నవతెలంగాణ – ఆలేరు టౌను
ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రవాణా అవుతున్న సుమారు రూ. 1కోటి విలువైన పాన్ మసాలా చోరీకి గురైన కేసును, ఆలేరు పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆలేరు పట్టణంలో సీఐ యాలాద్రి మంగళవారం విలేఖరుల సమావేశంలో తెలియజేశారు. నోయిడా నుంచి హైదరాబాద్‌కు ‘బాబా పాన్ మసాలా’ లోడ్‌తో వస్తున్న ఒక కంటైనర్ ట్రక్కు, ఏప్రిల్ నెల మొదటి వారంలో ఆలేరు సమీపంలో అదృశ్యమైందని న్యూ ఢిల్లీకి చెందిన వినోద్ ఉపాధ్యాయ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసామని తెలిపారు.
అనంతరం తమ దర్యాప్తు క్రమంలో హర్యానాకు చెందిన ట్రక్కు డ్రైవర్ సద్దాం, తన స్నేహితుడైన హైదరాబాద్‌కు చెందిన సిరాజ్‌తో కలిసి ఈ చోరీకి ప్లాన్ చేసినట్లు తేలిందని వీరు ఆలేరు సమీపంలోని హైవే పక్కన ఉన్న ఒక క్రషర్ వద్ద కంటైనర్‌ను ఆపి, అందులోని 296 కార్టన్ల పాన్ మసాలాను వేరే వాహనంలోకి మార్చారని తెలిపారు. అనంతరం ఆ సరుకును హైదరాబాద్‌లోని చంచల్‌గూడ ప్రాంతంలోని ఒక గోదాముకు తరలించి, అక్కడ దాచిపెట్టి విక్రయించాలని పథకం వేయడంతో గోదాముపై దాడి చేసి 233 కార్టన్ల పాన్ మసాలాను పట్టుబడి చేశామన్నారు. దీని విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని చెప్పారు.
ప్రస్తుతం ప్రధాన నిందితుడు సద్దాంను రిమాండ్‌కు తరలించామని పరారీలో ఉన్న మరో నిందితుడు సిరాజ్ కోసం గాలిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఎన్ వినయ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




