Thursday, August 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసమస్యల వలయంలో గాంధీ ఆస్పత్రి

సమస్యల వలయంలో గాంధీ ఆస్పత్రి

- Advertisement -

ఐద్వా బృందం ‘సర్వే’లో బట్టబయలు
చివరకు మందు బిళ్లలూ కరువే
ఆస్పత్రి సూపరింటెండెంట్‌‌కు ఫిర్యాదు
వెంటనే పరిష్కరించాలని సర్కారుకు డిమాండ్‌


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ర్ట రాజధాని హైదరాబాద్‌‌లోని గాంధీ ఆస్పత్రి సమస్యల వలయంగా మారింది. ఏ వార్డు చూసినా పరిస్థితి దారుణంగా ఉంది. శుభ్రత దగ్గర నుంచి మొదలెడితే వైద్య పరీక్షల వరకు రోగుల కష్టాలు అన్నీ, ఇన్నీ కావు. ఓపీలో చూపించుకునే పేషెంట్ల దగ్గర నుంచి ఇన్‌‌పేషంట్ల వరకూ అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణంగా ఇచ్చే మందు బిళ్లలు సైతం ఇక్కడ సరిపడినంతగా లేకపోవడం దారుణం. దీంతో వైద్యులు బయట మెడికల్‌ ‌షాపుల్లో తెచ్చుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. ఆస్పత్రిలో వైద్యపరీక్షలు సైతం పూర్తిస్థాయిలో చేయడం లేదు. బుధవారం అఖిల భారత మహిళా ప్రజాతంత్ర సంఘం(ఐద్వా) రాష్ట్ర నాయకత్వం నిర్వహించిన సర్వేలో అనేక హృదయ విదారక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది రోగులు పలు రకాల వైద్య సమస్యలతో గాంధీ ఆస్పత్రికి వస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రయివేటు కార్పొరేట్ ఆస్పత్రులలో ఫీజులు భరించలేక గాంధీకి వస్తే ఇక్కడ కూడా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని రోగులు సర్వే బృందానికి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సర్వేలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌ అరుణ జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కేఎన్ ఆశాలత, కె నాగలక్ష్మి, హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి వై వరలక్ష్మి, జిల్లా నాయకులు ఏ పద్మ ,ఎండి షబానా బేగం తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయా వార్డుల్లోని పేషెంట్లు పలు సమస్యలు, ఇబ్బందులను సర్వే బృందం దృష్టికి తెచ్చారు. ఆపరేషన్లు చేసే సమయంలో సీనియర్ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో గర్భిణీ స్త్రీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని మహిళా రోగులు సర్వే బృందానికి ఫిర్యాదు చేశారు. సమస్యాత్మక ప్రసవాల సందర్భంలో కూడా సీనియర్ డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని వారు తమకు చెప్పినట్టు సర్వే బృందం బుధవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్థోపెడిక్‌ విభాగంలో కొన్ని పరికరాలు చెడిపోవడంతో రోగులు టెస్టులను బయట చేయించుకోవాల్సి వస్తున్నదని తమ దృష్టికి తెచ్చినట్టు తెలిపారు. అంతేకా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది చాలా సందర్భాలలో రోగులతో దురుసుగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడుతున్నట్టు ఫిర్యాదు చేశారని చెప్పారు. ప్రభుత్వం తరచుగా తనిఖీలు చేయకపోవడంతోనే ఆస్పత్రి శుభ్రత, పరిపాలన అస్తవ్యస్తంగా మారిందనీ, ఆరోగ్య శాఖా మంత్రి తరచుగా తనిఖీలు చేపట్టాలని ఐద్వా బృందం అభిప్రాయపడింది. రోగులకు అన్ని విధాలా సహకరించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌‌కు ఫిర్యాదు చేసినట్టు ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. మందులు ఇవ్వడంతోపాటు వైద్యపరీక్షలు ఉచితంగా చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -