డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం..
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి 2026-27 విద్యా సంవత్సరానికి దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం హైదరాబాద్ లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మెన్ వి.బాలకిష్టారెడ్డి అధికారులతో కలిసి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఏప్రిల్ 15 నుంచి మే 7వ తేదీ వరకు మొదటి ఫేజ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు వెబ్ ఆప్షన్లు ఉంటాయి. మే 14న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని ఆయన తెలిపారు. మే 15 నుంచి మే 23వ తేదీ లోపు విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో ఫేజ్ రిజిస్ట్రేషన్లు మే 15 నుంచి 25 వరకు, మూడో ఫేజ్ రిజిస్ట్రేషన్లు మే 31 నుండి జూన్ 15 వరకు చేసుకోవచ్చని తెలిపారు. ఆదివారం ఇంటర్ ఫలితాలు వెల్లడి కావడంతో వెంటనే డిగ్రీ కోర్సు చేయడానికి దోస్త్ ప్రవేశాల ప్రక్రియ వేగవంతం చేశారు. మరిన్ని వివరాల కోసం https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌లో చూడాలని సూచించారు. డిగ్రీలో ప్రవేశాల పట్ల ఆసక్తి పెంచేందుకు ఉపాధి ఆధారిత కొత్త కోర్సులను ఈ ఏడాది పరిచయం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఏ రంగాల్లో ఉద్యోగాలున్నాయో గుర్తించి అలాంటి వాటికి సంబంధించిన కోర్సులు అందిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది దోస్త్‌లో ఆ కొత్త కోర్సులు కూడా చేరుస్తున్నట్టు వెల్లడించారు. 52 కాలేజీల్లో కొత్త కోర్సులుంటాయనీ, మరో 69 కాలేజీలో పాత కోర్సుల స్థానంలో కొత్త కోర్సులను మార్చుకున్నట్టు వివరించారు. గతేడాది దోస్త్‌లో 969 కాలేజీల్లో 4,40,107 సీట్లు ఉండగా, అందులో 2,05,140 సీట్లు భర్తీ అయినట్టు తెలిపారు. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 23 వేల సీట్లు ఉండగా 11,387 భర్తీ అయినట్టు తెలిపారు. దోస్త్ పరిధిలో లేని కళాశాలలను కూడా దాని పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. గతేడాది 54 కాలేజీల్లో జీరో అడ్మిషన్లు వచ్చాయన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌తో పాటు పలు విషయాలను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు వి.బాలకిష్టారెడ్డి తెలిపారు. ఆర్థిక అంశాలకు సంబంధించి మండలికి కొన్ని పరిమితులున్నాయనీ, తమ పరిధికి లోబడి సూచనలు, సిఫారసులు చేస్తూనే ఉన్నామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్-1 ప్రొఫెసర్ ఇ.పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



