Tuesday, April 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేసుల ఛేదనలో సీసీటీవీ కెమెరాలు కీలకం

కేసుల ఛేదనలో సీసీటీవీ కెమెరాలు కీలకం

- Advertisement -

– రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి
– ఆదిలాబాద్‌ పట్టణంలో పలు కార్యక్రమాల ప్రారంభం
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌

నేరాల నియంత్రణలో కీలకంగా వ్యవహరించి, కేసులను ఛేదించడానికి ఉపయోగపడేవి సీసీటీవీ కెమెరాలని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన 490 సీసీటీవీ కెమెరాలను సోమవారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 700 సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాల పాత్ర కీలకంగా ఉంటూ, ఒక కెమెరా 100 మంది పోలీసు సిబ్బందితో సమానంగా వ్యవహరిస్తుందని వివరించారు. ప్రజలు, వ్యాపార సంస్థలు, తమ గ్రామాల్లో, పట్టణాల్లో, వీధుల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని కోరారు. నేరస్థులు సీసీటీవీ కెమెరాలు ఉన్న ప్రదేశాలలో నేరాలను చేయడానికి భయపడతారని తెలిపారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్ద నేరాల నియంత్రణ పర్యవేక్షణ 24 గంటలు క్రమం తప్పకుండా ఉంటుందని తెలిపారు. అనంతరం పట్టణంలోని పోలీసు ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో నిర్వహించిన ఆపరేషన్‌ జ్వాలా ముగింపు, ఖాకీ కిడ్స్‌, వాహనాలు నడిపిన మైనర్‌లు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ కార్యక్రమానికి డీజీపీ హాజరయ్యారు. పోలీసు ముఖ్యకార్యాలయం ఎదుట ట్రాఫిక్‌ పార్క్‌ను ప్రారంభించారు. బస్సులో భరోసా కార్యక్రమంలో భాగంగా బస్సులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. మై టాక్సీ ఇస్‌ సేఫ్‌ 2.0 కార్యక్రమాన్ని డీజీపీ ప్రారంభించి 500 మంది ఆటో డ్రైవర్లతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, అదనపు ఎస్పీ బి.సురేందర్‌రావు, పరిపాలన అదనపు ఎస్పీ పి.మౌనిక, శిక్షణ ఐపీఎస్‌ అధికారి రాహుల్‌కాంత్‌, ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు, ఎస్‌ఐలు, రిజర్వు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -