Tuesday, April 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహనీయుల ఆశయసాధనకు కృషి చేయాలి

మహనీయుల ఆశయసాధనకు కృషి చేయాలి

- Advertisement -

– తాత్కాలిక ఆనందం కోసం ఓట్లు అమ్ముకోవద్దు
– విగ్రహాల ఏర్పాటుతో సరిపెట్టొద్దు
– లక్ష్యాల వైపు ముందుకు సాగాలి: స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, మంత్రి దామోదర రాజనర్సింహ
– నవాబుపేటలో అంబేద్కర్‌, ఫూలే, బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహాల ఆవిష్కరణ
నవతెలంగాణ-నవాబుపేట్‌

మహనీయుల ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు. కేవలం విగ్రహాల ఏర్పాటుతో సరిపెట్టొద్దని, వారి లక్ష్యాల వైపు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తాత్కాలిక ఆనందం కోసం ఓట్లు అమ్ముకోవద్దని సూచించారు. వికారాబాద్‌ జిల్లా నవాబుపేట్‌ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్‌ అంబేద్కర్‌, మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రావు విగ్రహలను సోమవారం వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ముందుగా అందరికీ అంబేద్కర్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విగ్రహాలను ఆవిష్కరించే అవకాశం దక్కడం తమ అదృష్టం అన్నారు. సమానత్వం, న్యాయం, ఆత్మగౌరవం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయులను స్మరించుకోవడం గొప్ప విషయమన్నారు. ప్రపంచంలో జాతి వివక్ష, బానిసత్వం వంటి వివక్షలు ఉంటే.. మన దేశంలో అంటరానితనం అనే అమానవీయ వ్యవస్థ ఉండేదని, చతుర్వర్ణ వ్యవస్థ, కఠిన కుల వ్యవస్థ సమాజాన్ని తీవ్రంగా విభజించిందని తెలిపారు. ఈ అన్యాయాలు, అసమానతలను గౌతమ బుద్ధుడు, బసవేశ్వరుడు వంటి సంస్కర్తలు సవాల్‌ చేశారని గుర్తు చేశారు. మహాత్మాజ్యోతిరావు ఫూలే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, విద్య ద్వారా సమాజ మార్పును సాధించాలని నమ్మారని చెప్పారు. మహిళల కోసం తొలి పాఠశాల స్థాపించి మహిళా సాధికారతకు పునాది వేశారని అన్నారు. డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ చిన్ననాటి నుంచే వివక్షను ఎదుర్కొని, విద్యతో ఎదిగి భారత రాజ్యాంగ నిర్మాతగా నిలిచారని తెలిపారు. దళితులు మాత్రమే కాదు.. పేదలు, వెనుకబడిన అన్ని తరగతుల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు.

బాబు జగ్జీవన్‌రామ్‌ కూడా వివక్షను ఎదుర్కొని, దేశ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగి, దళితుల హక్కుల కోసం నిరంతరం పనిచేశారన్నారు. ఈ మహనీయుల లక్ష్యం సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణమేనని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. సామాజిక న్యాయం లేకుండా ప్రజాస్వామ్యం సంపూర్ణం కాదని అంబేద్కర్‌ చెప్పిన మాట అందరం గుర్తు చేసుకోవాలని సూచించారు. దేశంలో సామాజిక న్యాయం, పేదల సంక్షేమం, మహిళా సాధికారతలో కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషించిందన్నారు. భూసంస్కరణలు, అట్రాసిటీ వ్యతిరేక చట్టం, విద్యా హక్కు, సమాచార హక్కు, ఉపాధి హామీ చట్టం వంటి కీలక చట్టాలు తీసుకొచ్చిందని వివరించారు. రాష్ట్రంలో ప్రజాపాలనలో కూడా అన్నివర్గాల వారికి న్యాయం చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం తమ పార్టీ కృషి చేసిందన్నారు. విగ్రహాలు కేవలం శిల్పాలు కాదని, సమానత్వ పోరాటానికి ప్రతీకలని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -