Thursday, February 19, 2026
E-PAPER
Homeజాతీయంగ్రీన్‌ ఎనర్జీకి ప్రాధాన్యత

గ్రీన్‌ ఎనర్జీకి ప్రాధాన్యత

- Advertisement -

వేగవంతమైన అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని క్యూర్‌, ప్యూర్‌, రేర్‌గా విభజన
పట్టణాభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతాం : ముంబయి ‘క్లైమెట్‌ వీక్‌’ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ప్రపంచ పరిరక్షణకు గ్రీన్‌ఎనర్జీ కీలకమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్‌ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని ప్రోత్స హిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 30 లక్షలకుపైగా పంప్‌సెట్లు, దాదాపు 50 లక్షల గృహాలకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని చెప్పారు. బొగ్గు, సాంప్రదాయ ఇంధన వనరుల నుంచి సోలార్‌, గ్రీన్‌ ఎనర్జీ వైపు మార్చడమే తమ ప్రధాన లక్ష్య మన్నారు. మహారాష్ట్ర ముంబయి బాంద్రా కుర్లా జియో కన్వెన్షన్‌ సెంటర్‌లో బుధవారం ఆ ప్రభుత్వం నిర్వహించిన ‘క్లైమేట్‌ వీక్‌’ సదస్సులో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.

కాలుష్య నియంత్రణ, రీసైక్లింగ్‌, స్థిరశక్తి ఉత్పత్తి పద్ధతులపై నిరంతరం పరిశోధనలను కొనసాగిస్తున్నామన్నారు. హైదరాబాద్‌ను 2034 నాటికి నెట్‌జీరో నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. పట్టణాభివృద్ధిలో భాగంగా తాము కార్బన్‌ ఫుట్‌ప్రింట్‌ ఆడిట్‌ చేపట్టనున్న తొలి భారత నగరంగా హైదరాబాద్‌ నిలవబోతుందని తెలిపారు. వచ్చే ఐదేండ్లలో కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌)లో దాదాపు పరిశ్రమలు ఉండవని స్పష్టం చేశారు. స్వాతంత్య్రం తర్వాత తొలి నాలుగు దశాబ్దాల్లో విద్యావ్యవస్థ, నీటిపారుదల రంగాలు ప్రాధాన్యతాంశాలుగా ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాథమిక పాఠశాలల నుంచి ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్సీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. విద్యుత్‌, సాగునీటికి భారీ ఆనకట్టలను నిర్మించి రైతుల పొలాలను నీటితో అనుసంధానించామని తెలిపారు.

భారత్‌లో వేగంగా సేవారంగం విస్తరణ
1991 నుంచి 2020 వరకు లిబరలైజేషన్‌, ప్రయివేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌ సంస్కరణలతో భారత్‌ సేవా రంగంలో శక్తివంతమైన దేశంగా ఎదిగిందని సీఎం వివరించారు. టెలికాం, సాఫ్ట్‌వేర్‌ విప్లవంతో పట్టణ మౌలిక సదుపాయాల విస్తరణ సాధ్యమైందన్నారు. భారత నిపుణులు సిలికాన్‌ వ్యాలీ వంటి ప్రపంచ కేంద్రాల్లో విజయాలను సాధించారని తెలిపారు. 1991 తర్వాత గ్లోబల్‌ సాఫ్ట్‌వేర్‌, టెక్‌ సంస్థలు తమ బ్యాక్‌ ఆఫీస్‌ కార్యకలాపాలకు భారత్‌ను ఎంచుకున్నాయన్నారు. అందుకే ప్రపంచంలో అత్యధిక గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు మన దేశంలో ఉన్నాయన్నారు. 1990 నాటికి భారత్‌ ఆహార కొరత నుంచి ఆహార భద్రత సాధించిందని చెప్పారు. దీంతో ప్రజల జీవిత కాలం పెరిగిందని చెప్పారు. దేశంలోని ఇంజినీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలు ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమంగా గుర్తింపు పొందే విధంగా అభివృద్ధి సాధించిందని వివరించారు.

2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
రాష్ట్ర జీడీపీని 200 బిలియన్‌ డాలర్ల స్థాయి నుంచి 2034 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడం లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్తు అభివృద్ధికి ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, విద్య, నైపుణ్యాలు, వనరులు, ఉపాధి ప్రధాన స్తంభాలుగా నిలుస్తాయన్నారు. రాష్ట్రాభివృద్ధికి రాష్ట్రాన్ని క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ జోన్లుగా విభజించినట్టు సీఎం వివరించారు. హైదరాబాద్‌ను 160 కి.మీ. పొడవైన ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పరిధిలో కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌)గా ప్రకటించగా, ఓఆర్‌ఆర్‌ 360 కి.మీ.ల రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) మధ్య ప్రాంతాన్ని ప్యూర్‌ జోన్‌గా రూపొందించి తయారీ రంగానికి నిర్దేశించినట్లు చెప్పారు. తయారీ రంగంలో చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

రాష్ట్రంలో రోజుకు 16,610 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం
రాష్ట్రంలో రోజుకు సగటున 16,610 మెగావాట్ల విద్యుత్‌ వినియోగం జరుగుతోందని సీఎం తెలిపారు. గత ఏడాది గరిష్ట డిమాండ్‌ 17,162 మెగావాట్లు నమోదైందని, ఈ ఏడాది 19,000 మెగావాట్లను దాటుతుందని అన్నారు. 2034 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంతో గరిష్ట డిమాండ్‌ 34,000 మెగావాట్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యుత్‌ ఉత్పత్తిలో సుమారు 24.8శాతం లేదా దాదాపు 25శాతం గ్రీన్‌ సోర్సుల నుంచే వస్తోందని తెలిపారు. 360 కిలోమీటర్ల పొడవు గల రీజినల్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణం కొనసాగుతోందని, రీజినల్‌ రింగ్‌ రైల్వే ప్రణాళికలు అమలులో ఉన్నాయని అన్నారు. డేటా సెంటర్లు, పరిశ్రమలు గ్రీన్‌ ఎనర్జీని కోరుకుంటున్నాయని తెలిపారు.

దేశంలో క్ల్రైమేట్‌ ఎమర్జెన్సీ
వాతావరణ మార్పులు, కోవిడ్‌ ప్రభావాల ప్రస్తుత పరిస్థితుల రీత్యా దేశంలో క్లైమేట్‌ ఎమర్జెన్సీ కొనసాగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఉత్పత్తి, వినియోగం పెంపుదల కొనసాగుతూనే పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. తెలంగాణ మూడు జోన్లలో గ్రీన్‌ స్ట్రాటజీని అవలంబించిందని తెలిపారు. హైదరాబాద్‌ ప్రాంతంలో ఎలక్ట్రిక్‌ వాహనాలపై పన్నులు తొలగించడంతో దేశంలో అత్యధికంగా ఈవీ వాహనాల వాడకం పెరుగుతోందని అన్నారు. ఈవీ తయారీ సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.

రీట్రోఫిట్‌
ప్రజా రవాణా వ్యవస్థను పర్యావరణ హితంగా మార్చేందుకు రెండు లక్షలకుపైగా ఆటో రిక్షాలను రీట్రోఫిట్‌ చేస్తున్నట్టు సీఎం తెలిపారు. 3,500 కంటే ఎక్కువ ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా మారుస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ మెట్రోను ప్రస్తుత 71 కి.మీ. నుంచి 200 కి.మీ.పైగా విస్తరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. పరిశ్రమలను కోర్‌ అర్బన్‌ ప్రాంతం నుంచి పెరి అర్బన్‌ జోన్లకు తరలిస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా మూసీనది పునరుద్ధరణ, సరస్సులు, చెరువుల సంరక్షణ, వాటర్‌ గ్రిడ్‌, వనరుల నిర్వహణ ప్రణాళికలను వివరించారు. హైడ్రా రూపంలో పర్యావరణ రక్షణకు ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -