Wednesday, April 15, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్48 గంటల్లో క్షమాపణ చెప్పాలి

48 గంటల్లో క్షమాపణ చెప్పాలి

- Advertisement -

– లేదంటే సివిల్‌, క్రిమినల్‌ చర్యలు : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీసులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అంగన్వాడీలకు సంబంధించిన మొబైల్‌ ఫోన్ల కొనుగోళ్ల విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీసేలా బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యవహరిస్తోందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ దనసరి అనసూయ సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి 48 గంటల్లో తనకు క్షమాపణ చెప్పాలనీ, లేదంటే సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు సీతక్క సోమవారం లీగల్‌ నోటీసులు పంపారు. మంత్రి తరపున అడ్వకేట్‌ నాగులూరి కృష్ణ కుమార్‌ రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా కేసీఆర్‌కు నోటీసు పంపారు. అంగన్వాడీ మొబైల్‌ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (టీజీటీఎస్‌) నిర్వహించిందని నోటీసులో సీతక్క పేర్కొన్నారు. టెండర్‌ ఎవాల్యుషన్‌ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్‌ జరిగిందని గుర్తుచేశారు. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ తన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం టెండర్‌ విలువ రూ.44.42 కోట్లేనని గుర్తుచేశారు. అందులో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది పూర్తిగా ఆధారాలు లేని ఆరోపణ అని కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో మొబైల్‌ను రూ.11,650కే కొనుగోలు చేశామని వివరించారు. ఇతర రాష్ట్రాల కంటే తక్కువ ధరకు టీజీటీఎస్‌ ద్వారా వాటిని కొనుగోలు చేశామని వివరించారు. బీఆర్‌ఎస్‌ తన అధికారిక సోషల్‌ మీడియా వేదికగా తనపై చేస్తున్న దుష్ప్రచారానికి పార్టీ అధినేతగా కేసీఆరే బాధ్యత వహించాలని సీతక్క డిమాండ్‌ చేశారు. 48 గంటల్లో ఆయా సోషల్‌ మీడియాల్లో పోస్టుల ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే కేసీఆరే స్వయంగా క్షమాపణ చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. గతంలో కూడా తనపై ఇలాగే తప్పుడు ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా కేటీఆర్‌ ప్రశ్నలకు తాను గట్టిగా సమాధానం చెప్పిన తర్వాతనే తనపై ఇలాంటి దాడి మొదలైందని సీతక్క గుర్తుచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -