Tuesday, June 16, 2026
E-PAPER
Homeజాతీయంగ్యాంగ్‌స్టర్‌‌లా అమెరికా

గ్యాంగ్‌స్టర్‌‌లా అమెరికా

- Advertisement -

భారత నావికుల హత్యను ఖండించిన వామపక్షాలు
ట్రంప్ దూకుడును వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు
ఐదు వామపక్షాల నేతల పిలుపు

న్యూఢిల్లీ : హార్ముజ్ ‌జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై అమెరికా నావికాదళం జరిపిన దారుణమైన దాడిని ఐదు వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించారు. భారతీయ సిబ్బంది వున్న నౌకలపై ఇలా దాడి జరపడం ఇది మూడోసారి. పైగా తమ ఆంక్షలను ఉల్లంఘిస్తే ఏ నౌకపైనైనా ఇలాగే దాడులు జరుపుతామంటూ అమెరికా ప్రభుత్వం బెదిరించడాన్ని వామపక్షాలు తీవ్రంగా నిరసించాయి. ఈ మేరకు ఐదు వామపక్షాలు సంయుక్త పత్రికా ప్రకటనను విడుదల చేశాయి. దీనిపై సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ (ఎంఎల్‌)-లిబరేషన్‌ ప్రధాన కార్యదర్శి దీపంకర్‌‌ భట్టాచార్య, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ ‌బ్లాక్‌ (ఎఐఎఫ్‌‌బీ) ‌ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్‌, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్‌ఎస్‌‌పి) ‌ప్రధాన కార్యదర్శి మనోజ్‌ ‌భట్టాచార్యలు సంతకాలు చేశారు.

ఐక్యరాజ్య సమితి నిబంధనావళికి, అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛా రాకపోకల సూత్రాలకు విరుద్ధంగా అమెరికా ప్రభుత్వ చర్యలు వున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. గ్యాంగ్‌‌స్టర్‌‌గా వ్యవహరిస్తున్న అమెరికా, యావత్‌ ‌ప్రపంచంపై తన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తోందని విమర్శించింది. దీన్ని ఎంత మాత్రమూ సహించబోమని వామపక్షాలు స్పష్టం చేశాయి. దేశ స్వతంత్ర విదేశాంగ విధానానికి తిలోదకాలు ఇవ్వడం ద్వారా, అమెరికాకు జూనియర్‌ ‌భాగస్వామిగా మారడం ద్వారా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన విధులను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించాయి. ఈ సంఘటనపై ప్రభుత్వం పేలవమైన రీతిలో స్పందించడం, అమెరికా క్షమాపణ చెప్పేలా ఒత్తిడి తీసుకురావడంలో విఫలమవడం ఇందుకు తాజా ఉదాహరణ అని వామపక్షాలు పేర్కొన్నాయి. భారత సార్వభౌమాధికారం, ఆత్మ గౌరవానికి ఇది తీరని అవమానమని వామపక్షాల ప్రకటన విమర్శించింది.

ఇరాన్‌‌పై, పశ్చిమాసియాపై అమెరికా కొనసాగించిన యుద్ధంతో ఇంధన వ్యయాలు పెరగడం, ఎరువులు, ఇతర నిత్యావసరాల కొరత కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. గ్లోబల్‌ ‌సౌత్‌ ‌ దేశాల్లో కీలకమైన దేశంగా భారతదేశం, అమెరికా సామ్రాజ్యవాద దూకుడును తీవ్రంగా ఖండించాలి. అమెరికాకు వ్యతిరేకంగా నిలబడటంలో గ్లోబల్‌ ‌సౌత్‌ ‌(అభివృద్ధి చెందుతున్న దేశాలు) గొంతుకలకు నాయకత్వం వహించాలని ఆ ప్రకటన కోరింది.
అమెరికా దాడిలో మరణించిన నావికుల కుటుంబాలకు సక్రమంగా నష్టపరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్షాలు డిమాండ్‌‌ చేశాయి. అమెరికా దూకుడును నిరసించాలని, భారత నావికుల హత్యలను ఖండించాలని దేశ ప్రజలను వామపక్షాలు కోరాయి. అమెరికా తీరును నిరసిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని దేశవ్యాప్తంగా గల శాఖలకు పిలుపునిచ్చాయి. ఈ మరణాలకు కారకులైన వారిని శిక్షించేందుకు దౌత్యపరంగా అన్ని చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -