•సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగర్జున
నవతెలంగాణ – మర్రిగూడ
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు, ప్రజాతంత్ర వాదులు, పోరాడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక,రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10 జైలు భరో కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ సోమవారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అమలుకు ఫైనల్ రూల్స్‌ను నోటిఫై చేయడం, విద్యుత్ సవరణ బిల్లు–2025, విత్తన చట్టానికి సవరణలు వంటి చర్యలకు పూనుకోవడం ద్వారా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
అదేవిదంగా కార్మికుల శ్రమను మరింతగా దోచుకునేందుకు పని దినాలను పెంచుతూ.. యజమాన్యాలకు స్వేచ్ఛ ఇవ్వడం సమంజసం కాదని ప్రశ్నించారు. కార్మికులు దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాలు, సమ్మె హక్కు, కార్మిక సంఘాల హక్కులు, ఉద్యోగ భద్రత వంటి హక్కులను లేబర్ కోడ్స్ ద్వారా కాలరాస్తున్నారని ఆరోపించారు. లేబర్ కోడ్స్ అమలైతే తరతరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను కార్మికవర్గం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని, పీఎఫ్, ఈఎస్ఐ, వెల్ఫేర్ బోర్డులపై కోతలు, ఆంక్షలు విధిస్తోందని అన్నారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కూలీలు, ఐకేపీ, వీఏఓలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆరోగ్యశాఖలోని వివిధ స్కీమ్‌లలో పనిచేస్తున్న కోట్లాది మంది కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
ఉపాధి హామీ పథకానికి తగిన నిధులు కేటాయించి, గ్రామీణ పేదలకు సంవత్సరానికి కనీసం 200 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేశారు. రైతాంగనికి గిట్టుబాటు ధర తో పాటు, రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మహిళా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దామెర లక్ష్మి, వ్యకాస మండల కార్యదర్శి నీలకంఠం రాములు, రైతు సంఘం కార్యదర్శి ఏరుకొండ రాఘవేంద్ర, మైల సత్తయ్య, అమాలి వర్కర్స్ నాయకులు పళ్ళ నరసింహ, ఒట్టికోటి పండు, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు సల్వోజు రామలింగా చారి, అంగన్వాడీ వర్కర్స్ మండల నాయకులు లక్ష్మి, ఆశా వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు మట్టం భాగ్యమ్మ, కార్యదర్శి జంపాల వసంత, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు చిలువేరు లింగయ్య, గ్రామపంచాయతీ వర్కర్స్ నాయకులు రామావత్ రాజు నాయక్, మంజుల ఎలక్ట్రిషన్ యూనియన్ నాయకులు, కర్నాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.



