కనీస వేతనాలు అమలు చేయాలి
ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నోయిడాలో రోడ్లపై బైటాయింపు
చెదరగొట్టేందుకు పోలీసుల యత్నం
మహిళా ఉద్యోగిపై లాఠీచార్జి
బాష్ప వాయుగోళాల ప్రయోగం
కార్మికులకు తీవ్ర గాయాలు
ఎట్టకేలకు దిగివచ్చిన యోగి సర్కార్
నోయిడా: నోయిడాలో కార్మికులు కన్నెర్ర చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా నుంచి హర్యానా, రాజస్తాన్‌ల వరకు గల ఆయా కంపెనీల కార్మికులు వీధుల్లోకి తరలివచ్చారు. గత మూడ్రోజులుగా నోయిడాలో రాజుకుంటున్న ఈ నిరసనలు సోమవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. నోయిడా పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులు రోడ్లపై బైటాయించారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీంతో కార్మికుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిం చారు. ఇందులో భాగంగానే ఓ మహిళా ఉద్యోగినిపై లాఠీ ఝులిపించారు. అప్పటికీ కార్మికులు వెనక్కి తగ్గకపోవటంతో బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఆందోళనలతో ఎట్టకేలకు ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పారిశ్రామిక యూనిట్లతో తక్షణమే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.
కాగా ఈ నిరసనలు ఫరీదాబాద్, గురుగ్రామ్, రాజస్తాన్‌లోని భివాడి-అల్వార్‌లలోనూ కొనసాగు తున్నాయి. వీరు ఒక్క వేతనాల కోసమే ఈ ఆందోళనలు చేయడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. అవి…
అనారోగ్యానికి గురైనా…
”మా అసలు జీతం రూ.11,299. ఉద్యోగం చేరినప్పటి నుంచి వేతనాలు పెరగలేదు. ఇక్కడ సౌకర్యాలుండవు. ఆహారం బాగుండదు. ఓవర్‌టైమ్ చేయమని వేధింపులు. ఒకవేళ అనారోగ్యానికి గురైతే గేట్ పాస్ పొందడానికి, లోపలికి ప్రవేశించడానికి 10 సంతకాలు అవసరం. మా ఫిర్యాదులను ఎవరూ పట్టించుకోరు.” అని ఫరీదాబాద్‌లోని సెక్టార్ 37లో పనిచేస్తున్న ఓ కార్మికుడు వాపోయాడు.
కుటుంబ సభ్యులతోనూ మాట్లాడనివ్వరు
”కంపెనీలోకి ప్రవేశించాక ఏదైనా కారణం చేత కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్నా మాకు మొబైల్ ఫోన్‌లు ఇవ్వరు. జీతాలు పెంచరు. జీతం స్లిప్‌లు ఇవ్వరు. సరైన ఆహారం అందించరు. ఇప్పటికైనా గౌరవప్రదమైన జీతం ఇవ్వాలి. సరైన ఆహారం అందించాలి” అని మరో కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
తొమ్మిదేండ్లయినా పర్మినెంట్ చేయలేదు
ఇక్కడ తొమ్మిదేండ్లుగా పని చేస్తున్నా శాశ్వతం చేయలేదు. జీతాలు పెంచలేదు. కొత్తగా చేరే కార్మికుల జీతాలు కూడా మాతో సమానంగానే ఉంటున్నాయి. జీతాల పెంపు కోసం నాలుగైదు ఏండ్లుగా ఎదురు చూస్తున్నాం. చిన్న చిన్న విషయాలకే మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా మా సమస్యలు ప రిష్కరించాలి” అని లక్ష్మి అనే కార్మికురాలు వాపోయింది.
పని ఒత్తిడి, తక్కువ వేతనం
రోజుకు 10 నుంచి 12 గంటలు పని చేయిస్తున్నారు. కానీ మాకు ఇచ్చే జీతం చాలా తక్కువ. ఎవరైనా విచారణకు వస్తే కంపెనీ రికార్డుల్లో మాకు అధిక వేతనం ఇస్తున్నట్టు చూపిస్తున్నారు. వాస్తవం మాత్రం పూర్తి భిన్నంగా ఉంది.” అరి మరో మహిళా కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
పారిశ్రామిక కేంద్రంగా ‘నోయిడా’
ఉత్తరప్రదేశ్ గణాంకాల ప్రకారం తొమ్మిదేండ్లలో నోయిడాలో రికార్డు స్థాయిలో ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. దీంతో నోయిడా ఇప్పుడు ”పారిశ్రామిక కేంద్రం” అనే బిరుదును కలిగి ఉంది. కానీ ప్రభుత్వ గణాంకాల మెరుపు మసకబారినప్పుడు దాని స్థానంలో సెక్టార్ 62, 59 రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లు, నినాదాలు కనిపిస్తాయి. ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి శాఖ మంత్రి నంద్ గోపాల్ గుప్తా (నంది) అందించిన సమాచారం ప్రకారం, 2017 నుంచి రాష్ట్రంలో 17,841 కొత్త ఫ్యాక్టరీలు ప్రారంభమయ్యాయి. పశ్చిమ ఉత్తర ప్రదేశ్, ముఖ్యంగా నోయిడా, దీనికి అతిపెద్ద కేంద్రంగా ఉంది. కానీ ఈ గణాంకాల వెనుక చేతిలో బీఏ, బీకామ్ డిగ్రీలతో ఈ ఫ్యాక్టరీల గేట్ల వద్ద నిలబడిన వేలాది మంది యువత ఆక్రోశాలు దాగి ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగాల మాట వాస్తవమే అయినా దోపిడీని నిశ్శబ్దంగా భరించవలసి వస్తుందనేలా యాజమాన్యాలు వ్యవహరిస్తుంటాయి.
నోయిడాలో నిరసన తెలుపుతున్న కార్మికుల జీతానికి సంబంధించి ఒక ప్రధాన ఫిర్యాదు ఉంది. కాగితాలపై తాము ”నైపుణ్యం గల కార్మికులం” అయినప్పటికీ, వాస్తవానికి తమను ”పనిచేసే పేదలు”గా నే వర్గీకరిస్తున్నారని ఓ కార్మికుడు వాపోయాడు. తనలాంటి చాలా మంది కార్మికులు రోజుకు 12 గంటలు పనిచేసినా రూ.15వేలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నోయిడా లాంటి ప్రదేశంలో ఈ జీతంతో బతకడం చాలా కష్టం. గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 1,000 మందికిపైగా ఉద్యోగులతో 118 పెద్ద కర్మాగారాలు ఉన్నాయి. కానీ అక్కడి క్యాంటీన్, వైద్య సౌకర్యాలు, పని గంటలు, వాతావరణం, ఒక డిగ్రీ చదివిన కార్మికుని గౌరవానికి తగినవిగా ఉన్నాయా? అని మరో కార్మికుడు నిలదీశాడు.
కర్మాగారాలను విస్తరిస్తే సరిపోతుందా? :కార్మిక సంఘాలు
యూపీ సర్కార్ పారిశ్రామిక అభివృద్ధి విభాగానికి రూ.28,864 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. కానీ కార్మికులకు ఈ జీవన వేతనాలు, పని పరిస్థితులను కఠినంగా అమలు చేయకపోతే, ఈ కర్మాగారాలు కార్మికుల ఆగ్రహావేశాలకు కారణమవ్వటం ఖాయమని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.
యాజమాన్యంతో ఇప్పటికీ చర్చలు జరగలేదు సీఐటీయూ జిల్లా కార్యదర్శి వీరేంద్ర సింగ్ దంగ్వాల్
తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలుపుతున్న కార్మికులకు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ) జిల్లా కార్యదర్శి వీరేంద్ర సింగ్ దంగ్వాల్ మద్దతు తెలిపారు. ప్రభుత్వం నిర్ధారించిన వేతనాల ప్రకారం కార్మికులకు జీతాలు చెల్లించాలని, పనివేళల్లో కార్మికులకు క్యాంటీన్లు, భోజనం, ప్రయాణ భత్యాలు, టాయిలెట్లు వంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వీరి సమస్యలపై యాజమాన్యంతో ఇంకా ఎలాంటి చర్చలు జరగలేదని అన్నారు. కార్మికుల డిమాండ్లు నెరవేరే వరకు ఈ నిరసన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.



