Wednesday, April 15, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఒంటికి చ‌ల్ల‌గా..

ఒంటికి చ‌ల్ల‌గా..

- Advertisement -

ఎండలు మండిపోతున్నాయి. అందరూ ఒంటికి చలువ చేసే ఆహార పదార్థాలు తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కూల్‌డ్రింగ్స్‌ వంటివి చల్లగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి అత్యంత హానికరం. అందుకే ఈ కాలంలో మజ్జిగ, పెరుగు వంటివి ఎక్కువగా తీసుకుంటే మంచిది. అయితే వీటితో వెరైటీగా కొన్ని వంటకాలు కూడా చేసుకోవచ్చు.
ఈ వేసవిలో మన శరీరానికి కావల్సిన చల్లదనాన్ని ఇవ్వడంతో పాటు ఎంతో రుచిగా కూడా ఉంటాయి. అలాంటి కొన్ని రుచుల గురించి ఈ రోజు తెలుసుకుందాం…


పెరుగు దోస

కావల్సిన పదార్థాలు: పెరుగు – కప్పు, రవ్వ/బియ్యం పిండి – కప్పు, నీరు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, బేకింగ్‌ సోడా – టీస్పూన్‌.
తయారు చేసే విధానం: పెరుగు, రవ్వ, ఉప్పును నీటిలో కలిపి పదిహేను నిమిషాలు నానబెట్టాలి. నానిన ఆ మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. చివరగా బేకింగ్‌ సోడా కలిపి, పెనంపై మందపాటి దోసలుగా వేసి, నూనె/నెయ్యి వేసి రెండు వైపులా కాల్చాలి. కొంచెం పుల్లటి పెరుగు వాడితే దోసలు రుచిగా ఉంటాయి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర కలిపితే రుచి ఇంకా బాగుంటుంది.
కొబ్బరి పెరుగు పచ్చడి
కావాల్సిన పదార్థాలు: పెరుగు – అర కప్పు, పచ్చికొబ్బరి ముక్కలు – అర కప్పు, నూనె – ఒకట్రెండు చెంచాలు, పచ్చిమిర్చి – మూడ్నాలుగు, అల్లం – చిన్న ముక్క, ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానం: స్టవ్‌ మీద కడాయిలో ఆయిల్‌ వేసి వేడి చేసుకోవాలి. నూనె లైట్‌గా వేడయ్యాక పచ్చిమిర్చి తుంపలు, అల్లం వేసుకుని దోరగా వేయించాలి. అవి వేగాక కట్‌ చేసి పెట్టుకున్న సన్నని పచ్చికొబ్బరి ముక్కలు వేసి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని చల్లార్చుకోవాలి. అనంతరం మిక్సీ జార్‌ తీసుకుని చల్లారిన పచ్చికొబ్బరి మిశ్రమం వేసుకొని మెత్తని పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి. గ్రైండ్‌ చేసుకునేటప్పుడు అవసరమైతే ఒకట్రెండు టీస్పూన్ల వాటర్‌ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్‌ బౌల్‌ తీసుకుని అందులో గ్రైండ్‌ చేసుకున్న పచ్చికొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి. అందులో పెరుగు, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. పెరుగు పచ్చడి కాస్త చిక్కగా ఉండాలనుకుంటే ఇలానే ఉంచి తాలింపు పెట్టుకోవాలి. ఒకవేళ పలుచగా కావాలనుకుంటే మాత్రం పెరుగులో కొద్దిగా వాటర్‌ యాడ్‌ చేసి కలుపుకోవాలి.

దహీ వడ
కావల్సిన పదార్థాలు: మినపవడలు – నాలుగు, గట్టి పెరుగు – కప్పు, నీళ్లు – ముప్పావు కప్పు, అల్లం ముక్క – అర అంగుళం, పచ్చిమిర్చి – మూడు, కరివేపాకు – ఒక రెమ్మ, కొత్తిమీర – మూడు రెమ్మలు, ఆవాలు – అర టీ స్పూను, జీలకర్ర – అర టీ స్పూను, పసుపు – పావు టీస్పూను, ఎండుమిర్చి – ఒకటి, నూనె – టేబుల్‌ స్పూను, ఇంగువ – చిటికెడు.
తయారి విధానం: గట్టి పెరుగులో నీళ్లు పోసి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా లేకుండా పెరుగును బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి. చిన్న కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి చిటపటలాడే వరకు వేయించాలి. అల్లం తరుగు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి కొద్ది సెకన్లు వేయించాలి. స్టవ్‌ కట్టేసి తాలింపును రెండు నిమిషాలు చల్లార నివ్వాలి. తర్వాత పెరుగలో వేసి బాగా కలపాలి. ముందుగా చేసి పెట్టుకున్న మినప వడలను పెరుగులో వేసి మునిగేలా నొక్కాలి. పైనకొత్తిమీర తరుగు చల్లి మూడు నాలుగు గంటల పాటు నాననివ్వాలి.

బెండకాయ పెరుగు కర్రీ
కావల్సిన పదార్థాలు: పెరుగు – రెండు కప్పులు, బెండకాయలు – పావు కేజీ, ఉల్లిగడ్డ – రెండు, కారం – టీస్పూను, పసుపు – టీస్పూను, ధనియాల పొడి – టీస్పూను, జీలకర్రపొడి – టీస్పూను, ఆవాలు – టీస్పూను, కరివేపాకు – రెండు రెమ్మలు, పచ్చిమిర్చి – రెండు, నూనె – సరిపడా, ఉప్పు – తగినంత.
కావల్సిన పదార్థాలు: స్టవ్‌పై పాన్‌పెట్టి రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేడి అయ్యాక ఉల్లిగడ్డ వేసి వేయించాలి. తర్వాత పొడవుగా తరిగిన బెండకాయలు వేసి చిన్నమంటపై వేయించాలి. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకొని మరికాసేపు వేయించాలి. ఇప్పుడు పెరుగు వేసి బెండకాయ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఐదు నిమిషాల పాటు వేయించి దింపుకోవాలి. స్టవ్‌పై మరో పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక పచ్చిమర్చి, కరివేపాకు, ఆవాలు వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని బెండకాయ కర్రీలో కలుపుకోవాలి. వేడి వేడిగా రోటీతో సర్వ్‌ చేసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -