Sunday, February 15, 2026
E-PAPER
Homeకథఖత్నా

ఖత్నా

- Advertisement -

గతవారం తరువాయి…….
తనూ భయంతో ”అమ్మీ ఖూన్‌ క్యోం ఆరా… ఆవ్‌ చలే జాయేంగే” అని ఏడవసాగింది. (అమ్మీ వాళ్ళకి రక్తం ఎందుకు వస్తున్నది వెళ్ళిపోదాం) అక్కడంతా పెద్ద శబ్దంతో సంగీతం… డ్రమ్ముల మోత పెట్టారు. పిల్లల అరుపులూ ఏడుపులూ ఎక్కువయ్యేకొద్దీ. తన కళ్ళముందే పక్కింటి తస్నీమ్‌ తన స్నేహితురాలుని రక్తాలోడుతూ నొప్పితో గిజగిజలాడుతుంటే ఎత్తుకుని తీస్కెళ్ళారు. తస్నీమ్‌ వాళ్ళ అమ్మీనే ఉంది అక్కడ. అంతే తనకు అమ్మీ మీద నమ్మకం పోయింది. అమ్మను విదిలించుకుని పారిపోయి ఇల్లంతా పరిగెత్తసాగింది ఏడుస్తూ… ”పకడో బచ్చీకో (పట్టుకోండి పిల్లను” అని నానీమా అరవగానే లోపల్నించి నలుగురు మగవాళ్ళు వచ్చారు. తన వెంట పడి పిట్టలాంటి తనను ఒడిసిపట్టారు. కోతల గదిలోకి తీస్కెళ్ళారు. ఆ గది నానా భీభత్సంగా ఉంది. టేబుల్‌పైనా, కిందా అంతా రక్తం. అక్కడ ఒక మగమనిషి బ్లేడు పట్టుకొని నిలబడ్డాడు. ఇంకొక ముసుగేసుకున్న ముసలామే కూడా ఉంది. అతనా బ్లేడు ఆ ముసలామెకి ఇచ్చాడు. తన కాళ్ళు ఇంకొక ఇద్దరు ఆడాళ్ళు విడదీసి వెడల్పు చేసారు. తన గుండెలు పగలదీసే ఆక్రందనలు ఎవరికీ వినపడలేదు. భయంకరమైన నొప్పితో. రక్తస్రావంతో స్పృహ తప్పి పడిపోయింది తను.

తెలివి వచ్చేటప్పటికీ తనింట్లో ఉంది. తన రెండు కాళ్ళు కలిపి కట్టేసారు. రక్తం అంటుకోకుండా కాళ్ళ మధ్య గుడ్డ పెట్టారు. అది రక్తంలో నిండిపోయి తన బట్టలు, దుప్పటి తడిసిపోయాయి. నొప్పితో ఏడుస్తూనే ఉంది. నొప్పి తగ్గడానికి ఏ మందులూ ఇవ్వలేదు. గుడ్డ మార్చినప్పుడల్లా ఏదో పొడి అద్దే వాళ్ళు. నొప్పితో గిలగిలలాడినప్పుడల్లా టబ్బులో వేడి నీళ్ళు, ఉప్పు వేసి పడుకోబెట్టేవారు. ఆ రోజు ”మూత్రం వస్తుంది. నానీమా” అంది. పోస్కో అంది. ఎలా పోస్కుంటుంది కూర్చోలేదు. రెండు కాళ్ళు కలిపి కట్టేసారు. బాత్రూంకి పాక్కుంటూ పోయింది. పక్కకి ఒంగి పోసే ప్రయత్నం చేసింది కానీ భయంకరమైన నొప్పి మంటతో అరుస్తూ ఏడుస్తూండి పోయింది… నొప్పితో మూత్రం చుక్క చుక్కలుగా వచ్చింది. 14 రోజులు అలాగే నరకయాతన పడింది. పాక్కుంటూ, డేక్కుంటూ బాత్రూంకి పోయేది.

మూత్రం, దొడ్డికి పోవాలంటేనే భయంతో ఒణికిపోయేది, ఏడుస్తూనే ఉండేది ఆ కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు. బంధువులంతా వచ్చి దావత్‌ చేసారు. తనకు ఔరత్‌ బన్‌నేకి బధాయీలు ఇచ్చారు. స్వీట్లు చాక్లెట్లు ఇచ్చారు. కొత్త బట్టలు డబ్బులతో ముంచెత్తారు. తనకు మాత్రం మంట, నొప్పి, రక్తస్రావం, జ్వరం… పధ్నాలుగు రోజుల తర్వాత నొప్పితో నడవలేక కుంటితనం వచ్చాయి. అన్నింటికంటే బాధాకరం బడి మాన్పించేయడం. ఎంత ఏడ్చినా పంపియ్యలేదు. తనంత నొప్పితో ఏడుస్తుంటే అమ్మీ, అబ్బాజాన్‌, నానీమా అంత సంతోషంగా ఎందుకున్నారు. దావత్‌కి తస్నీమ్‌ ఎందుకు రాలేదు? ఎవరూ చెప్పడం లేదు. వాళ్ళింట్లో కూడా దావత్‌ చేసారా? తస్నీము కూడా కోసారుగా తనకులాగానే? ఒకరోజు… పక్కింటి నుశ్రత్‌ వచ్చింది. ”మాలూమ్‌ నై క్యా తస్నీమ్‌ కా ఇంతెఖాల్‌ హోగయ్ బహుత్‌ ఖూన్‌ గయా… బుఖార్‌ ఆగయా, బిచారీ మర్‌గయీ… ఖుదాకో ప్యారీ హోగయీ” కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుందే…

”మేర్కో భీ ఖత్నా కర్తె కతె అమ్మీ బావా… మై నై కర్‌లేతుం… భాగ్‌ జాతుమ్‌ భీ కయీ భీ” అంది భయంగా… తను నుశ్రత్‌ను గట్టిగా కౌగలించుకుంది. పదహారేళ్ళకే పెళ్ళైంది. పెళ్ళిక నరకం. శోభనానికి నాలుగు రోజుల ముందు దవాఖానాకు వెళ్దాం అన్నారు. ఎందుకంటే ‘ఖోల్‌నా’ (తెరవాలి) అన్నారు. ”క్యాం ఖోల్‌నా అమ్మీ…” (ఏం తెరవాలి అమ్మీ) అడిగింది తను. ”ఖత్నా కరేసో ఖోల్నా బేటీ. తుమ్‌ చుప్‌ చాప్‌ లేట్‌ జావ్‌” అంది అమ్మీ. (నీకు ఖత్నా చేసాం కదా, అది విప్పాలి నువ్వు గమ్మున పడుకో) అదొక నరకం.

ఆ డాక్టర్లు మళ్ళీ తన రెండు కాళ్ళ మధ్య కత్తులు కటార్లు ఆడించారు. ”చాలా చిన్నగా అయిపోయింది. ఇక్కడం ఏం లేదు మొత్తం కలిపి కుట్టేసారు. మూత్రానికి, నెలసరి రక్తం పోవడానికి చిన్న రంధ్రాలు వదిలారు అంతే…” డాక్టర్‌ బాధలో అందో… కొత్త విషయం తెలిసిందన్న ఉత్సాహంలో అందో తెలీదు. ”భర్తను కలిసే రంధ్రం కొంచెం కుట్టు విప్పండి చాలు… మిగతా అంతా అట్లే ఉంచండి” సాసూమా డాక్టర్‌కి చెబుతున్నది. ఏం జరుగుతోంది తన కాళ్ళ మధ్య ఉహూ అస్సలు అడగద్దు.

తెరిచిన గాయం పచ్చిగా ఉందింకా… శోభనం ఏర్పాటైంది… ప్రాణం పోయేంత నొప్పితో ఉండలు చుట్టుకుపోతూ ఆపరేషన్‌ గాయం రేగిపోయి తీవ్రంగా రక్తం కారుతూ ఉంటే… భయంతో ఏడుస్తూ గిలగిలలాడ్తున్న తనను చూస్తూ ”ఆదత్‌ హోజాయెగా సబర్‌ కరో” అంటూ నవ్వాడు తన షోహర్‌ షౌకత్‌ అలీ. (అలావాటై పోతుంది ఓర్చుకో) ప్రతీ కలయికా కత్తితో పొడిచి, మళ్ళీ ఆ గాయాన్ని కత్తి మొనతో కెలికినంత నొప్పి) అరుపుల్ని బయట వినపడకుండా నోట్లో గుడ్డలు కుక్కుకునేది. భర్త ఒంటిపై చెయ్యి వేస్తేనే ఒణికిపోయేది. నక్కో, ఛోడ్‌ దో పావ్‌ పడ్తీ హూ అని అతని పాదాల మీద పడిపోయేది ఏడుస్తూ. (ఒదిలెరు వద్దు నొప్పి చాలా అవుతుంది, నీ కాళ్ళ మీదపడతాను)

సంవత్సరం అయ్యాక గర్భం వచ్చింది. సాసూమా దవాఖానాకి తీస్కెళ్ళింది… ”జజ్జీ (ప్రసవం) కష్టం అవుతుంది. కాళ్ళమధ్య రెండు వైపులా ఉన్న ముడతల్ని కలిపి కుట్టేసారు. విప్పాలి. విప్పితేనే ప్రసవం సవ్యంగా జరుగుతుంది” అని చెప్పింది డాక్టరమ్మ. ‘ఖోల్‌దో’ అంది సాసూమా తాపీగా పాన్‌ నములుతూ ”దో బచ్చే హోనేకే బాద్‌ ఫిర్‌ సీదేగే” (ఇద్దరు పిల్లలు పుట్టాక తిరిగి కుట్టేద్దాం అంది సాసూమా. తనది కాదుగా మళ్ళీ తన కాళ్ళ మధ్య కోతలు…
అదృష్టం బాగుండి కవలలు పుట్టారు యాస్మిన్‌ – అర్బాజ్‌.
జజ్జీ మామూలుగానే అయ్యింది. కాకపోతే బిడ్డ తల బయటకు రావట్లేదని కింది వైపుకి ఇంకా కోసారు ఆరు కుట్లు పడ్డాయి… జజ్జీ అయ్యాక తనకు తెలీకుండానే తన రెండు కాళ్ళ మధ్య ముడతలను కలిపి కుట్టేసి ఖత్నా చేసారు. ఈ కోతలూ కుట్లూ భరించలేక నరకయాతన పడింది. నొప్పి భరించలేక గంటలు గంటలు ఏడ్చింది. మీది నించి… షౌహర్‌ కోరికా తీర్చాలి. అతను… అతనే ఒక కత్తి! తనకు ఖత్నా చేసే రేజరు బ్లేడుకంటే కూడా పెద్ద కత్తి తన షోహర్‌, రోజూ ఆ కాట్లను భరించాల్సిందే.

”యా ఖుదా… ఔరత్‌ కీ జిందగీ మే ఇత్నా జెహర్‌ ఔర్‌ దర్ద్‌ క్యోభరా… ఖురాన్‌ మే భీ నహీ లిఖాసో ఏ లోగ్‌ క్యో కరై…” దువా చేసినప్పుడల్లా ఏడ్చేది. నా బిడ్డకు మాత్రం చేయించను గాక చేయించను ఈ ఖత్నా… కొన్ని వేలసార్లు అనుకుంది. తన భర్త షౌకత్‌ అలీ పరమ ఛాందసుడు రోజు ఐదుసార్లు నమాజ్‌ చేస్తాడు… మస్జిద్‌కి వెళ్తాడు. కాన్పుకు ముందు ఒక రోజు ”ఖత్నా కుట్ల విప్పాక కాన్పు తర్వాత మళ్ళీ కలిపి కుట్టెయ్యడం ఎందుకని ఒద్దు” అని కోపంతో ఒణికిపోతూ, తన చెంప పగలగొట్టాడు.

మీ ఆడాళ్ళకు ఖత్నా అందుకే చేస్తారు లేనిపోని సుఖాలకి ఎగబడతారనే కుట్లు విప్పించుకుని ఏం చేద్దామని? నఖరాలు చేస్తున్నావా? పిల్లల్ని కనడం, షోహర్‌కి ఆనందాన్నివడం మాత్రమే మీ పని అర్థం అయ్యిందా? మొహల్లాలో ఇజ్జత్‌ ఉండదు… సయ్యద్నా మాట తప్పుతావా బోహ్రా ఖాందానీ, రివాజ్‌ హై తోడ్‌నేకీ జుర్రత్‌ కభీనహీ కర్నా బేషరమ్‌ ఔరత్‌”, ”ఇది మన బోహ్రాల వంశపు సంప్రదాయం. దీన్ని కాదనే ధైర్యం ఎప్పుడూ చేయద్దు సిగ్గులేనిదానా” అన్నాడు.

తను కోపంగా ”ఖురార్‌లో కూడా ఆడవాళ్ళకు ఖత్నా చేయమని ఎక్కడా లేదు” అంది. ప్రతిగా ఇంకో రెండు సార్లు తన చెంపలు పగిలిపోయాయి. కాళ్ళ మధ్యే కాదు, నోటికీ కుట్లే… తన షౌహర్‌… తమ ముసల్మాన్లలోనే వేరే తెగకు చెందిన ఒక భర్త పోయిన ఆడదానితో సంబంధం పెట్టుకున్నాడు. ”నీతో ఆనందం ఎక్కడని? ముగిసే దాకా గొంతు సగం తెగిన మేకలాగా అరుస్తూనే ఉంటావు నీతో శృంగారం కోయబడి రక్తం కారుతున్న మాంసపు ముద్దతో చేసినట్లు ఉంటుంది. అయినా నీ రెండు కాళ్ళ మధ్య ఏముందని ఖాళీ.. స్త్రీత్వమే లేని దానివి నీ మీద కోరికే ఉండదు. తుమ్సే ఔలాద్‌ చాహియే బస్‌… మూ బంద్‌ కర్‌ కో పడే రహో కుచ్‌ నై బోల్నేకా” అన్నాడు (నీ నించి వారసుడు కావాలి అంతే నోర్మూస్కోని పడి ఉండు ఏం మాట్లాడద్దు) ఖత్నా తను కావాలని చేయించికొన్నట్లు… యాస్మిన్‌కి మూడేళ్ళప్పటి నుంచే మొదలుపెట్టారు ఖత్నా చేయాలన్నట్టు.

తను గట్టిగా నిలబడి కానివ్వలేదు. సాస్‌… షౌహర్‌ చాలా సార్లు వాదించారు. ప్రయత్నించారు. కొట్టారు కూడా. బిడ్డను ఒక్క క్షణం కూడా వాళ్ళకి ఒంటరిగా దొరకకుండా పదిహేను ఏళ్ళు వచ్చే దాకా క్షణ క్షణం యుద్ధం చేస్తూ కాపాడుకుంది. కానీ ఒక రోజు తన భర్తకు కడుపునొప్పి వస్తే దవాఖానాలో చేర్పించాల్సి వచ్చింది. వారం రోజులు ఉంచుకొని, ఆపరేషన్‌ చేసారు. బాంబేలో పెద్ద దవాఖానాలో చేసారు. తన ఇంటికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది దవాఖానా… వారం తర్వాత ఇంటికొచ్చిన తనకు తన బిడ్డ యాస్మిన్‌ మంచంపైన రెక్కలు విరిచిన పక్షిలా ముడుచుకుపోయి కన్పించింది. ”ఏమైంది మున్నీ జ్వరం వచ్చిందా” అని అడిగింది.

తనను చూడగానే గొల్లున ఏడుస్తూ యాస్మిన్‌ మంచంపై నించి లేవబోయే ప్రయత్నం చేసింది. కానీ లేవ లేక పోయింది. దుప్పటి తీసి ఏమైంది.. ఏమైంది అంటూంటే… తన దష్టి కట్టేసిన తనబిడ్డ కాళ్ళమీద పడ్డది. ”ఓ లోగ్‌.. నానీమా… పుప్పా మేరెకు కాట్టియె… బహాత్‌ దర్ద్‌ హువా, ఖూన్‌ గయా… అమ్మీ… మేర్కో ఛోడ్‌ క్యో గయే?” అంటూ ఒణికిపోతూ ఏడుస్తున్నది యాస్మిన్‌. తనకు లోకమంతా అంధకారం అయిపోయింది. అంతే స్పహ తప్పింది. హోష్‌ వచ్చాక అరుస్తూ… సాస్‌, ననంద్‌ మీదకు భయంకరమైన కోపంతో కొట్టడానికి ఎగబడింది. తన షోహర్‌ అడ్డమొచ్చి ‘మెయీచ్‌ కర్నెకో బోలా అమ్మీకో కుచ్‌ నై బోల్నేకా” అంటూ తన చెంపలు వాయించాడు. తనను గదిలో వేసి గొళ్ళెం పెట్టారు. రోజంతా తిండీ, నీళ్ళూ బంద్‌ చేసారు.

తల గుండెలు బాదుకుంటూ ఏడుస్తూండిపోయింది ఏం చేస్తుంది?
ఎన్నిసార్లు తన అమ్మీని అడిగింది. ”ఖత్నా కర్‌కో క్యాఫాయిదాహై ఔరత్‌కో… ఏక్‌ ఫాయిదా బతావో అమ్మీ తుమ్‌ కో ఐసా కరే… మేర్సెక్యా ఛీన్‌లియే తుమ్‌… తుమ్‌కో క్యా హక్‌ బన్‌తా హై” అని… ”ఔరత్‌ క్యా ఇజ్జత్‌ కేలియే కర్నా పడతా బేటీ… మై ఔర్‌ మేరీ అమ్మీ సాస్‌ భీ… మేరే దాదీ, నానీ భీ కర్‌లియే… హమారే సబ్‌ బెహ్‌నా భీ కర్‌ లియే ఔర్‌ ఏ రోక్‌నా ఔరతేకే హాతో మే నహీ హై బేటీ వేలోగ్‌ నహీ మాన్తే…” అనేది అమ్మీ నిర్లిప్తంగా…
”ఆడవాళ్ళకి ఖత్నా చేస్తే వచ్చే ఒక్క లాభం చెప్పు అమ్మీ నాతో ఎందుకిలా చేసావు… నా నించి ఏం గుంజుకున్నావు… నీకేం అధికారం ఉంది” అంది తను. ”ఖత్నా స్త్రీ గౌరవం పెంచడం కోసమే చేస్తారు బేటీ నేను, మా అమ్మ, అమ్మమ్మ, నాన్నమ్మ, మా అక్క చెల్లెళ్ళు, అత్తగారూ అందరం చేస్కున్నాం. అయినా దీన్ని ఆపడం ఆడవాళ్ళ చేతుల్లో లేదు. వాళ్ళు ఒప్పుకోరు.”

”అరె… క్యాబోల్తీ హో ఆరెఫా… ఖత్నా చేస్కుంటే ఆడదాని మొఖంలో కొత్త నూర్‌ (మెరుపు) వస్తుంది… షౌహర్‌ నీనించి పక్కకు వెళ్ళడు తెలుసా, ఇంకో ఔరత్‌ వైపు చూడడు” అంది నానీమా. ”అందుకేనా నీ కొడుకు నన్ను చూస్తే అసహ్యం పుడుతుందని, ఇంకోదాని దగ్గరికి పోతున్నాడు” అని అరిచింది తను కోపంగా. నానీమా గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. తన బిడ్డకు ఖత్నా జరగడం ఆపలేక పోయింది. ఆ సైతాన్లు మాటేసి కాటేసాయి. పెళ్ళాయ్యాక యాస్మిన్‌ తరచూ ఫోన్లు చేసేది. ”అమ్మీ అతన్ని కలిసేటప్పుడు చాలా నొప్పి వస్తుంది” అని ఒకసారి ”నేను పడక మీద రాయిలాగా కదలకుండా పడి ఉంటానంటూ… నిన్ను చూస్తే కోరిక పుట్టదని అంటాడు అమ్మీ”, అని మరోసారి. ”అమ్మీ… ఆయన ఇంకో ఆడదానితో సంబంధంలో ఉన్నాడు” అని ఇంకోసారి ఎక్కెక్కి ఏడుస్తూ.

”అమ్మీ నాకు తలాఖ్‌ ఇస్తాను అంటున్నాడు క్యాకరూ” అని ఈ మధ్య మరీ తరచుగా ఫోన్‌ చేసి ఏడుస్తున్నది. పోయిన్నెల… మనవరాలు మాసూమాకి ఖత్నా చేద్దామని వెంటబడుతున్నారంటే గుండె గుభేలుమంది. యాస్మిన్ని వెంఠనే బయలుదేరి రమ్మంది. వచ్చినప్పట్నించి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉంది యాస్మిన్‌. ఏం చెయ్యాలి? ఎలాగైనా మాసూమాను కాపాడుకోవాలి.

అమ్మీ డైరీలో రాస్కున్న తన బాధాకర గ్నాపకాలు.. యాస్మిన్‌ చంపలు తడిసి పోయాయి. ఎంత ఘోరంగా చేసారు. అమ్మకి… ఖత్నా… మొత్తం మూసేసి… మళ్ళీ కోసి, మళ్ళీ తెరిచి, మళ్ళీ మూసేసి… ఎలా.. ఎలా భరించావు అమ్మీ యాస్మీన్‌ ఆవేదనతో వెక్కి వెక్కి ఏడ్చింది. అవును, తనకు ఖత్నా కాలేదంటే ఎంత అపవిత్రమైన స్త్రీగా చూసేవాళ్లు? వాళ్ళ ఇళ్ళల్లో పండగలకు పిల్చేవాళ్లు కాదు బంధువులు.

ఒకసారి తమ ఇంట్లో దావత్‌ అయితే వచ్చిన పర్వేజ్‌ తనను చూసి ఇష్టపడ్డాడు. తనకంటే పదేళ్ళు పెద్ద. పర్వేజ్‌ అమ్మీ మునీరా ఇంటి చుట్టూ తిరిగింది. చాలా సార్లు వచ్చి అబ్బాజాన్‌ నానీమాను అడిగింది. అమ్మీ వద్దంది పిల్ల చదువుకుంటుంది అని చెప్పింది నానీమాతో, అబ్బాజాన్‌తో కోట్లాడింది. కానీ అబ్బాజాన్‌ పెళ్ళికి ఒప్పుకున్నాడు. అయితే మునీరా నిఖాకి ముందే తనకు ఖత్నా చేయించాలని. లేకపోతే మా ఖాన్దాన్లో ఒప్పుకోరు అంది.

అమ్మ ఒప్పుకోలే. కానీ అమ్మీకెవరూ విలువ ఇవ్వలేదు. అమ్మీ ఓడిపోయింది. ”ఖత్నా వాళ్ళే చేయించి నిఖా చేస్కున్నారు కాబట్టి అతని మీద మీరు కేసు వేయచ్చు…” లాయర్‌ నస్రీన్‌బాను అంది. యాస్మిన్‌, అరెఫాల ముఖాలు వెలిగిపోయాయి. లాయర్‌ యాస్మిన్‌ చేతిలో ఒక కార్డు పెట్టింది. ”ఈమెతో మాట్లాడు ఆడవాళ్ళకు ఖత్నాలు ఆపడానికి పోరాటం చేస్తున్నది” అన్నది.

ఇంటికొచ్చిన యాస్మిన్‌, ఆరెఫాలకు నానీమా ఎవరితోనో మాట్లాడుతూ దాదీమా కన్పించింది. ఆమెను చూడగానే యాస్మిన్‌ మొఖం ముడుచుకుపోయింది. ”యాస్మీన్‌కో జల్దీ భేజో… మాసూమా కో భీ సాత్‌ సాల్‌ ఆగయే బడీ హోగయీ, ఖత్నా కరవానా హై” అంటోంది మునీరా దాదీమా తోటి. యాస్మిన్‌, ఆరెఫా ఇద్దరికీ రక్తం మరిగిపోయింది. పరిగెత్తినట్లే మునీరా దగ్గరికి వెళ్ళి ”బేషరమ్‌ ఔరత్‌… ఖత్నా చేస్తేనే నిఖా అని నా బిడ్డకు నేను ఒద్దన్నా, నేను లేనప్పుడు ఖత్నా చేయించావు దోఖేబాద్‌. ఇప్పుడు నీ కొడుకుకు మోజు తీరిపోయాక తలాఖ్‌ ఇస్తానంటే నోర్ముస్కుంటున్నావు. ఇప్పుడు నా మనవరాలుని కాటెయ్యడానికి వచ్చావా ఫో ఇక్కడ్నించి” ఆరెఫా కోపంతో ఊగిపోతూ అరిచింది. మునీరా తెల్లబోయింది.

”దేఖో సమ్దన్‌జీ తలాఖ్‌ నక్కో బోల్‌ కో మై భీ బోల్‌రై పర్వేజ్‌ కో… మగర్‌ యాస్మిన్‌ భీ పర్వేజ్‌ దూ ఔరత్‌ కనే గయేతో, షాదీ కరేతో చుప్‌ బైట్నా.. మై ఔర్‌ తుమ్‌ చుప్‌నై బైటే క్యా ఔరత్‌ హై హమ్‌లోగ్‌ సబ్‌కుచ్‌ సబర్‌ కర్నా పడతా హై” అంది కోపంతో ముటముటలాడుతూ (నేను కూడా విడాకులొద్దన్నా పర్వేజ్‌ని. కానీ నా కొడుకు వేరే ఆడదాని దగ్గరికి వెళ్ళినా, రెండో పెళ్ళి చేస్కుంటాన్నా నీ కూతురు ఊర్కోవాలి. నువ్వూ, నేనూ ఊర్కోలేదా? ఆడవాళ్ళం అన్నీ భరించాలి మరి) ”నీ కొడుకూ వద్దు… నీ కొడుకుతో సంసారమూ వద్దు. నేనే నీ కొడుకు మీదా, నీ మీదా కేస్‌ వేస్తున్నా. లాయర్‌ దగ్గరికి వెళ్ళొచ్చా… నేనే నీ కొడుకుకి ‘ఖులా’ ఇస్తున్నా, చెప్పుకోఫో, ముసలిదానా ఫో ఇక్కడ్నించి” యాస్మీన్‌ కోపంతో, అరుస్తూ దర్వాజ వైపు వేలు చూపించింది ఇంట్లోంచి వెళ్ళమన్నట్లుగా. మునీరా కోపంతో ఎర్రబడ్డ మొఖంతో ”మై భీ దేఖ్‌లేతుం… జిందగీ బర్‌బాద్‌ కర్‌లేరే మాబేటీ దోనో” అంటూ వెళ్ళిపోయింది.

(నేనూ చూస్తా… తల్లిబిడ్డలిద్దరూ కల్సి జీవితం నాశనం చేస్కుంటున్నారు). ‘నీ పేరేంటి ఎందుకేడుస్తున్నావు’… తన పక్కన కూర్చున్న ఒక ముప్ఫై సంవత్సరాల అమ్మాయిని చూస్తూ అడిగింది యాస్మిన్‌. ఆమె వచ్చినప్పట్నించీ ఏడుస్తూనే ఉంది. ఆమె భర్త కాబోలు కోపంగా అంటున్నాడు. ”ఏడవకు పరువు పోతుంది” అని. ”ఏమైంది బేటీ ఎందుకు ఏడుస్తున్నావు. నాకు చెప్పు నీ గుండె భారం తగ్గుతుంది” అంది ఆరెఫా. డాక్టర్‌ ఇంకా రాలేదు… పేషంట్లు ఎదురు చూస్తున్నారు.

అది హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లోని ఖరీదైన మెటర్నిటీ హాస్పిటల్‌. ఆమె భర్త ఇప్పుడే వస్తా అని, ఫోన్‌ మాట్లాడుతూ బయటకు వెళ్ళాడు. ఆరెఫా మళ్ళీ బుజ్జగిస్తూ అడిగింది. ”నా పేరు సంస్కృతి” అంది. ఆమె భర్త వెళ్ళిన దిశగా భయంగా చూస్తూ. వచ్చీ రాని హిందీలో చెప్పసాగింది కన్నీళ్ళు తుడుచుకుంటూ. ఇద్దరు పిల్లలు పుట్టాక యోని వదులైందని సతాయిస్తున్నాడు ఆమె భర్త… నీతో సంతప్తిగా లేదు అంటూ ఈ మధ్య ఇంకో ఆడదాని దగ్గరకు పోతున్నాడట.

డాక్టరు చెకప్‌ చేసి వదులు ఏమీ కాలేదు అని కొన్ని సలహాలు ఇచ్చిందట అయినా వినకుండా తన యోనికి కుట్లు వేసి టైట్‌ చేయించడానికి ఆపరేషన్‌ కోసం మాట్లాడ్డానికి ఇంకో సర్జన్‌ దగ్గరికి తీస్కోచ్చాడట. ఆ ముందు వెళ్ళిన డాక్టరమ్మ చేయనన్నదని మగ సర్జన్‌ దగ్గరికి వచ్చాడట. ”నాకిష్టం లేదు… కానీ ఆయన వేరే ఆడదాని దగ్గరికి వెళుతున్నాడు ఏం చెయ్యను?” సంస్కృతి మౌనంగా కన్నీరు కారుస్తూ అంది. ”నువ్వు ఒప్పుకోకు… నువ్వు పుట్టింటికెళ్ళిపోయి పంచాయితీ పెట్టాలి… ఎవరైనా లాయర్‌ దగ్గరికి వెళ్ళు. ఇదిగో ఈ కార్డు తీసుకో” యాస్మిన్‌ సంస్కృతి చేతిలో లాయర్‌ నస్రీన్‌ బాను విసిటింగ్‌ కార్డు ఇచ్చి ధైర్యం చెప్పింది. ఆరెఫా దిగులుపడ్డ మనసుతో… సంస్కతి కన్నీళ్ళు తుడుస్తూ ధైర్యం చెప్పింది.

”మీరెందుకు వచ్చారు. మీకేం సమస్య ఉంది?” సంస్కతి అడుగుతుండగానే డాక్టర్‌ వచ్చింది. యాస్మిన్‌… ఆరెఫా లోపలికి వెళ్ళారు.. అర్ధగంట తర్వాత బయటకు వచ్చారు. ఇద్దరి మొఖాల్లో సంతోషం, పెదాలపై చిరునవ్వు కనిపిస్తున్నాయి. సంస్కృతి దగ్గరికి వచ్చారు. ”ధైర్యంగా ఉండు. సర్జన్‌కి ఈ ఆపరేషన్‌ ఇష్టం లేదని, బలవంతంగా చేస్తే డాక్టర్స్‌పైనా, నీ భర్తపైనా కేసు వేస్తానని చెప్పు” అంది యాస్మిన్‌. సరే అంటూ ”నువ్వెందుకు వచ్చావు డాక్టరు దగ్గరికి” అంది సంస్కృతి. ”నేను వేసిన కుట్లు విప్పించుకోడానికి వచ్చాను రెండ్రోజుల్లో ఆపరేషన్‌ చేస్తానంది డాక్టర్‌” అంది యాస్మిన్‌ నవ్వుతూ… యాస్మిన్‌, ఆరెఫా మొఖాలు సంతోషంతో వెలిగి పోతున్నాయి. చిన్నారి మాసూమా… ”అమ్మీ ఐస్క్రీమ్‌ హోనా” అంది యాస్మిన్‌ చెయ్యి గట్టిగా పట్టుకుని.

  • గీతాంజలి
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -