Sunday, June 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి భరోసానిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఉచిత బ్రేక్‌ఫాస్ట్ పథకానికి ఈ నెల 15న శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ ఇప్పటికే పూర్తి చేసింది. తొలి విడత కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1302 విద్యాసంస్థలను ఎంపిక చేశారు. ఇందులో 1,269 ప్రభుత్వ పాఠశాలలు, 33 జూనియర్ కాలేజీలు ఉన్నాయి.

ప్రారంభంలో ఈ పాఠశాలల్లోని 1,44,610 మంది విద్యార్థులకు వారంలో ఆదివారం మినహా మిగిలిన ఆరు రోజులు రుచికరమైన, పౌష్టిక విలువలతో కూడిన అల్పాహారాన్ని అందించనున్నారు. ఈ అల్పాహార పథకాన్ని శాస్త్రీయంగా, పరిశుభ్రమైన వాతావరణంలో అమలు చేయడానికి ప్రభుత్వం సెంట్రలైజ్డ్‌ కిచెన్ల విధానాన్ని ఎంచుకుంది. కొత్త విద్యా సంవత్సరంలోగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఈ పథకాన్ని విడతల వారీగా విస్తరించనున్నారు.

ఈ క్రమంలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 39 చోట్ల మోడ్రన్ కిచెన్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.299.90 కోట్ల వ్యయంతో అంచనాలు సిద్ధం చేసింది. ఇందులో ఇప్పటికే ఉన్న 7 కిచెన్లను అత్యాధునికంగా అప్‌గ్రేడ్ చేస్తూ మిగిలిన 32 కిచెన్లను కొత్తగా నిర్మించనున్నారు. ఈ నిర్మాణ వ్యయంలో ప్రభుత్వం తన వాటాగా 70 శాతం నిధులను భరిస్తుండగా.. మిగిలిన 30 శాతం మొత్తాన్ని భాగస్వామ్య స్వచ్ఛంద సంస్థలు సమకూరుస్తాయి. తెలంగాణ విద్యా సంక్షేమ, మౌలికాభివృద్ధి సంస్థ ఈ కిచెన్ల నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తుండగా.. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -