మహిళా బిల్లుతో రాజకీయ లబ్ది కోసం మోడీ సర్కారు పాట్లు
పశ్చిమబెంగాల్‌లో పాగా వేసేలా పావులు
2029 ఎన్నికలే టార్గెట్
– కీలకంగా మారనున్న డీలిమిటేషన్ అంశం
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తోంది. ఈ బిల్లు అమలు ప్రక్రియను వేగవంతం చేసి 2029 లోక్‌సభ ఎన్నికల్లో లబ్ది పొందాలని భావి స్తోంది. ఇందుకోసం ఆ పార్టీ ఒక ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తోందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ప్రస్తుతం భారత పార్లమెంట్.. నారీ శక్తి వందన్ అధినియమ్ (మహిళా రిజర్వేషన్ బిల్లు) సవరణలకు సిద్ధమవు తున్న నేపథ్యంలో భారత రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకోవచ్చని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ అంశం కూడా కీలకంగా మారింది. డీలిమిటేషన్ కోసం 2011 జనగణనను ఉపయోగించడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలగకుండా, రాజకీయ లాభాలను పొందాలని ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు భావిస్తోంది. 2023లో పార్లమెంటు 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన విషయం విదితమే. ఇది 2024 లోక్‌సభ ఎన్నికల ముందు మహిళా ఓటర్లను ఆకర్షించడానికి బీజేపీకి ఒక ప్రధాన అంశంగా మారింది. కానీ, ఆ తర్వాత ఈ అమలు ప్రక్రియను డీలిమిటేషన్‌కు అనుసంధానం చేయడ ం ద్వారా ఇది ఆలస్యమైంది. దీంతో 2024 లోక్‌సభ ఎన్నిక ల్లో అధికార బీజేపీ ఆశించినంతగా మహిళా ఓట్లను సాధిం చలేకపోయింది. విస్పష్ట మెజారిటీని కూడా సాధించలేక చతికిలపడిపో యింది.దీంతో ఇప్పుడు బీజేపీ ఈ మహిళా రిజర్వేషన్ అంశాన్ని 2029 ఎన్నికల కోసం ప్రధాన రాజకీ య ఎజెండాగా మార్చాలని చూస్తోందని రాజకీయ పరిశీల కులు చెప్తున్నారు. మొదట ఈ అమలు 2034 ఎన్నికలకే జరిగే అవకాశం ఉందని భావించినా.. 2029 ఎన్నికల్లో గెలవడం ముఖ్యమని పార్టీ భావిస్తోంది. 2024లో పార్టీకి సొంత మెజారిటీ రాకపోవడం ఇప్పటికీ నాయకత్వాన్ని ప్రభావితం చేస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు
ఈ ఏడాదిలో పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలకు అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ చేయబడ్డాయి. ఇప్పటికే కేరళం, అసోం, పుదుచ్చేరి ఎన్నికలు ఈనెల 9న ముగిశాయి. ఇక పశ్చిమ బెంగాల్(23, 29న)కు , తమిళనాడు (23న)కు ఎన్నికలు జరగాల్సి ఉంది. బీజేపీకి తమిళనాడు మీద పెద్దగా ఆశలు లేకపోయినప్పటికీ పశ్చిమబెంగాల్‌పై ఆ పార్టీ అధిష్టానం దృష్టిసారించింది. ఇక్కడ ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించు కోవాలని ప్రయత్నిస్తోంది. ఇందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఒక సాధనంగా వాడుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే మోడీ సర్కారు ఉన్నట్టుండి ఈనెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసిందని విపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి.
మహిళా నాయకత్వ లేమితో సతమతం
పశ్చిమ బెంగాల్‌లో మహిళా ఓటర్లపై మమతా బెనర్జీకి ఉన్న ప్రభావం బీజేపీకి ఇంకా ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ నాయకులు గెలుస్తామని చెప్పినా.. పార్టీ వద్ద మహిళా నాయకత్వం తక్కువగా ఉండటం ఒక బలహీనతగా ఉంది. టీఎంసీతో పోలిస్తే బీజేపీ పురుషాధిక్య పార్టీగా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో ”ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు” అనే భావంతో బీజేపీ పని చేస్తోంది. రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవాలన్న లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగితో సహా బీజేపీ అధిష్టానం పశ్చిమ బెంగాల్‌లో మోహరించింది. అందుకే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాకముందే కేంద్రంలోని మోడీ సర్కారు మహిళా రిజర్వేషన్ అంశంపై పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
డీలిమిటేషన్ రాజకీయాలు
వాస్తవానికి 2021లో జరగాల్సిన జనగణన.. ఆలస్యమై 2027లో జరగనున్నది. 1976లో ప్రారంభమైన డీలిమిటేషన్ ఫ్రీజ్.. 2001లో అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేరు ప్రభుత్వం ద్వారా 25 ఏండ్లు పొడిగించబడింది. అది 2026లో ముగియబోతోంది. కొత్త జనాభా గణాంకాలు వస్తే.. ఉత్తర, పశ్చిమ, మధ్య భారత రాష్ట్రాలకు పార్లమెంట్‌లో అధిక ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉంది. ఇది దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళనకు దారి తీసింది. పలు దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో టీడీపీపై ఆధారపడి కేంద్రంలో ఎన్డీఏ-3 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో దక్షిణ రాష్ట్రాలకు నష్టం కలగకుండా సమతుల్యత సాధించాల్సిన అవసరం ఏర్పడింది. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాత్ర కూడా ఇందులో ముఖ్యమని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అయితే 2011 జనగణన ఆధారంగా డీలిమిటేషన్ చేయడం ద్వారా ఈ సమస్యను సమతుల్యం చేయవచ్చని బీజేపీ భావిస్తున్నది. తాజా జనగణన పూర్తయ్యుంటే మాత్రం ఈ అవకాశం ఉండేది కాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
మోడీ రాజకీయ వ్యూహం
మోడీ తనను ‘డిస్ట్రప్టర్ (ఇప్పటికే ఉన్న విధానాలు, సంప్రదాయాలు, రాజకీయ పద్ధతులను మార్చి కొత్త మార్గాలు అనుసరించే నాయకుడు)’గా చూపించుకోవడంలో ఆసక్తి చూపుతారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. యూపీ ఎన్నికలకు ముందు ఆయన తీసుకున్న డీమానిటైజేషన్ (నోట్ల రద్దు) నిర్ణయం ఆర్థికంగా ప్రతికూల ప్రభావాన్ని చూపినా.. బీజేపీకి రాజకీయంగా లబ్ది చేకూర్చిందని గుర్తు చేస్తున్నారు. కాషాయపార్టీ యూపీలో అధికారాన్ని సొంతం చేసుకోగలిగిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా అలాంటి రాజకీయ మార్పు సాధనంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు.
పార్టీలకు సవాళ్లు
ఈ మార్పులతో దేశంలోని అన్ని పార్టీలకూ రెండు ప్రధాన సవాళ్లు ఎదురవుతాయి.
1. గెలిచే మహిళా అభ్యర్థులను గుర్తించడం
లోక్‌సభలో పెరిగే సీట్లతో సుమారు 239 స్థానాలు మహిళలకు దక్కే అవకాశం ఉంది. స్వతంత్ర భారతంలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ పురుషాధిక్యతే కనిపించింది. చట్టస భల్లో సభ్యులుగా పురుషులే అధికంగా ఎన్నికవుతూ వచ్చా రు. దీంతో మహిళలకు సరైన అవకాశాలు దక్కలేదు. దీంతో రాజకీయంగా వెనుకబడిపోయారు. ఇప్పుడు రిజర్వేషన్‌తో గెలిచే మహిళా అభ్యర్థులను గుర్తించడం అన్ని పార్టీలకూ కష్టంగా మారిందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
2. ఎన్నికల ఖర్చులు
ఇక ఎన్నికల ఖర్చులు కూడా చాలా కీలకం. అభ్యర్థి గెలుపులో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. దేశంలోని అన్ని పార్టీల కంటే కేంద్రంలోని అధికార బీజేపీ అత్యధిక నిధులను కలిగి ఉంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా చాలా వెనుకబడిపోయింది. ఇతర విపక్ష పార్టీలదీ అదే దారి. దీం తో రాజకీయ పార్టీలపై ఎన్నికల ఖర్చులు పెరిగి భారంగా మారనున్నాయని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
అదనపు రాజకీయ లాభం
2029 ఎన్నికల్లో ప్రస్తుత ఎంపీలపై ఉండే వ్యతిరేకతను తగ్గించే అవకాశం బీజేపీకి లభిస్తుంది. లోక్‌సభ సీట్లు పెంచడాన్ని ప్రజల ప్రయోజనంగా చూపించి, మరింత అభివృద్ధికి దారులు ఏర్పడతాయనే ప్రచారంతో కాషాయపార్టీ ముందుకెళ్లే అవకాశాలుంటాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మహిళా అభ్యర్థులను నిలబెట్టడంలో బీజేపీ వెనుకడుగు
నారీ శక్తి అంటూ పలు నినాదాలు, కార్యక్రమాలు, పథకాలతో మహిళల ఓట్లను పొందే ప్రయత్నం చేస్తున్న బీజేపీ.. పలు ఎన్నికల్లో వారిని అభ్యర్థులుగా నిలబెట్టడంలో మాత్రం వెనకాడుతోంది. వాస్తవంగా గత రెండు ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టిన పార్టీలుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ)లు ఉన్నాయి.



