- జీహెచ్ఎంసీ, ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశాలతో చర్యలు
నవతెలంగాణ- అమీన్‌పూర్ : అమీన్‌పూర్ సర్కిల్-47 పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఒక అనధికార నిర్మాణాన్ని అమీన్‌పూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ అధికారులు బుధవారం విజయవంతంగా కూల్చివేశారు. సంబంధిత జీహెచ్‌ఎంసీ చట్టాలు, నిబంధనల ప్రకారం డిప్యూటీ కమిషనర్ కార్యాలయ పర్యవేక్షణలో ఈ చర్యలు చేపట్టారు. అనధికారికంగా నిర్మిస్తున్న సదరు భవన యజమానులకు మున్సిపల్ కార్యాలయం ముందే షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ తర్వాత చట్టప్రకారం ఆర్డర్ నోటీసు కూడా ఇచ్చి, ఉల్లంఘనలను సరిదిద్దుకునేందుకు, తగిన వివరణ ఇచ్చుకునేందుకు యాజమాన్యానికి పూర్తి అవకాశం కల్పించారు. అయినప్పటికీ భవన నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడమే కాకుండా అనధికార నిర్మాణం అలాగే కొనసాగించడంతో అధికారులు బుధవారం కూల్చివేత చర్యలు చేపట్టారు.
ఈ నిర్మాణానికి సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ వద్ద నమోదైన కేసు (నెం. 927/36/26/2025)ను పురస్కరించుకుని, కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కూల్చివేత కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యలకు సంబంధించిన పూర్తి నివేదికను త్వరలోనే కమిషన్‌కు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. కూల్చివేత ప్రక్రియ సజావుగా సాగేందుకు, ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిఎంసి ఉన్నతాధికారులు, పోలీస్ సిబ్బంది భారీ బందోబస్తు నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భవనంలోని మొదటి అంతస్తులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అనధికార భాగాన్ని అధికారులు పూర్తిగా కూల్చివేశారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అమీన్‌పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ.. భవన నిర్మాణ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయడంలోనూ, తమ పరిధిలోని అక్రమ, అనధికార నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలోనూ యంత్రాంగం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అమీన్‌పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.



