నవతెలంగాణ-హైదరాబాద్: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మంగళవారం నిర్వహించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి బీఆర్‌ఎస్, సీపీఐ అభ్యర్థులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థులు వచ్చారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణ రాజుకొని ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నిన్న జనగామలో చేసినట్లుగానే బిఆర్‌ఎస్ కౌన్సిలర్లను చైర్మన్ ఎన్నికలో పాల్గొననివ్వకుండా పోలీసులు అక్రమ కేసులు పెట్టి అడ్డుకున్నారు. చైర్మన్, వైఎస్ చైర్మన్ ఎన్నికలో పాల్గొనేందుకు వెళుతున్న క్యాతనపల్లి మున్సిపాలిటీ 21వ వార్డు బిఆర్‌ఎస్ కౌన్సిలర్ స్వర్ణలతను మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. ఆమెపై కేసు నమోదైందని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. దీంతో బాల్క సుమన్ మీద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. కాంగ్రెస్ దాడిని బిఆర్‌ఎస్ నాయకులు ప్రతిఘటించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



