పాల్గొంటున్న కార్మిక, కర్షక, సాధారణ ప్రజానీకం
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కన్నెర్ర
దేశవ్యాప్తంగా సిద్ధమైన జాతీయ కార్మిక సంఘాలు
మద్దతు తెలిపిన వామపక్షాలు, కాంగ్రెస్
సమ్మె విచ్ఛిన్నానికి బీజేపీపాలిత రాష్ట్రాల్లో కుట్రలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని పది జాతీయ కార్మిక సంఘాలు, 500కు పైగా ఇతర సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. దీనికి సీపీఐ(ఎం), సీపీఐ వంటి వామపక్షపార్టీలు, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షపార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది ప్రజానీకం ఈ సమ్మెలో పాల్గొంటున్నట్టు అంచనా. వీరిలో ప్రభుత్వ, ప్రయివేటు రంగాల కార్మికులు, గ్రామీణ ప్రాంత వ్యవసాయ కార్మికులు, రైతులు, ఇతర చేతివృత్తుల శ్రామికులు భాగస్వాములవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్న నాలుగు లేబర్ కోడ్లు కార్పొరేట్లకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని కార్మిక సంఘాలు విశ్లేషణాత్మకంగా కార్మి కులకు వివరించాయి. సమ్మె సన్నాహకాల్లో భాగంగా బుక్లెట్లు, కరపత్రాలు, గ్రూప్ మీటింగ్‌లు, గేట్ మీటింగ్‌లు నిర్వహించారు. దేశంలోని పలు ప్రాంతాల్లోని పనిప్రదేశాలు, పారిశ్రామిక వాడలు, గ్రామీణ ప్రాంతాల్లో విభిన్న కళారూపాల్లో సమ్మె ప్రాధాన్యతను వివరిస్తూ కళా ప్రదర్శనలు నిర్వహించారు.
కార్మికుల ఉనికికే ప్రమాదం
గురువారం జరుగుతున్న జాతీయ సార్వత్రిక కార్మిక సమ్మెకు అత్యధిక ప్రాధాన్యత ఉంది. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు కార్మికుల ఉనికినే ప్రశ్నార్దకం చేస్తున్నాయి. దీనితో పాటు రైతాంగాన్ని దెబ్బతీసే విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు, వీబీజీ రాంజీ చట్టం అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. నాలుగు లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు యాజమాన్యాలకు కట్టు బానిసలుగా మారక తప్పదు. 16,17 శతాబ్దంలో కార్మికులకు ఎలాంటి చట్టాలు లేవు. బానిసలుగా పని చేశారు. లేబర్కోడ్లు అమల్లోకి వస్తే మోడీ ప్రభుత్వం తిరిగి అవే రోజుల్లోకి కార్మికుల బతుకుల్ని నెట్టేసే ప్రయత్నం చేస్తున్నదని జాతీయ కార్మిక సంఘాలు గొంతెత్తి ఘోషిస్తున్నాయి. ఇలాంటి తిరోగమన చర్యలను అంగీకరించేందుకు కార్మిక వర్గం సిద్ధంగా లేదని దేశ ప్రజానీయం స్పష్టంగా చెప్పదలుచుకుంది. దానిలో భాగంగానే ఈ సమ్మె జరుగుతున్నది.
సమ్మె నిర్వీర్యానికి కుట్రలు
బీఎంఎస్, బీజేపీ, సంఫ్‌ుపరివార్ శక్తులు లేబర్ కోడ్లకు అనుకూలంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. వీటివల్ల కార్మికవర్గానికి పెద్ద ఎత్తున ప్రయోజనాలు చేకూరుతాయని చెప్తున్నారు. ఈ కట్టుకధలకు దేశవ్యాప్తంగా ప్రధాన మీడియా వత్తాసు పలుకుతున్నది. తప్పుడు రాతలతో కార్మిక వర్గాన్ని భ్రమల్లో ముంచే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికుల శ్రేయస్సు కోసం పని చేయాల్సిన కార్మికశాఖ సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కార్మికులు సమ్మెలో పాల్గొన వద్దని పరోక్షంగా చెప్తున్నారు. సింగరేణి యాజమాన్యం ఏకంగా ప్రెస్మీట్లు పెట్టి కార్మికులు సమ్మెలో పాల్గొంటే ఉత్పత్తి ఆగిపోతుందనీ, కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుందని బెదిరిస్తున్నది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ 13వ తేదీ వరకు అమల్లో ఉన్నందున్న, దాన్ని సాకుగా తీసుకుని పోలీసు యంత్రాంగం, యాజమాన్యాలు సమ్మెపై ఆంక్షలు విధిస్తున్నాయి.
సేవా రంగంపై తీవ్రప్రభావం
సమ్మె కారణంగా బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, పోస్టల్, బొగ్గు గనులు, కర్మాగారాలు, రవాణా సేవలు, ప్రభుత్వ రంగ సంస్థలు స్తంభించనున్నాయి. పాఠశాలలు, కళాశాలలు, ప్రయివేట్ కార్యాలయాలు మూతపడనున్నాయి. సమ్మె ప్రభావంతో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోనున్నాయి. బస్సులు, టాక్సీలు, క్యాబ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. రైల్వే కార్మికులు, ఉద్యోగులు కూడా సమ్మెలో భాగస్వాములు అవుతున్నారు.
రాష్ట్రంలో…
తెలంగాణలో సార్వత్రిక సమ్మె సందర్భంగా హైదరాబాద్‌లో ఆర్టీసీ కళ్యాణమండపం నుంచి ఇందిరాపార్కు వరకు అన్ని కార్మిక, కర్షక, ప్రజాసం ఘాల నేతృత్వంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. అన్ని జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో కూడా కార్మిక, కర్షక, ప్రజాసంఘాల నేతృత్వంలో వివిధ రూపాల్లో ఆందోళ నలు నిర్వహిస్తారు. వామపక్షాల నేతలు ఆయా సభల్లో సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మాట్లాడతారు.
పోరాడితేనే హక్కుల సాధన : పాలడుగు భాస్కర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సమరశీల పోరాటాలతోనే కార్మికుల హక్కులు సాధించగలరు. ఇది చరిత్ర నిరూపించిన సత్యం. దేశంలో మోడీ ప్రభుత్వం కార్మికులను యాజమాన్యాలకు కట్టు బానిసలుగా పడిఉండేలా చట్టాలను సవరించింది. గతంలో ఎన్నో పోరాటాలు, త్యాగాలతో కార్మికులు సాధించుకున్న అనేక చట్టాలకు పాతరేసింది. నాలుగు లేబర్ కోడ్ల పేరుతో యాజమానుల బొక్కసాలు నింపేందుకు శాసనాలు చేసింది.
ప్రధాని మోడీ తాను కార్పొరేట్ల సేవకుడినే తప్ప, కార్మికుల పక్షపాతిని కాదని ఈ లేబర్కోడ్లు అమల్లోకి తేవడం ద్వారా తేల్చిచెప్పారు. ఇలాంటి ప్రజా వ్యతిరేకులను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా ప్రజానీకం మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యం కావడానికి ఈ సార్వత్రిక సమ్మె ఉపకరిస్తుంది. అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ఆందోళనల్లో పాల్గొనాలి. కేంద్రానికి కార్మిక శక్తి సత్తాను చూపాలి.



