Sunday, February 15, 2026
E-PAPER
Homeకవర్ స్టోరీఅసమానతల అంతంతోనే సామాజిక న్యాయం

అసమానతల అంతంతోనే సామాజిక న్యాయం

- Advertisement -

భారత రాజ్యాంగం సామాజిక న్యాయానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. సమాజంలో వనరులు, అవకాశాలు, అధికారాల సమాన పంపిణీని తెలియజేస్తుంది. మన రాజ్యాంగ పీఠిక సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని హామీ ఇచ్చింది. ప్రాథమిక హక్కులు (ఆర్టికల్‌ 14-17) సమానత్వం, వివక్ష నిర్మూలన, అంటరానితనం రద్దును చట్టబద్ధం చేశాయి. రాజ్యాంగం వెనుకబడిన వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకుంది. అయితే నేటి పరిస్థితుల్లో రాజ్యాంగమే ప్రమాదంలో పడింది. ఇక సామాజిక న్యాయం అనేది ఓ పెద్ద ప్రశ్నార్థంగా మారింది. ఫిబ్రవరి 20న ‘సామాజిక న్యాయ దినం’ సందర్భంగా అసలు రాజ్యాంగం సామాజిక న్యాయం గురించి ఏం చెప్పింది, దేశంలో అది ఏమేరకు అందాల్సిన వారికి అందుతుందో తెలుసుకుందాం…

సామాజిక న్యాయంపై రాజ్యాంగ నిబంధనలు:
రాజ్యాంగ పీఠిక సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, హోదా, అవకాశాలలో సమానత్వం కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా కీలక ప్రాథమిక హక్కులు కల్పించింది
ఆర్టికల్‌ 14: చట్టం ముందు అందరూ సమానమే అని హామీ ఇస్తుంది.
ఆర్టికల్‌ 15: మతం, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది, విద్యా సంస్థలలో ప్రవేశం కల్పిస్తుంది.
ఆర్టికల్‌ 16: ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది.
ఆర్టికల్‌ 17: అంటరానితనాన్ని పూర్తిగా రద్దు చేసి, దాని ఆచరణను నేరంగా పరిగణిస్తుంది.

ఆదేశిక సూత్రాలు
ఆర్టికల్‌ 46: షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు, ఇతర బలహీన వర్గాల విద్యా, ఆర్థిక ప్రయోజనాలను ప్రోత్సహిస్తుంది. అలాగే వారిని సామాజిక అన్యాయం, దోపిడీ నుండి రక్షిస్తుంది.
ఆర్టికల్‌ 38: ప్రజల సంక్షేమాన్ని పెంపొందించడం ద్వారా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంతో కూడిన సామాజిక న్యాయాన్ని నిర్ధారించాలని పేర్కొంది.

వివక్ష నిర్మూలన: చారిత్రక సామాజిక అన్యాయాన్ని సరిదిద్దడానికి వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు, ప్రత్యేక చట్టాలు, వెట్టి చాకిరీ, బాల కార్మిక నిషేధ చట్టాలు రూపొందించబడ్డాయి. రాజ్యాంగం బలహీన వర్గాల కోసం ప్రత్యేక రక్షణ కల్పిస్తూ, సమసమాజ స్థాపనకు దిక్సూచిగా పనిచేస్తుంది.

అసలు సామాజిక న్యాయం అంటే ఏమిటి?
సామాజిక న్యాయం అనే పదాన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు పదే పదే వల్లిస్తున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు పెంపుకు, స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం తమ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని గొప్పగా చెప్పుకుంటారు. పూలే, అంబేడ్కర్‌ జయంతులు వర్ధంతుల సందర్భంగా ఉపన్యాసాలు దంచికొడుతుంటారు. సామాజిక న్యాయమంటే ఒక కులానికి కొన్ని సీట్లు ఇవ్వడం, నామినేటెడ్‌ పోస్టులలో ఆ కులానికి సంబంధించిన వారిని నియమించడం ద్వారా తమ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని సెలవిస్తున్నారు. ఈ విధంగా సామాజిక న్యాయాన్ని పరిమితార్ధంలో చూస్తే అది సామాజిక న్యాయం అనిపించుకోదు.

సమాజంలో అణిచివేతకు గురవుతూ అన్ని రకాల అసమానతలను అనుభవిస్తూ, అవమానాలను చిత్కారాలను ఎదుర్కొంటున్న వారిని వాటి నుండి విముక్తి చేయడమే నిజమైన సామాజిక న్యాయం. తద్వారా మాత్రమే సామాజిక న్యాయం సిద్ధించబడుతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడిచినా, రాజ్యాంగం ఎన్ని హక్కులు ఇచ్చినా దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలు, బలహీనవర్గాలు సామాజిక అనిచివేతకు గురవుతూనే ఉన్నారు. ప్రధానంగా దళితులు దేశంలో 20% జనాభా కలిగి ఉన్నారు. నూటికి 64% మంది సెంటు గుంట భూమికి నోచుకోకుండా రెక్కాడితే గాని డొక్కాడని దుర్భర స్థితిలో జీవిస్తున్నారు. 38శాతం మంది దళితులకు సొంత ఇల్లు లేదు. తక్కువ కులం వారని ఊరికి చివరన జీవిస్తున్నారు. నేటికీ గుడిలోకి బడిలోకి ప్రవేశానికి నోచుకోని వాళ్ళుగా ఉన్నారు. ఇది నేడు మన దేశంలో కొనసాగుతున్న సామాజిక నాయ్యం.

దళితుల దుస్థితి
దళిత మహిళలుపై లైంగిక వేధింపులు, సామూహిక లైంగిక దాడులు రోజురోజుకి పెట్రేగిపోతున్నాయి. ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాలలో అత్యధికంగా జరుగుతున్నాయి. దళితులపై దాడులు, దౌర్జన్యాలు, సాంఘిక బహిష్కరణలు, హత్యలు, కుల దురహంకార హత్యలు రోజురోజుకీ రెట్టింపు అవుతున్నాయి. వీటిని అరికట్టడానికి ఉన్న చట్టాలు నిరుపయోగంగా మారిపోతున్నాయి. వాటిలో అనేక సవరణలు చేస్తున్న ప్రభుత్వాలు ఆ చట్ట విశిష్టతను దెబ్బతీస్తున్నాయి. సుమారు 128 రకాల కుల వివక్ష రూపాలను ప్రత్యక్షంగా రోజువారిగా దళితులు అనుభవిస్తున్నారు. దళిత మహిళల అక్షరాస్యత కేవలం 30 శాతంలోపే ఉంది.

70 శాతం మంది దళితమహిళలు నిరక్షరాస్యులుగా ఉన్నారు. 18 నిమిషాలకు ఒక దళిత మహిళపై దాడి జరుగుతుంది. వారం రోజుల్లో 13 మంది దళితుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. సగటున ఒక రోజుకి 27 మంది దాడికి గురవుతున్న పరిస్థితి ఉంది. దాడుల పరిధి రోజురోజుకీ పెరుగుతుంది. గత ఏడాది 95,935 కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బీజేపీ అధికారంలోకి రాకముందు సగటున ఒకరోజు ముగ్గురిపై లైంగిక దాడి జరిగితే ఇప్పుడు 10 మందిపై దాడులు జరుగుతున్నాయి. 27 శాతం మంది దళితులు గుడి ప్రవేశం నిరాకరించబడుతున్నారు.

లెక్కలు ఏం చెబుతున్నాయి
దాడులను పరిశీలిస్తే 2019 సంవత్సరంలో 45, 961 కాగా 2021 సంవత్సరం 50, 900 సంఘటనలు జరిగాయి. 2022లో 57.582 కాగా 2023లో 57,789 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం దేశంలో 113 కులాల వారు ఈ దాడులు దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నారు. ఒక రోజుకు సగటున 10 మంది దళిత మహిళలు సామూహిక లైంగిక దాడులకు గురవుతున్నారు. ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలలో అత్యధికంగా జరుగుతున్నాయి. దళితులు ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ వివక్ష, అవమానాలు, దాడులు ఎదుర్కోక తప్పడం లేదు. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ గవాయిపై చెప్పు దాడిజరిగింది. హర్యానా రాష్ట్రంలో దళిత ఐపీఎస్‌ అధికారి పూరన్‌ కుమార్‌ కులఉన్మాద వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్యచేసుకున్నాడు. ఇలాంటి ఘటనలు దేశం కళ్లారా చూసింది.

నమ్మించే ప్రయత్నం
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. తాము సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని తెలియజేయడానికి బంగారు లక్ష్మణ్‌ అనే దళితుడిని పార్టీ అధ్యక్షుడు చేసి అత్యంత ఘోరంగా అవమానించింది. రామ్‌ నాధ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిని చేసి పూరి కాలిక ఆలయంలోకి రానివ్వలేదు. భారత ప్రధమ పౌరుడినే గుడిలోకి రానివ్వని దుస్థితి మనది. అయనను రాష్ట్ర పతిగా పెట్టిన తర్వాత దళితులపై 300 రేట్లు దాడులు జరిగాయి. ఇక ద్రౌపదీ ముర్ము ఆదివాసి బిడ్డను రాష్ట్రపతిని చేసి, ఆదివాసి బిడ్డల జీవనాధారంగా ఉన్నటువంటి అడవులన్నింటిని ఆదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారు. ఆదివాసుల జీవించే హక్కును కాల రాస్తున్నారు. నామినేటెడ్‌ పోస్టులలో దళితులను కూర్చోబెట్టి దళితుల పునాదిని పెకిలించేస్తున్నారు. ఇది సామాజిక న్యాయానికి బీజేపీ ఇచ్చే అర్ధం అని ప్రతి ఒక్కరు గ్రహించాలి.

కార్పొరేట్లకి దోచిపెడుతున్నారు
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం ద్వారా రిజర్వేషన్లను, సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తున్నారు. ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్లు కల్పించకుండా అట్టడుగు వర్గాలకు అన్ని రకాల హక్కులు దక్కే పరిస్థితి లేదు. సామాజిక న్యాయాన్ని సంపూర్ణంగా అమలు చేయాల్సివస్తే ప్రధానంగా రాజ్యాంగ బద్ధంగా ఆర్టికల్‌ 14 నుంచి 18 వరకు ఉన్న ఆర్టికల్స్‌ని సంపూర్ణంగా అమలు చేయాలి. ప్రకృతి వనరుల్లో, బడ్జెట్లో సామూహిక ఉత్పత్తిలో ప్రజలందరికీ సమాన న్యాయం దక్కే విధంగా చూడటమే సంపూర్ణ సామాజిక న్యాయం అవుతుంది. భూమి కొందరి చేతుల్లో కేంద్రీకృతమై, అనేక మందిని వ్యవసాయ కూలీలుగా, సెంటు గుంట భూమికి నోచుకోని వాళ్ళుగా ఉంచడం ద్వారా వారి జీవితాల్లో ఏ రకమైన మార్పులు జరుగవు. ప్రకృతి వనరులు అడవులు, సహజ వనరులు, నీళ్లు, ఖనిజాలు అన్నింటిలోనూ కార్పొరేట్‌ శక్తులు, బడా పెట్టుబడిదారులు ప్రవేశించడం వల్ల అట్టడుగు వర్గాల హక్కులు కాలరాయబడుతున్నాయి.

మనుస్మృతి మాటున
ప్రత్యేకించి బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 12 ఏండ్ల కాలంలో రిజర్వేషన్లను, భారత రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దుచేసి దాని స్థానంలో మనుస్మృతిని ప్రవేశపెట్టడానికి కుట్రలు పన్నుతున్నారు. తద్వారా ఆధునిక మానవుల్ని మధ్యయుగాలలోకి నడిపించాలని చూస్తున్నారు. ఇలా సమాజాన్ని వెనక్కి నడిపించే ప్రయత్నాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కలిసి చేస్తున్నాయి. కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టి సమాజంలో పీడిత వర్గ ఐక్యతకు ఆటంకం కలిగిస్తున్నారు. సామాన్యులను కుల, మత వైషమ్యాలకు బలి చేస్తున్నారు.

2002 గుజరాత్‌ గోద్రా అల్లర్లలో 2000 మంది మైనార్టీల ఊచ కోతలో అట్టడుగు వర్గాలైన దళితులనే అత్యధికంగా ముందు పెట్టారు. దళితులు తినే ఆవు మాంసం తినొద్దని, తింటే ఆవులను కోసి హత్య చేసినట్లుగానే దళితులను కూడా హత్య చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. గోరక్షక దళాల పేరిట దళితులపై దాడులు కొనసాగిస్తున్నారు. గుడిలోకి వచ్చిన చోట దౌర్జన్యం చేస్తున్నారు. ప్రత్యేకించి తెలంగాణలో నిర్మల్‌, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలలో సుమారు 200 గ్రామాలలో వీడీసీల పేరిట దళితులు, బలహీన వర్గాలను సాంఘిక బహిష్కరణలకు గురి చేశారు. కుల దురహంకార హత్యలు రోజురోజుకి పెట్రేగిపోతున్నాయి.

2014 నుండి 2025 కాలంలో సుమారు 170 కులదురహంకార హత్యలు జరిగాయి. పాకిస్తాన్‌ ఇండియా బార్డర్‌లో సైన్యం కూడా అంతమంది చనిపోలేదు. కానీ మన దేశంలో పౌరులుగా మన దేశ గాలిని పీలుస్తూ, మన దేశం ఓటరుగా ఉంటున్నటువంటి దళితులు మాత్రం హత్యలు, దాడులు, అత్యాచారాలకు గురవుతున్నారు. అగ్రకుల ఆధిపత్యం, మనువాద శక్తుల చేతుల్లో రోజురోజుకీ భవిష్యత్‌ తరాలు మటుమాయమయ్యే ప్రమాదం ఉంది. సామాజిక న్యాయం అంటే అంబేద్కర్‌, పూలే జయంతి, వర్ధంతుల సందర్భంగా వల్లించే పదాల పొందిక కాదు. కుల, మత, లింగ వివక్ష లేకుండా భారతీయులందరూ సోదర భావంతో మెలిగే వాతావరణం కావాలి. భూమి, నీరు, గాలి, వెలుగు అన్నింటిలో అందరికీ సమానత్వ హక్కులు పొందే దిశగా ప్రయాణం చేయడమే అసలు సిసలైన సామాజిక న్యాయం. భారత రాజ్యాంగమే సమానత్వానికి, సామాజిక న్యాయానికి మార్గం వేసింది. దాన్ని రక్షించుకోవడం ద్వారా మాత్రమే సామాజిక న్యాయాన్ని నిర్మించుకోగలుగుతామని గ్రహించాలి.

టి. స్కైలాబ్‌ బాబు
9177549646

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -