విదేశీ పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్
ఎఫ్‌డీఐ ఆకర్షణకు మరిన్ని చర్యలు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ : విదేశీ పెట్టుబడిదారుల కోసం విస్తృత సంస్కరణలు చేపడుతామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో తలెత్తుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు.. దేశీయంగా విదేశీ మూలధన ప్రవాహాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంయుక్తంగా కీలక చర్యలు ప్రారంభించాయన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ‘మైండ్ మైన్ సమ్మిట్ 2026’లో మంత్రి మాట్లాడుతూ.. విదేశీ నిధులను తిరిగి భారత మార్కెట్ వైపు ఆకర్షించేందుకు తీసుకుంటున్న ఈ చర్యల్లో ఇది మొదటి అడుగని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు ఉంటాయని స్పష్టం చేశారు. బాండ్ మార్కెట్ కోసం ఇటీవల ప్రకటించిన రాయితీలు కేవలం ఆరంభం మాత్రమేనని, విదేశీ పెట్టుబడులను పెంచేందుకు మరిన్ని విస్తృత ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి విదేశీ పెట్టుబడుల అవసరం ఎంతైనా ఉందన్నారు. మార్కెట్లకు అవసరమైన పెట్టుబడులు అందేలా ఆర్బీఐ కలిసి పని చేస్తున్నామని వెల్లడించారు.
‘మన దేశంలోకి మరింత విదేశీ మూలధనం రావాల్సిన అవసరం ఉందని మేము గుర్తిస్తున్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు విదేశాల నుండి నిధులను సేకరించడానికి ఆర్‌బిఐ అనుమతించింది. అయితే ఇది ఇక్కడితో ముగిసిపోయే ప్రక్రియ కాదు. భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకోబోతున్నాం.’ అని మంత్రి సీతారామన్ ఆన్నారు.
బాండ్ మార్కెట్‌ను బలోపేతం చేసేందుకు ఫుల్లీ యాక్సెసిబుల్ రూట్ (ఎఫ్‌ఏఆర్)తో అనుకూలమైన విత్‌హోల్డింగ్ టాక్స్ విధానం ద్వారా విదేశీ ఇన్వెస్టర్లకు భారతీయ బాండ్లను మరింత ఆకర్షణీయంగా మార్చామని ఆమె వివరించారు. అంతేకాకుండా పీఎస్‌యూలు, బ్యాంకులు విదేశాల్లో నిధులు సేకరించేటప్పుడు ఎదురయ్యే కరెన్సీ హెడ్జింగ్ రిస్క్ (విదేశీ మారక ద్రవ్య హెచ్చుతగ్గుల నష్టం) భారాన్ని ఆర్‌బిఐ భరించేలా ఒక ప్రత్యేక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు.
అంతర్జాతీయ సవాళ్లు..
ప్రపంచవ్యాప్త వ్యాపారాల తరహాలోనే భారత్ కూడా తన నియంత్రణలో లేని పలు అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొంటోందని ఆర్థిక మంత్రి తెలిపారు. అంతర్జాతీయ సుంకాలు, కమొడిటీ ధరలలో హెచ్చుతగ్గులు, గ్లోబల్ సప్లై చైన్‌లో ఏర్పడుతున్న అంతరాయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయన్నారు.
దిగుమతుల భారం..
భారతదేశానికి ఉన్న భారీ దేశీయ మార్కెట్ రక్షణ కవచంగా నిలుస్తున్నప్పటికీ.. కీలకమైన ముడిసరుకులు, ఇంటర్మీడియట్ వస్తువుల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోందని మంత్రి తెలిపారు. దీనివల్ల బాహ్య ఒడిదుడుకుల ప్రభావం దేశంపై పడుతోందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా ముడిచమురు ధరల పెరుగుదల, రవాణా బీమా ఖర్చులు, షిప్పింగ్ రిస్క్‌లు దేశ దిగుమతి బిల్లును, విదేశీ మారక నిల్వల అవసరాలను పెంచుతున్నాయన్నారు.
ఎల్ నినో భయాలు..
ముఖ్యంగా ఎల్ నినో పరిస్థితుల వల్ల వాతావరణంలో మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఆహార కొరత రాకుండా సరిపడా సరిపడ నిల్వలు ఉన్నప్పటికీ, వర్షపాతం తగ్గితే రైతుల ఆదాయంపై ఒత్తిడి పడే అవకాశం ఉందన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుండి అంతర్జాతీయ ఎరువుల మార్కెట్ సరఫరా పరిస్థితులు అనేకసార్లు మారాయని మంత్రి తెలిపారు. కొన్ని సాంప్రదాయ సరఫరా దేశాలు తమ దేశీయ అవసరాల కోసం ఎగుమతులను తగ్గించుకోవడంతో కొరత ఏర్పడుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయని.. అయితే దాదాపు ఏడాది తర్వాత చైనా తిరిగి ఎగుమతుల మార్కెట్లోకి ప్రవేశించడంతో ఆ భయాలు కొంతవరకు తొలగిపోయాయని మంత్రి పేర్కొన్నారు. ద్వితీయ శ్రేణీ నగరాల్లోనూ ఐటీ కంపెనీలు జీసీసీలను విస్తరించడానికి ఆసక్తిని కనబర్చుతున్నాయన్నారు.
మరిన్ని ఆర్థిక సంస్కరణలు చేపడతాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



