నవతెలంగాణ-హైదరాబాద్: లక్నో ఎకానె స్టేడియంలో భారత్, అఫ్గనిస్తాన్ జట్లు నేడు రెండో వన్డేలో తలపడనున్నాయి. సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. ఓ విజయంపై కన్నేసిన అఫ్గనిస్తాన్ సిరీస్ పోరును ఆఖరు మ్యాచ్‌కు తీసుకెళ్లాలనే సంకల్పంతో కనిపిస్తోంది. బ్యాటింగ్ లైనప్‌లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ భారీ ఇన్నింగ్స్‌లపై కన్నేశారు. శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ ఫామ్ కొనసాగిస్తే భారత్ భారీ స్కోరు చేయటం ఖాయం. ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌తో జట్టు సమతూకం మెరుగైంది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ బృందానికి సారథ్యం వహించనున్నాడు. స్పిన్‌కు అనుకూలించే ఎకానె స్టేడియంలో చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకునే వీలుంది.
అఫ్గనిస్తాన్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్ వైట్‌బాల్ ఫార్మాట్‌లో ప్రమాదకర హిట్టర్. 48 బంతుల్లోనే సెంచరీ సాధించిన గుర్బాజ్‌కు రెహమత్ షా, ఇబ్రహీం జద్రాన్ సైతం జతకలిస్తే అఫ్గనిస్తాన్ ఆతిథ్య జట్టుకు గట్టి పోటీ ఇవ్వగలదు. జియార్ రెహమాన్, మహ్మద్ సలీమ్, రషీద్ ఖాన్, ఘజన్‌ఫార్‌లతో కూడిన బౌలింగ్ లైనప్ భారత బ్యారట్లకు సవాల్ విసిరేందుకు ఎదురుచూస్తోంది.



