– సన్‌రైజర్స్ 216/6 రాయల్స్ 159/10
– తొలి ఓవర్లోనే 3 వికెట్లతో సంచలనం
– రాజస్తాన్‌పై హైదరాబాద్ ఘన విజయం
పరుగుల మోతతో ఊగిపోయే ఉప్పల్ స్టేడియం.. వికెట్ల వేటతో హోరెత్తింది. సన్‌రైజర్స్ యంగ్ పేసర్లు ప్రఫుల్ హింగే (4/34), షకిబ్ హుస్సేన్ (4/24) నిప్పులు చెరిగే ప్రదర్శన చేశారు. పవర్‌ప్లేలోనే రాజస్తాన్ రాయల్స్‌ను కకావికలం చేసి 9 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. అరంగ్రేట బౌలర్ల వీరోచిత మెరుపులతో రాజస్తాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ (91) అర్థ సెంచరీతో తొలుత సన్‌రైజర్స్ 216 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ సీజన్లో సన్‌రైజర్స్‌కు ఇది రెండో గెలుపు. రాయల్స్‌కు ఐదు మ్యాచ్‌ల్లో ఇదే తొలి ఓటమి.
నవతెలంగాణ-హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్ విక్టరీ సాధించింది. యువ పేసర్లు ప్రఫుల్ హింగే (4/34), షకిబ్ హుస్సేన్ (4/24) అసమాన బౌలింగ్ ప్రదర్శన కనబరిచారు. 217 పరుగుల ఛేదనలో రాజస్తాన్ రాయల్స్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. 57 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ ఘన విజయం సాధించింది. రాయల్స్ బ్యాటర్లు ఫెరీరా (69, 44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (45, 32 బంతుల్లో 5 ఫోర్లు) ఓటమిని ఆలస్యం చేయగలిగారు. వైభవ్ సూర్యవంశీ (0), ధ్రువ్ జురెల్ (0), ప్రిటోరిస్ (0), యశస్వి జైస్వాల్ (1), రియాన్ పరాగ్ (4) తేలిపోయారు. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (91, 44 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్థ సెంచరీతో రాణించాడు. హెన్రిచ్ క్లాసెన్ (40, 26 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), నితీశ్ కుమార్ రెడ్డి (28) రాణించారు. తొలి ఓవర్లోనే మ్యాచ్ గతిని శాసించిన యువ పేసర్ ప్రఫుల్ హింగే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
ప్రఫుల్ హింగే తీన్‌మార్
రాయల్స్ లక్ష్యం 217 పరుగులు. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ సహా బ్యాటింగ్ లైనప్ ఫామ్‌లో ఉంది. బలహీన బౌలింగ్‌తో ఈ స్కోరు నిలుపుకోవటం కష్టమే అనిపించింది. కానీ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే సన్‌రైజర్స్‌కు గెలుపు కిక్ ఇచ్చాడు అరంగ్రేట యువ పేసర్ ప్రఫుల్ హింగే. వైభవ్ సూర్యవంశీ (0), ధ్రువ్ జురెల్ (0), ప్రిటోరిస్ (0)లను తొలి ఓవర్లోనే అవుట్ చేశాడు హింగే. తొలి ఓవర్లోనే తీన్‌మార్ మోగించిన హింగే.. ఉప్పల్ స్టేడియాన్ని హోరెత్తించాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లోనే 3 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా హింగే నిలిచాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో మరో అరంగ్రేట పేసర్ షకిబ్ హుస్సేన్ వికెట్ల వేట కొనసాగించాడు. యశస్వి జైస్వాల్ (1) వికెట్‌తో రాయల్స్ శిబిరాన్ని నైరాశ్యంలోకి పడేశాడు. ప్రఫుల్ పటేల్ తన రెండో ఓవర్లో కెప్టెన్ రియాన్ పరాగ్ (4)ను సాగనంపాడు. దీంత 9 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ రాయల్స్ ఓటమి కోరల్లో కూరుకుంది. ఆశలు ఆవిరైన స్థితిలో రవీంద్ర జడేజా (45), డొనొవన్ ఫెరీరా (69) ఆరో వికెట్‌కు ఫిఫ్టీ ప్లస్ భాగస్వామ్యం జోడించారు. ఈ ఇద్దరు వికెట్ల పతనాన్ని అడ్డుకోవటంతో రాయల్స్ మూడెంకల స్కోరు అందుకుంది.
ఖతర్నాక్ కిషన్
టాస్ ఓడిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. అభిషేక్ సునామీ కోసం ఎదురుచూసిన అభిమానులకు రాయల్స్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ శర్మ (0)ను ఆర్చర్ డకౌట్ చేశాడు. ఈ ఏడాదిలో అభిషేక్‌కు ఇది ఏడో డకౌట్. ట్రావిశ్ హెడ్ (18) ధాటిగా ఆడలేకపోయాడు. దీంతో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ 51 పరుగులే చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (91), హెన్రిచ్ క్లాసెన్ (40) మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. కిషన్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. తుషార్ దేశ్‌పాండే ఓవర్లో 20 పరుగులు పిండుకున్న కిషన్.. రవి బిష్ణోరుపై స్లాగ్ స్వీష్ షాట్‌తో సిక్సర్ కొట్టి అర్థ సెంచరీ పూర్తి చేశాడు. క్లాసెన్ భారీ షాట్ల వేటలో తడబడినా.. ఓ ఎండ్‌లో కిషన్ దంచికొట్టాడు. ఆరు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో రెచ్చిపోయిన కిషన్.. సెంచరీ దిశగా సాగినా సందీప్ శర్మకు వికెట్ కోల్పోయాడు. కిషన్ వికెట్ పడే సమయానికి సన్‌రైజర్స్ 13.2 ఓవర్లలో 143/3తో నిలిచింది. క్లాసెన్ మరోసారి డెత్ ఓవర్లలో ఆకట్టుకోలేదు. అయినా, నితీశ్ కుమార్ రెడ్డి (28, 13 బంతుల్లో 4 సిక్స్‌లు), సాలిల్ అరోరా (24 నాటౌట్, 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించటంతో సన్‌రైజర్స్ 216 పరుగుల భారీ స్కోరు చేసింది. మిడిల్ ఓవర్లలో 3 వికెట్లకు 112 పరుగులు చేయగా.. ఆఖరు ఐదు ఓవర్లలో 2 వికెట్లకు 53 పరుగులు చేసింది. పవర్‌ప్లేలో ఇబ్బందిపడటం సన్‌రైజర్స్ స్కోరుపై ప్రభావం చూపించింది.
అనుకోకుండా అరంగ్రేట వీరులు
బలమైన బ్యాటింగ్ లైనప్‌కు సన్‌రైజర్స్ మారుపేరు. అభిషేక్ శర్మ, ట్రావిశ్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డితో కూడిన బ్యాటింగ్ లైనప్‌కు బ్యాకప్ బ్యాటర్ కోసం రూ. 14 కోట్లు వెచ్చించి లివింగ్‌స్టోన్‌ను కొనుగోలు చేసిన ఆరెంజ్ ఆర్మీ యాజమాన్యం.. ఓ మంచి బౌలర్‌ను తీసుకోలేదని అభిమానుల విమర్శ. అందుకు తగినట్టుగానే సన్‌రైజర్స్ బౌలింగ్ తేలిపోయింది. 200 ప్లస్ స్కోర్లను సైతం కాపాడుకోలేదు. రాయల్స్‌తో మ్యాచ్‌లోనూ 216 స్కోరు డిఫెండ్ చేస్తారనే అంచనాలు తక్కువ. పవర్‌ప్లేలో కొత్త బంతితో వచ్చిన అరంగ్రేట పేసర్లు ప్రఫుల్ హింగే (4/34), షకిబ్ హుస్సేన్(4/24) లు అద్భుతం చేశారు. ప్రఫుల్ పదునైన పేస్, వేరియేషన్స్‌తో తొలి ఓవర్లోనే 3 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. మరో అరంగ్రేట పేసర్ షకిబ్ హుస్సేన్ సైతం అంతే స్థాయిలో రెచ్చిపోయాడు. అరంగ్రేట వీరులు సంయుక్తంగా 8 ఓవర్లలో 58 పరుగులకు 8 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ప్రదర్శన ఓవరాల్‌గా ఈ సీజన్లోనే అత్యుత్తమం అని చెప్పవచ్చు. నాగ్‌పూర్‌కు చెందిన ప్రఫుల్ హింగే రంజీల్లో విదర్భకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత సీజన్లో 11 ఇన్నింగ్స్‌ల్లో 16 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో సీనియర్ సర్క్యూట్‌లో హింగేకు ఇది రెండో మ్యాచ్ మాత్రమే. కానీ విదర్భ టీ20 టోర్నమెంట్‌లో సత్తా చాటిన హింగే ఆరెంజ్ ఆర్మీ దష్టిలో పడ్డాడు. అరంగ్రేట అవకాశంలోనే అదరగొట్టి ఐపీఎల్‌లో గ్రాండీ ఎంట్రీ ఇచ్చాడు. షకిబ్ హుస్సేన్ బిహార్ మారుమూల ప్రాంతం నుంచి ఎదిగాడు. గత సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ శిబిరంలో ఉన్నా.. అవకాశం దక్కలేదు. ఈ ఏడాది సన్‌రైజర్స్‌కు వచ్చిన షకిబ్ ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో సత్తా చాటి అరంగ్రేట అవకాశం దక్కించుకున్నాడు.



