మహిళా రైతు నిర్మాత నర్సమ్మ తమ ఎయిత్ వండర్ సినిమా బ్యానర్ మీద రవిబాబు ప్రధాన పాత్రలో ‘స్పిరిట్ : ఈజ్ నాట్ వన్అనే చిత్రాన్ని నిర్మించారు. దీనికి వెంకట రవీంద్రనాథ్ దర్శకుడు. వెంకట చినస్వామి సమర్పకుడు. ఈ సినిమాకి గత ఏడాది సెన్సార్ కూడా సర్టిఫికెట్ ఇచ్చింది. గత నెలలో విడుదల చేయాలని ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు నర్సమ్మ. ఈ నేపథ్యంలో ప్రభాస్ కథానాయకుడిగా 'స్పిరిట్ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతలు తమ సినిమా టైటిల్ వాడుకుంటున్నారని, ఈ సినిమాని విడుదల చేయకూడ దంటూ కోర్టు నోటీసులు పంపారు. దీని గురించి నర్సమ్మ స్పందిస్తూ, ‘హీరో ప్రభాస్ మాకు మీరే దిక్కు. ఆస్తులు అమ్మి “స్పిరిట్” ఇస్ నాట్ వన్ సినిమా తీసి, సర్వం కోల్పోయాం. పిచ్చుక మీద బ్రహ్మ స్త్రంలా మా మీద రెండు లీగల్ నోటీసులు పంపించి. సినిమా రిలీజ్ ఆపేసారు. మాతో మాట్లాడితే వేరే టైటిల్ పెట్టుకుని, మా సినిమా రిలీజ్ చేసుకునే వాళ్ళం. మీకోసం టైటిల్ మార్చుకోడడానికి మేం సిద్ధం గానే ఉన్నాము.
మమ్మల్ని సంప్రదించకుండా టీ-సిరీస్ సంస్థ అధినేత భూషణ్ కుమార్ రెండు లీగల్ నోటీసులు పంపారు. ఒక రైతు కుటుంబం సినిమా తీస్తే, మాకు వచ్చిన టైటిల్ వివాదంకి చిత్ర పర్రిశమ ఎటువంటి సపోర్ట్ చేయటం లేదు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా పై అభిమానంతో ఈ విజ్ఞప్తిని చేస్తున్నాను. మీ సినిమా షూటింగ్ మొదలు పెట్టక ముందు సంవత్సరంలోనే మా సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ లభించింది. అంతకుముందే మేము అనేక యూట్యూబ్ ఛానెల్స్, వార్తాపత్రికలు, ఇతర మీడియా వేదికల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాం. చిత్రానికి సంబంధించిన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాం. గత నెలలో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించి, పోస్టర్లు ముద్రించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన సమయంలో సందీప్ రెడ్డి వంగా మేనేజర్ ద్వారా మా ఇంటి చిరునామా, ఇతర వివరాలు మా నుంచే సేకరించారు. వాటిని టీ-సిరీస్ వారికి అందించి అనంతరం మాకు లీగల్ నోటీసు పంపించారు.
అన్ని రకాలుగా నష్టపోయాం..
ఈ పరిణామాల వల్ల మా కుటుంబం సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విడుదల కోసం పెట్టిన పెట్టుబడులు నిలిచిపోయాయి. ఈ సినిమా నిర్మాణం కోసం చేసిన అప్పుల కారణంగా రుణదాతల నుంచి కూడా ఒత్తిడి ఎదురవుతోంది. అప్పులు ఎగ్గొట్టటానికి ఈ లాయర్ నోటీసు మేమే కావాలని పంపించామనే నింద కూడా మాపై వేశారు. టైటిల్‌కు సంబంధించిన ఏదైనా అభ్యంతరం ఉంటే, పెద్దల సమక్షంలో చర్చించి పరిష్కారం కనుగొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, మా కుటుంబ సభ్యులందరి కష్టం. దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకుని సినిమా విడుదలకు సహకరించాలని ప్రభాస్, సందీప్ రెడ్డి వంగాని వేడుకుంటున్నాను. మా సమస్యకు మీ నిర్మాతల దగ్గర్నుంచి సహకారం లభించక పోయిన పక్షంలో మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం` అని నర్సమ్మ తెలిపారు.
“స్పిరిట్: ఈజ్ నాట్ వన్సినిమా తీసి సర్వం కోల్పోయాం. ప్రభాస్ మాకు మీరే దిక్కు. మీ 'స్పిరిట్ నిర్మాతలు మా సినిమా పై కోర్టు కేసు వేసి, రిలీజ్ ఆపేశారు. మేం రోడ్డున పడ్డాం` అని మహిళా రైతు నిర్మాత నర్సమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా ప్రకటన ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని నర్సమ్మ తెలిపారు.



