రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలి :
సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్లు టి.సాగర్, పశ్య పద్మ
నవతెలంగాణ – ముషీరాబాద్
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందాలు రద్దయ్యే వరకు పోరాడుదామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) రాష్ట్ర కన్వీనర్లు టి.సాగర్, పశ్య పద్మ, బి.రాము, మామిడాల బిక్షపతి, జక్కుల వెంకటయ్య, ఎన్రెడ్డి హంసారెడ్డి, నాగిరెడ్డి, వెంకటేశ్వర్లు, ఆలకుంట్ల సాయన్న పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద సోమవారం ఎస్‌కేఎం నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, సూర్య నారాయణ, దేవరామ్, కోటేశ్వరరావు, ఇంద్రసేన, తుకారాం నాయక్, సనప పొమ్మయ్య, వి.సదానందం అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సంయుక్త కిసాన్ మోర్చ రాష్ట్ర కన్వీనర్ టి.సాగర్ మాట్లాడుతూ.. దేశంలో వరి, గోధుమ, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, చెరుకు వంటి పంటలతోపాటు పాడి, పశుసంవర్థక రంగాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నాయని చెప్పారు. రైతు అభివృద్ధి అంటే గ్రామీణ స్థిరత్వం, ఆహార భద్రత, సామాజిక సమానత్వానికి పునాది అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 10న కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం రైతాంగానికి తీవ్రమైన ముప్పు అని అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారతదేశంలో సుంకాలను పూర్తిగా తొలగించగా, భారత ఉత్పత్తులపై అమెరికాలో సుమారు 18 శాతం సుంకం కొనసాగుతుండటం అసమానతకు నిదర్శనమని తెలిపారు. దీని ప్రభావంగా పత్తి దిగుమతులు భారీగా పెరిగాయని వివరించారు. 2024 జనవరి-నవంబర్ మధ్య 199.30 మిలియన్ డాలర్ల విలువైన పత్తి దిగుమతులు కాగా 2025లో అదే కాలానికి 377.90 మిలియన్ డాలర్లకు పెరిగాయని, దాదాపు 95.5 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. ఫలితంగా దేశంలో పత్తి ధరలు కనీస మద్దతు ధర స్థాయి నుంచి గణనీయంగా పడిపోయాయని అన్నారు.
రాష్ట్ర కన్వీనర్ పశ్య పద్మ మాట్లాడుతూ.. అమెరికా, భారత్ వ్యవసాయ పరిస్థితుల్లో ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. భారత్‌లో 86 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉండగా, అమెరికాలో రైతుల సంఖ్య తక్కువగా ఉందని తెలిపారు. అక్కడ ఒక్కో రైతుకు లక్షల్లో సబ్సిడీలు లభిస్తుంటే, భారత్‌లో మాత్రం చాలా తక్కువ సాయం అందుతోందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత రైతులు అమెరికా రైతులతో పోటీ పడటం అసాధ్యమని, ఈ ఒప్పందం దేశ ఆహార భద్రతకూ ముప్పు అని అన్నారు. సబ్సిడీలు, బోనస్‌లు తగ్గించే ఒత్తిడి పెరుగుతోందని, ఇది రైతులతోపాటు ప్రజలందరికీ నష్టకరమని అన్నారు. అందు వల్ల రైతుల జీవనాధారాన్ని కాపాడేందుకు ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయా లని, రైతాంగ హక్కుల రక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం రద్దయ్యే వరకు పోరాడుదాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



