హైబ్రీడ్ మోడల్ ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టాలి
ప్రస్తుతమున్న సీట్ల మేరకే
33శాతం మహిళా రిజర్వేషను అమలు చేయాలి
నాడు బీజేపీ సహకరించకపోవడం వల్లే ఆ బిల్లు ఆమోదం పొందలేదు
2026 జనాభా లెక్కలు తేలిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన
2011 జనాభా లెక్కలతో దక్షిణాది, ఉత్తరాది మధ్య అగాధం
పన్నులు చెల్లించి, సలాం కొట్టేందుకు మేం వ్యతిరేకం
40 ఏండ్లలో ఒక్క మహిళకైనా
బీజేపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టిందా? : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతమున్న ఎంపీ సీట్ల సంఖ్యను 50 శాతం పెంచి డీలిమిటేషన్ చేపట్టాలనే ప్రధాని మోడీ విధానం దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర విఘాతాన్ని కలిగిస్తుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశానికే పెద్ద విపత్తులాంటిదని ఆయన హెచ్చరించారు. ఈ విధానంతో 542 ఉన్న సీట్లకు అదనంగా 270 సీట్లు పెరుగు తాయని తెలిపారు. వీటిని 2026 జనాభా లెక్కల ప్రకారం కాకుండా 2011 జనాభాల లెక్కల ప్రకారం తీసుకోవడ ం వల్ల దక్షిణాదికి తీరని నష్టం వాటిల్లుతుం దని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రధాని మోడీ రాజకీయ కుట్రగా అభివర్ణించారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో పలువురు మంత్రులు, ఎంపీలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి విలేకర్ల సమావేశం నిర్వహించారు. మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రాల మధ్య వివక్ష, అంతరాలు పెరుగుతాయని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అనేవి ఒకటి కాదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, వెంటనే ఆ బిల్లును ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు గతంలో బీజేపీ సహకరించకపోవడం వల్లే లోక్‌సభలో ఆగిపోయిందని విమర్శించారు. నియోజక వర్గాల పునర్విభజన, మహిళా బిల్లుపై కేంద్రం హడావుడిగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తోందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మోడీ సర్కారు వ్యూహాత్మకంగా మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనను రెండింటినీ ఒకటిగా చూపించి ప్రతిపక్షాలు సహకరించడ ం లేదంటూ ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు అంశాలకు ఒకదాని కొకటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రెండింటిని విడదీసి వేర్వేరుగా చర్చించి, వాటి అమలుపై విధివిధానాలు రూపొందించాలని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాని మోడీ ఇంతకాలం పట్టించుకోలేదని సీఎం విమర్శించారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతునిచ్చిందని గుర్తు చేశారు. సోనియా గాంధీ నాయకత్వంలో చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారనీ, అప్పుడు రాజ్యసభలో అది ఆమోదం పొందిందని తెలిపారు. అందులోనూ బీసీ కోటా ఉండాలనేది తమ పార్టీ నిర్ణయమని చెప్పారు. పురుషులతోపాటు మహిళలకూ ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. అప్పటికి ప్రపంచంలోని చాలా దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేదని, పురుషులతోపాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. దేశ ప్రధానిగా, రాష్ట్రపతిగా, లోక్‌సభ స్పీకర్‌గా, ముఖ్యమంత్రులుగా, గవర్నర్లుగా రాజ్యాంగబద్దమైన పదవుల్లో మహిళలకు కాంగ్రెస్ అవకాశం కల్పించిందని అన్నారు. రాజీవ్‌గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు తీసుకొచ్చారని గుర్తు చేశారు. 40 ఏండ్లలో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని ఒక్క మహిళకైనా ఇచ్చారా? అని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆ చట్టాన్ని సవరించండి
2026 జనాభా లెక్కల గెజిట్ ఆధారంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ బీజేపీ ప్రభుత్వం చట్టం చేసిందని సీఎం గుర్తు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 543 లోక్‌సభ సభ్యుల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తే, 181 మంది మహిళలు ఎన్నికయ్యేందుకు అవకాశం ఉండేదన్నారు. ఆ చట్టాన్ని లోక్‌సభలో ఆమోదించినప్పుడే అమలు కాకుండా బీజేపీ అడ్డుకుందని గుర్తు చేశారు. ఆ రకంగా మహిళలకు రిజర్వేషన్లను దూరం చేసిందని విమర్శించారు. 2026 జనాభా లెక్కలు పూర్తి చేసి అమలు చేయకుండా 2011 జనాభా లెక్కల ఆధారంగా చట్టాన్ని ముందుకు తెస్తున్నారని తెలిపారు. 2026 జనాభా లెక్కల ప్రకారమనే నిబంధనను సవరించుకుంటే, 2029 లోక్‌సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ల అమలుకు అవకాశం ఉంటుందని సూచించారు. మహిళా రిజర్వేషన్లు, పునర్విభజనను కలపడంలో బీజేపీ రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. నియోజకవర్గాల పునర్వభజనను ప్రధాని మోడీ రాజకీయ పావుగా, ప్రమాదకరంగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేయడం వల్ల ఆయా రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని సీఎం చెప్పారు. ఉత్తరాదిలో కుటుంబ నియంత్రణ అమలు కాకపోవడంతో జనాభా విపరీతంగా పెరిగిందని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ ఈ విషయాన్ని గుర్తించి, లోక్‌సభ సీట్ల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిర్ణయించారని తెలిపారు. 25 ఏండ్ల వరకు సీట్ల పెంపుదలను ఆమె నిషేధించారని గుర్తు చేశారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజన జరగొద్దనే ఉద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నారని వివరించారు. 2001లో నాటి ప్రధాని వాజ్‌పారు పునర్విభజనపై చట్ట సవరణ చేశారనీ, దాని వల్ల 2009లో తెలంగాణకు 17 ఎంపీ సీట్లు, ఆంధ్రప్రదేశ్‌కు 25 ఎంపీ సీట్లు వచ్చాయన్నారు. తెలంగాణకు 119 అసెంబ్లీ సీట్లు, ఏపీకి 175 శాసనసభ సీట్లు వచ్చాయని చెప్పారు. ఆ తర్వాత 2026 వరకు చట్టపరంగా సీట్ల పెంపుదలపై నిషేధం విధించారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజనకు ఒప్పుకోబోమంటూ దక్షణాది రాష్ట్రాలు నిరసన తెలపడంతోపాటు ప్రధానికి లేఖ రాశాయని గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాలు ఒప్పుకోబోమని చెప్పడంతోనే దామాషా ప్రకారం యాభై శాతం ఎంపీ సీట్లు పెంచుతామంటూ కేంద్రం చెబుతున్నదని విమర్శించారు. 20 ఎంపీ సీట్లు ఉన్న కేరళకు, 80 సీట్లు ఉన్న యూపీకి ప్రస్తుతం అంతరం 60 సీట్లు మాత్రమేనని గుర్తు చేశారు. యాభై శాతం సీట్లు పెంచితే ఆ గ్యాప్ 90 సీట్లకు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణకు, యూపీకి 94 సీట్ల అంతరం ఉంటుందన్నారు. దక్షణాదిలో మొత్తం 130 ఎంపీ సీట్లు ఉన్నాయనీ, యాభై శాతం పెరిగితే 195 అవుతాయని తెలిపారు. ఉత్తరాదిలో ప్రస్తుతం 413 సీట్లు ఉన్నాయనీ, దీని ప్రకారం అక్కడ సీట్ల సంఖ్య 621కు పెరుగుతుందని చెప్పారు. డీలిమిటేషన్ ద్వారా ఎంపీ సీట్ల సంఖ్యను 1957లో 494కు, 1967లో 520కు, 1976లో 542కు, పెంచారని వివరించారు. ఆ తర్వాత సిక్కిం నుంచి ఒక సీటు పెరిగి 543కు ఆ సంఖ్య చేరిందని గుర్తు చేశారు.
ఢిల్లీకి పన్నులు చెల్లించి, సలామ్ కొట్టడానికి తాము వ్యతిరేకమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సీట్ల పునర్విభజన కోసం హైబ్రీడ్ మోడల్‌ను ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. కేంద్రం పెంచాలనుకుంటున్న 272 సీట్లలో 136 సీట్లు ప్రొరేటా ప్రకారం…136 సీట్లు (హైబ్రీడ్) జీఎస్‌జీడీపీ ప్రకారం సీట్ల పునర్విభజన చేయాలని డిమాండ్ చేశారు. స్థూల ఉత్పత్తిలో అత్యధిక భాగస్వాములుగా ఉన్న రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈశాన్య రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జనాభా ప్రాతిపాదికన సీట్లు లేవని చెప్పారు. 100 శాతం జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపుదల జరగలేదన్నారు. ప్రాతినిధ్యం కోసమే ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపీ సీట్లు ఇచ్చారని గుర్తుచేశారు. దేశానికి దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు ఆదాయాన్ని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయని చెప్పారు. ఈ రకంగా సీట్ల సంఖ్యను తగ్గించి తమను ఎలా శిక్షిస్తారని ప్రశ్నించారు. ఈ అంశంలో విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదనే సుప్రీంకోర్టు తీర్పును స్ఫూర్తిగా తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. సీట్ల పునర్విభజనపై అఖిల పక్ష సమావేశంతోపాటు అన్ని సంస్థలతో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో పునర్విభజనపై చర్చించాలనీ, నిపుణలతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రాల అసెంబ్లీల్లో చర్చలు జరిపి, వాటి ఆధారంగా పార్లమెంటులో ఆమోదించి నిర్ణయం తీసుకోవాలన్నారు. 2028 మార్చి వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చనీ, హడావుడిగా చేసి దక్షణ, ఉత్తరాది రాష్ట్రాల మధ్య గ్యాప్ పెంచొద్దని రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు.
మోడీ తీసుకుంటున్న నిర్ణయం వల్ల దక్షిణాది, ఉత్తరాది మధ్య ఎంపీ సీట్ల అంతరం 412 నుంచి 620కి పెరుగుతోందని రేవంత్‌రెడ్డి చెప్పారు. బీజేపీ హయాంలో దక్షణాది రాష్ట్రాలకు కేంద్రంలో కీలకమైన శాఖలను ఇవ్వలేదని విమర్శించారు. దక్షిణాధి రాష్ట్రాలను రాజకీయంగా ద్వితీయ శ్రేణి రాష్ట్రాలను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రధాని చర్యలతో ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాలు రాజకీయ మనుగడను కోల్పోతాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీరని విఘాతం ఏర్పడుతుందని చెప్పారు. ఏ ప్రాతిపదికన సీట్లు పెంచాలో చర్చించాలని డిమాండ్ చేశారు. యాభై శాతం పెంచాలంటూ మోడీకి ఎవరు చెప్పారని నిలదీశారు. రాజకీయ అవసరాల కోసం యాభై శాతం సీట్లు అంటున్నారని విమర్శించారు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించినది కాదనీ, ప్రజలకు సంబంధించిన అంశమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, నక్సలైట్ లాంటి సమస్యలు వివక్ష వల్లే వచ్చాయన్నారు. ఇలాంటి వివక్షను ఇంకా పెంచేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఇదే విషయంపై దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ప్రధాని మోడీకి లేఖ రాస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు.
మోడీ కుట్ర దేశానికే ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



