నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మాజీ ఆర్మీ జనరల్ ఎం.ఎం.నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఆ బుక్ గురించి లోక్ సభలో ప్రస్తావించారు. 2020లో చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంలో మోడీ ప్రభుత్వం మిన్నకుండిపోయిందని, సైన్యానికి అండగా ఉండకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని సదురు బుక్ లో ఆర్మీ అత్యున్నతాధికారి పేర్కొన్నారని రాహుల్ గాంధీ సభలో చదివి వినిపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలు గందగోళం సృష్టించాయి. సదురు పుస్తకం ఇంకా ప్రచురితం కాలేదని అధికార పార్టీ ఎంపీలు గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే.
దేశ భద్రత విషయంలో బీజేపీ అలసత్వాన్ని ఎం.ఎం.నరవణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ బట్టబయలు చేయడంతో..మోడీ సర్కార్ తర్జనభర్జన పడింది. ఈక్రమంలోనే ఆ బుక్ పబ్లిషర్ పెంగ్విన్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. సదురు బుక్ కాపీలు ముందుగానే బయటికి రావడంత ఓ వైపు ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఈక్రమంలోనే మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం వివిధ శాఖల్లో అత్యున్నతా స్థాయిలో పని చేసిన అధికారులు రాసిన ఆటో బయోగ్రఫీలపై పలు ఆంక్షలు విధించడానికి సిద్ధమైంది.
మిలటరీ సహా అత్యున్నత పదవుల్లో పని చేసిన వ్యక్తులు తమ పదవుల నుంచి రిటైర్ అయిన తర్వాత 20 ఏళ్ల వరకు వారి పుస్తకాలు పబ్లిష్ కాకుండా తప్పనిసరి కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను (Cooling Off Period) అమలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఎజెండాలో లేకుండానే ఈ అంశం చర్చకు వచ్చినట్లు ఈ కథనం పేర్కొంది. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కూడా ఉందని తెలిపింది.



