Wednesday, April 15, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివెలుగులు నింపే కార్మికుల బతుకుల్లో చీకట్లు

వెలుగులు నింపే కార్మికుల బతుకుల్లో చీకట్లు

- Advertisement -

ఒక్క పది నిమిషాలు కరెంటుపోతే మనం అల్లాడిపోతాం. అంతేకాదు, పన్నెండు గంటలు డ్యూటీ చేస్తేనే అయోమయమవుతాం. మరి అలాంటిది కరెంటు కార్మికుల పరిస్థితి ఎప్పుడైనా చూశారా? ఇరవై నాలుగు గంటలు, ఎప్పుడు పడితే అప్పుడే, ఎండైనా, వానైనా, రాత్రైనా, ప్రమాదకరమైన పరిస్థితుల్లో విద్యుత్‌ స్తంభాలెక్కి పనిచేస్తారు. ఏ చిన్న తప్పిదం జరిగినా ప్రాణానికే ముప్పు. అయినా వాళ్లు వెనుకంజ వేయరు. ఎందుకంటే, వారు పనిచేయకుంటే సమాజమే అంధకారమవుతుంది కాబట్టి. మరి అంత శ్రమించేవారికి జీతమెందుకు తక్కువ అనుకుంటున్నారా? అదే ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సింది. ”ఒక గుడ్డివాడికి చూపు రాగానే మొట్టమొదట విసిరేసేది అప్పటివరకు సహాయపడిన చేతికర్రనే” అన్నట్లు ఓడిపోయినా నాయకులకు, గెలిచినా నాయకులకు కరెంటు కార్మికులు చేతికర్రలాంటోళ్లు. వాళ్లకి పదవి రాగానే కరెంటు కార్మికులను కంటికి కనపడకుండా తిరుగుతారు. అప్పటిదాకా ‘మేము ఉన్నాం మీకు అది చేస్తాం ఇది చేస్తా’ అన్నోళ్లే ఆఖరికి ఏమి చేయలేని పరిస్థితి.

తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్‌ కార్మికులకు శాశ్వత హోదా కల్పించాడని ఏండ్లతరబడి మొత్తుకున్నా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఇగ చేస్తాం అగ చేస్తాం అని చెప్పుడే తప్ప చేసిందేమిలేదు. గత 18 ఏళ్లకు పైగా తెలంగాణ విద్యుత్‌ రంగంలో కాంట్రాక్ట్‌ కార్మికులుగా సేవలందిస్తున్నవారు. అప్పటి తెలంగాణ ఉద్యమ సమయంలో, వీరి సేవలను క్రమబద్ధీకరిస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీనిచ్చారు. ఆ హామీ నెరవేరకపోవడంతో, 2016లో విద్యుత్‌ కార్మిక సంఘాలతో కలిసి నిరసన తెలిపారు. నిరసన కారణంగా జూలై 28, 2017న పారిశ్రామిక వివాదాల చట్టం, 1947లోని సెక్షన్‌ 12(3) ప్రకారం ఒప్పందం కుదిరింది. జూలై 29, 2017న సంస్థలో విలీనం చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంతవరకు చూస్తే సమస్య పరిష్కారం దిశగా వెళ్లినట్టే కనిపించింది. అయితే, ”మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు” కొందరు నిరుద్యోగ యువకులు దీన్ని హైకోర్టులో సవాలు చేసి నీరుగార్చేలా చేశారు. సెప్టెంబర్‌ 18, 2018న హైకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పునిస్తూ, సెక్షన్‌ 12(3) ప్రకారం ఈ సమస్యలను పరిష్కరించుకునే అధికారం విద్యుత్‌ సంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మిక సంఘలకు ఉందని స్పష్టం చేసింది. అప్పటి ముఖ్యమంత్రి అసెంబ్లీలో, గవర్నర్‌ ప్రసంగం ద్వారా 23,667 మంది కార్మికులను క్రమబద్ధీకరించినట్లు ప్రకటించారు. కానీ, కార్మికుల రెగ్యులరైజేషన్‌ అనే ప్రక్రియ అనేక మలుపులు తిరుగుతూ కార్మికులకు పూర్తిస్థాయి క్రమబద్ధీకరణకు బదులుగా, పాత ఉత్తర్వులను రద్దు చేసి, ఫ్యాక్టరీల చట్టం 1946 స్టాండింగ్‌ ఆర్డర్స్‌ సర్వీస్‌ రూల్స్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల అధికారికంగా శాశ్వత హోదా లేకుండానే కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నారు. ”చెప్పుకొని మురువు చూసుకొని ఏడువు” అన్నట్లు వీరు సమాజం దఅష్టిలో శాశ్వత ఉద్యోగులే కానీ, ప్రభుత్వ దృష్టిలో మాత్రం కాదు. చెప్పుకోవడానికి కరెంటు ఉద్యోగం కానీ వీరి జీవితం కన్నీళ్లు కష్టాలే. జీతం పెంచుడు దేవుడెరుగు కానీ, మా కష్టాలను చూసైనా కనికరించండయ్యా మహా ప్రభో అని వేడుకున్నా వినే నాయకుడు లేడు.

ఇక పని విషయానికి వస్తే… ఎంత చెప్పుకున్నా వీరి కష్టాలు తక్కువగానే అనిపిస్తాయి. ఇతర ప్రభుత్వ ఆఫీసుల్లో ఒకరి పని నలుగురు చేస్తుంటే, కరెంట్‌ ఆఫీసుల్లో మాత్రం ఐదుగురు చేయాల్సిన పనిని ఇద్దరు ముగ్గురే మోస్తున్నారు.సమాన అవకాశాలు లేవు. గత రెండేళ్లుగా రెగ్యులర్‌ అయిన వాళ్లకి, రెగ్యులర్‌ కాని వాళ్లకి 30శాతం నుంచి 60శాతం వరకు జీతాల్లో తేడా ఉంది. సాధారణంగా ఏడాదికి 300 షిఫ్టులు ఉండాలి.కానీ, వీరు 450 షిఫ్టులు చేస్తున్నారు. వారానికి సెలవులు కూడా లేకుండా, నిరంతరం పని ఒత్తిడిలోనే బతుకుతున్నారు. ఈ ఒత్తిడి ఎంతలా ఉందంటే… తమ కుటుంబ సభ్యుల ‘చివరిచూపు’కి కూడా వెళ్లలేని పరిస్థితి, అంత్యక్రియలకు హాజరు కాలేని బాధ. మాటల్లో చెప్పలేం. ఇంకా చెప్పాలంటే ఆర్టిజన్‌ కార్మికులకి ఎలాంటి సర్వీస్‌ బెనిఫిట్స్‌ లేవు, గ్రాట్యుటీ అనే హక్కు కూడా లేదు. దాంతో రిటైర్‌ అయ్యాక కూడా బతుకుదెరువు కోసం మళ్లీ వృద్ధాప్యంలో అడ్డా కూలీలాగా తిరగాలే తప్ప వేరే గత్యంతరం లేదు.

నిబంధనల ప్రకారం గ్రేడ్‌ మార్చితే ప్రభుత్వానికి నెలకు పదికోట్ల రూపాయల భారం పడుతుందని చెప్తున్నారు. కానీ, వారు అదనంగా ఏమీ అడగడం లేదు. ఇప్పుడు తీసుకుంటున్న జీతాలకే (కరెంట్‌ పే స్కేల్‌కి)తో రెగ్యులర్‌ పోస్టుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించకపోవంతో కొన్నిరోజులుగా సమ్మెకు దిగారు. ఇదిఇలా ఉంటే, విధి నిర్వహణలోనే కార్మికులు ఎంతోమంది ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు అంగవైకల్యం చెందుతున్నారు. అయినా వారికి సర్వీస్‌ బెనిఫిట్స్‌ లేవు, ఇటు బతుక్కుఎలాంటి గ్యారెంటీ లేదు. ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కార్మికులు బతుకుతున్నారు.ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నా… కనీస భరోసా కూడా లేకపోవడం బాధాకరం. ఆర్టిజన్‌ కార్మికుల్లో బిటెక్‌, డిప్లొమా, పీజీలు చేసినవాళ్లు ఉన్నారు. వారికి సరైన కేడర్‌ లేకున్నా, గౌరవం లేకున్నా పనిచేస్తున్నారు. ప్రభుత్వం సమాలోచన చేసి,వారిని గౌరవప్రదమైన పోస్టుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. కార్మికులు మాత్రం తమకు పాత సర్వీస్‌ రూల్స్‌ అమలు చేసి, మా జీవితాల్లో వెలుగులు నింపాలని వేడుకుంటున్నారు.

కోట దామోదర్‌
9391480475

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -