Wednesday, April 15, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపునర్‌'వివక్ష'!

పునర్‌’వివక్ష’!

- Advertisement -

పార్లమెంటు, అసెంబ్లీ నియోజవర్గాల పునర్విభజన అంశం దక్షిణాది రాష్ట్రాలను ఆందోళనకు గురిచేసున్నది. ప్రస్తుతమున్న సీట్లకి అదనంగా లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను పెంచే పనికి కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు తెరలేపింది. ఇందుకోసం త్వరలో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేయనుంది. కాగా ఇప్పుడిదో పెద్ద రాజకీయ వివాదంగా మారే అవకాశంగా కనిపిస్తోంది. ఇది దక్షిణాది రాష్ట్రాల ఉనికికే ప్రమాదంగా పరిణమిస్తోంది.
కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా అమలుచేసి జనాభా పెరుగుదలను నియంత్రించాయి. ఇప్పుడదే ఆ రాష్ట్రాలకు పెనుశాపంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాత 2011 జనాభా లెక్కల ప్రకారం చేయడమే ఇందుకు ముఖ్య కారణం. జనాభా నియంత్ర ణలో వెనుకబడ్డ ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనలో మాత్రం సీట్లను అధికంగా పొంది భారీగా ప్రజా ప్రాతి నిధ్యాన్ని దక్కించుకోనున్నాయి. ఈ విష యంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్య మంత్రుల నుంచి కేంద్రంపై తీవ్ర విమర్శలు వస్తు న్నాయి. ఈ రకంగా సీట్లను పెంచితే దక్షిణాది రాష్ట్రాలు 24 శాతం నుంచి 19 శాతానికి పడిపోతాయనే భయాందోళనలు నెల కొన్నాయి. ఈ నేపథ్యంతో తెలంగాణ ముఖ్య మంత్రి హైబ్రీడ్‌ మోడల్‌ను ప్రతిపాదించారు. యాభై శాతం పెరుగుదలతోపాటు మరో యాభై శాతం రాష్ట్రాల ఆర్ధికాభి వృద్ధి ప్రాతిపదికన పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రికి లేఖ రాశారు.

తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తెలంగాణతోపాటు ఉత్తరాదిలోని ఢిల్లీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల్లో ప్రాతినిథ్యం గణనీయంగా తగ్గనుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆదేశాలను అమలు చేయడం మూలంగా తాము శిక్షంచబడుతున్నామనీ, అదే సమయంలో అధిక జనాభా పెరుగుదల ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు లభిస్తున్నాయని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. దక్షిణాదిని పక్కనబెట్టి ఉత్తరాది ఓట్లు, సీట్లతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులు తాజా డీలిమి టేషన్‌తో ఏర్పడతాయని అభిప్రాయ పడు తున్నారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ వంటి ‘బీమారు’ రాష్ట్రాలు భారీగా లాభపడొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటు న్నారు. కాగా దక్షిణాదిలో కేరళం వంటి రాష్ట్రంలో అసలు నియోజక వర్గాల పెంపు ఉండకపోవచ్చు. దీంతో అన్నిరంగాల్లో ముందున్న కేరళం గొంతు పార్లమెంటులో పరిమితమయ్యే దారుణ విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టడాన్ని మేధావులు తప్పు బడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల నిధులతోపాటు రాజకీయంగా కేంద్రం చిన్నచూపు చూస్తున్నదనే విమర్శలూ లేకపోలేదు.

ఈ ప్రక్రియ తాజా జనగణనతో ముడిపడి ఉంది. ఈ వివాదం సమాఖ్య ప్రాతినిథ్యం, ప్రాంతీయ ఆర్థిక సముతుల్యతపై ముంచుకొస్తున్న ప్రమాదాన్ని తెలియజేస్తున్నది. జనాభా నిర్వహణలో పురోగతి సాధించ డమనేది రాజకీయ ప్రాముఖ్యతకు నష్టం కలిగించకూడదని దక్షిణ ప్రాంత నేతల అభిప్రాయంగా ఉంది. 2011 లెక్కల నేపథ్యంలో ప్రొరెటా ప్రకారం లోక్‌సభ సీట్లు 543 నుంచి 816కు పెరగనున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 140 నుంచి 170కి, లోక్‌సభ సీట్లు 17 నుంచి 26కు చేరనున్నాయి. ఇకపోతే దక్షిణాదిలో లోక్‌సభ సీట్లు 130 నుంచి 195 అవుతుండగా, అదే ఉత్తరాదికి 413 నుంచి 621 సీట్లు పెరుగుతాయి. అంటే దక్షిణాదికి, ఉత్తరాదికి మధ్య 426 సీట్ల తేడా వస్తుంది. దక్షిణాదితో సంబంధం లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి, సమాఖ్య వ్యవస్థకు నష్టం చేస్తుందనేది రాజకీయవేత్తలు, మేధావుల వాదన.

2029 ఎన్నికల నుంచే వీటిని అమల్లోకి తీసుకురా వాలని కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నది. ఇదే గనక జరిగితే దక్షిణాది రాజకీయ ప్రాభవాన్ని కోల్పోనుంది. అలాగే హిందీ రాష్ట్రాల పలుకుబడి మరింత బలోపేతమ వుతుంది. చట్టసభల్లో సీట్ల పెంపు వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, ఆయా రాష్ట్రాల అసెంబ్లీలను సంప్రదించకుండా నేరుగా పార్ల మెంటు ద్వారా డీలిమిటేషన్‌ కమిషన్‌ నివేదికను ఆమోదించి అమలు చేయాలనే ఆలోచన సరికాదు. దక్షిణ, తూర్పు రాష్ట్రా లకు నష్టంచేసే పునర్విభజన ప్రతిపాదనలను వామపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడిచేలా ఈ ప్రతిపాదనలున్నాయని వ్యాఖ్యానిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలతో విస్త్రృత సంప్రదింపుల తర్వాతే డీలిమిటేషన్‌ ప్రక్రియను ముందుకు తీసుకు పోవాలని కోరు తున్నాయి. అందరూ సూచిస్తున్నట్టుగా ఏకాభిప్రాయంతో కూడిన విధానాన్ని కేంద్రం పున: పరిశీలించడం చాలా అవసరం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -