– కోమటిరెడ్డి, తుమ్మల,శ్రీధర్ బాబు
– రూ.800 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు
– మంథని రోడ్ల అభివృద్ధి పనులను 18 నెలల్లో పూర్తి చేస్తాం
నవతెలంగాణ – (మల్హర్ రావు) మంథని
మంథని నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తోందని, గత రెండున్నరేళ్లలో సుమారు రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించామని, ఈ పనులను 18 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మంథనిలోని గంగాపురి వద్ద రూ.20 కోట్లతో ఎన్ఏసి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్,మంథని–రామగుండం నాలుగు లేన్ల రహదారి విస్తరణ పనులకు రూ.21 కోట్లు, ఇతర ఆర్‌అండ్‌బీ రహదారి పనులకు రూ.97 కోట్లు, మంథని పట్టణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో రూ.15 కోట్లతో బీటీ రోడ్లు, రూ.9 కోట్లతో అంతర్గత సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌తో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు.
మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో నాలుగు మండలాల లబ్ధిదారులకు రేషన్ (స్మార్ట్) కార్డులు, కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, మైనార్టీలకు కుట్టుమిషన్లు, మహిళా స్వశక్తి సంఘాలకు చెక్కులను మంత్రులు పంపిణీ చేశారు.ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ,దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన మహనీయుడు పీవీ నరసింహారావు, అజాతశత్రువు దుద్దుల శ్రీపాదరావు ప్రాతినిధ్యం వహించిన మంథని నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆహ్వానం మేరకు మంథనికి రావడం సంతోషంగా ఉందన్నారు.మంథని నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి రూ.800 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. నల్గొండలో కూడా ఇంత భారీగా నిధులు మంజూరు కాలేదన్నారు. గోదావరి నదిపై హై లెవల్ బ్రిడ్జికి రూ.125 కోట్లు, బైపాస్ రహదారికి రూ.162 కోట్లు, HAM రహదారులకు రూ.203 కోట్లు, మంథని–ఓడేడు రహదారికి రూ.60 కోట్లు తదితర పనులకు నిధులు మంజూరు చేశామని చెప్పారు.మంథని నియోజకవర్గంలోని అన్ని రహదారి పనులను 18 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రతి 15 రోజులకు మంథని రహదారి పనులపై సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలందరికీ డబుల్ రోడ్డు సౌకర్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.కమాన్‌పూర్ నుంచి మంథని మున్సిపాలిటీ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి సుమారు రూ.200 కోట్లు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తీసుకుని, వచ్చే 15 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.గంగాపురి వద్ద నిర్మిస్తున్న NAC స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను మహిళలు, యువతకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆరు నుంచి ఎనిమిది నెలల్లో కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తామని చెప్పారు.ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం లభించడం సాధ్యం కాదని, ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందేందుకు యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి కూడా సుమారు రూ.200 కోట్ల పనులకు నిధులు మంజూరు చేశామని మంత్రి తెలిపారు.రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధితో పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పేరును SIR ముసాయిదా జాబితాలో పరిశీలించుకోవాలని, ప్రతి ఓటు ముఖ్యమైనదేనని మంత్రి సూచించారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ* కష్టకాలంలో కూడా మంథని ప్రజలు తమ వెంట ఉన్నారని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి రూ.800 కోట్ల నిధులు మంజూరు చేయడం కూడా తక్కువేనని అన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రతిభావంతుడని, ఏ పనినైనా పూర్తి చేయగల సామర్థ్యం ఆయనకు ఉందన్నారు.దివంగత శ్రీపాదరావుతో కలిసి పనిచేసే అవకాశం తనకు లభించిందని, శాసనసభ స్పీకర్‌గా ఆయన మంచి విలువలతో పనిచేశారని మంత్రి గుర్తు చేశారు. మంథని అభివృద్ధి కోసం ప్రతి ముఖ్యమంత్రి నుంచి నిధులు తీసుకురావడంలో శ్రీధర్‌బాబు కృషి చేస్తున్నారని తెలిపారు.
మంథని నియోజకవర్గంలో మంజూరైన అన్ని అభివృద్ధి పనులను నిర్ణీత సమయంలో నాణ్యతతో పూర్తి చేయాలని స్థానిక నాయకత్వానికి సూచించారు. శ్రీధర్‌బాబుకు మంచి పేరు వచ్చేలా స్థానిక నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ రైతులు, మహిళలు, చేనేత కార్మికులకు అండగా నిలుస్తోందన్నారు. ఈ ఏడాది చిలకపచ్చ రంగులో నాణ్యమైన ఇందిరమ్మ చీరలను అందిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లు అందించామని, రూ.1 లక్ష కోట్ల విలువైన పంటలను కొనుగోలు చేశామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ* మంథని ప్రజల ఆశీస్సులతో తాను ఎమ్మెల్యేగా ఎన్నికై, కాంగ్రెస్ అధిష్ఠానం ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు చేపట్టానని తెలిపారు.
మంథని ప్రాంతానికి గత రెండున్నరేళ్లలో సుమారు రూ.800 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. మంథని పట్టణంలోని బ్రిడ్జి నుంచి బస్ డిపో వరకు రూ.15 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని, మానేరు నదిపై కూడా వంతెన మంజూరైందని చెప్పారు.మంథని మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
గోదావరి నదిపై హై లెవల్ బ్రిడ్జి, అవసరమైన రహదారి విస్తరణ పనులకు నిధులు మంజూరు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, రహదారి పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంపు, కొత్త రేషన్ కార్డుల జారీ, పాత కార్డుల్లో కొత్త లబ్ధిదారుల చేరిక, డైట్ ఛార్జీల పెంపు, కాస్మెటిక్ ఛార్జీల పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.గత పది సంవత్సరాల్లో పేదల గృహ నిర్మాణం నిర్లక్ష్యానికి గురైందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తున్నామని చెప్పారు.మంథని ప్రాంతానికి పరిశ్రమలను తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించామని, కోకాకోలా వంటి బహుళజాతి సంస్థ మంథనిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. చిన్న సాఫ్ట్‌వేర్ కేంద్రం కూడా ప్రారంభమైందన్నారుయువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ఇంజినీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు ATC, NAC స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు.NAC స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు రూ.20 కోట్లు కేటాయించామని చెప్పారు. ఎనిమిది నెలల్లో కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు. అప్పటివరకు సెంట్రనరి కాలనీలో ఉన్న సింగరేణి భవనాలలో నాక్ కేంద్రం నడపాలని ఆయన సూచించారు.మంథని ప్రాంతంలో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించాలని మంత్రి సూచించారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని, వరి సాగును తగ్గించాలని కోరారు. ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులు వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ,జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు
మంథనిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



