ఇంట్రాడేలో సెన్సెక్స్ 1600 పాయింట్లు ఫట్
రూపాయిపై ఒత్తిడి..యూఎస్ సూచీలు పతనం
ముంబయి : అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు విఫలం కావడం మార్కెట్లను మళ్లీ బెంబేలెత్తించాయి. సోమవారం భారత్ సహా యూఎస్ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 1600 పాయింట్ల మేర పతనమయ్యింది. అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల జరిగిన చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండా విఫలం కావడం, హార్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశించడంతో సోమవారం ఉదయం భారత ఈక్విటీ మార్కెట్ భారీ అమ్మకాలను చవిచూసింది. దీనివల్ల ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.డాలర్‌తో రూపాయి మారకం విలువ 56 పైసలు కోల్పోయి 93.39కి పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సెన్సెక్స్ ఇంట్రాడేలో 1,682 పాయింట్లు లేదా 2.1 శాతం పడిపోయి 75,868.32 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. తుదకు కొంత కోలుకుని సెన్సెక్స్ 703 పాయింట్లు 0.91 శాతం నష్టంతో 76,847.57కు పరిమితమయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 208 పాయింట్లు లేదా 0.86 శాతం నష్టంతో 23,842.65 వద్ద ముగిసింది. ”అమెరికా-ఇరాన్ శాంతి చర్చల విచ్ఛిన్నం, హార్ముజ్ జలసంధిలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం ముడి చమురు ధరలను బ్యారెల్‌కు 100 డాలర్లను పైన పలికింది. పెరిగిన చమురు ధరలు ద్రవ్యోల్బణం, కరెన్సీ స్థిరత్వంపై ఆందోళనలను పెంచుతున్నాయి” అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. రంగాల వారిగా నిఫ్టీ ఆటో, ఆయి ల్ అండ్ గ్యాస్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాలు భారీగా నష్టపోయాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా దాదాపు 0.50 శాతం మేర క్షీణించాయి.
వాల్‌స్ట్రీట్‌లోనూ యుద్ధ దడ..
అమెరికా స్టాక్ మార్కెట్లు డౌ జోన్స్, ఎస్‌అండ్‌పి 500, నాస్డాక్ సూచీలు ప్రారంభంలోనే కుప్పకూలాయి. అమెరికా- ఇరాన్ మధ్య వారాంతంలో జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో దీని ప్రభావంతో సోమవారం వాల్ స్ట్రీట్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. 9:40 గంటల సమయానికి డౌ జోన్స్ ఇండిస్టియల్ యావరేజ్ 356.14 పాయింట్లు (0.72 శాతం) తగ్గి 47,572.11 వద్ద ట్రేడింగ్ అయ్యింది. ఎస్‌అండ్‌పీ 500 22.25 పాయింట్లు లేదా 0.33 శాతం క్షీణించి 6,794.64 వద్ద, నాస్డాక్ కాంపోజిట్ 81.74 పాయింట్లు లేదా 0.36 శాతం పడిపోయి 22,821.15 వద్ద ట్రేడవుతున్నాయి.
మార్కెట్లలో మళ్లీ యుద్ధ వణుకు
- Advertisement -
- Advertisement -



