్రాబాద్‌ జోన్‌: కవాడిగూడ, ముషీరాబాద్‌, అంబర్‌పేట్‌, తార్నాక, మెట్టుగూడ

మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ)…
మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఎంఎంసీ)ను మూడు జోన్లతో ఏర్పాటైంది. 14 సర్కిల్స్‌, 74 వార్డులతో ఉంటుంది.
మల్కాజ్‌గిరిజోన్‌: కీసర, అల్వాల్‌, బోయిన్‌పల్లి, మౌలాలీ, మల్కాజ్‌గిరి.
ఉప్పల్‌ జోన్‌ : ఘట్‌కేషర్‌, కాప్రా, నాచారం, ఉప్పల్‌, బోడుప్పల్‌.
ఎల్బీనగర్‌ జోన్‌ : నాగోల్‌, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌.

సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ)…
కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ జోన్‌లతో కలిపి సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటైంది. 16 సర్కిల్స్‌, 76 వార్డులతో ఉంటుంది.
కూకట్‌పల్లి జోన్‌ : మాదాపూర్‌, ఆల్విన్‌ కాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట
శేరిలింగంపల్లి జోన్‌ : నార్సింగి, పటాన్‌చెరు, అమీన్‌పూర్‌, మియాపూర్‌, శేరిలింగంపల్లి
కుత్బుల్లాపూర్‌ జోన్‌ : చింతల్‌, జీడిమెట్ల, కొంపల్లి, గాజులరామారం, నిజాంపేట, దుండిగల్‌, మేడ్చెల్‌

జలమండలి విజభన..
జలమండలి పరిధిని విస్తరిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఆర్‌ఆర్‌ పరిధిలో నీటి సరఫరా, సివరేజ్‌ నిర్వహణను జీహెచ్‌ఎంసీ నుంచి జలమండలికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నీటి సరఫరా, మురుగు వ్యవస్థలతో పాటు సంబంధిత మౌలిక వసతుల అభివృద్ధిని కూడా జలమండలి చేపట్టనుంది. మల్కాజ్‌గిరి జలమండలి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఎస్‌.పంకజ, హైదరాబాద్‌ ఈడీగా సామ్రాట్‌ అశోక్‌, సైబరాబాద్‌ ఈడీగా ఎం.సంతోష్‌, లోక్‌భవన్‌ జాయింట్‌ సెక్రెటరీగా కె.శశి కిరణాచారిలను రాష్ట్ర సర్కార్‌ నియమించింది.

ప్రత్యేక అధికారిగా జయేష్‌ రంజన్‌ బాధ్యతలు స్వీకరణ
గ్రేటర్‌ హైదరాబాద్‌, మల్కాజ్‌ గిరి, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లకు ప్రత్యేక అధికారిగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్‌.వీ కర్ణన్‌ బాధ్యతలు స్వీకరించారు. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా జీ. సజన, మల్కాజ్‌ గిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా టీ. వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -