Thursday, February 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఉద్రిక్తంగా మధ్యప్రాచ్యం

ఉద్రిక్తంగా మధ్యప్రాచ్యం

- Advertisement -

భారీగా మోహరిస్తున్న అమెరికా సైనిక బలగాలు
24 గంటల్లో 50కి పైగా ఫైటర్‌జెట్‌ల తరలింపు
సముద్ర జలాల్లో కదులుతున్న మరో యుద్ధ విమాన వాహన నౌక
క్షిపణి విధ్వంసక నౌకలు కూడా…


వాషింగ్టన్‌ : మధ్యప్రాచ్యంలో అమెరికా తన సైనిక బలగాలను మరింతగా పెంచింది. గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఆ ప్రాంతానికి యాభై ఫైటర్‌ జెట్‌ విమానాలను పంపింది. ఒక వైపు ఇరాన్‌ అణు కార్యక్రమంపై జెనీవాలో చర్చలు జరుగుతున్న సమయంలోనే మరో వైపు అగ్రరాజ్యం యుద్ధ సన్నాహాలు చేసుకుంటోంది. మధ్యప్రాచ్యంలో వైమానిక, నౌకా సామర్థ్యాన్ని పెంచేందుకే ఈ చర్య తీసుకున్నామని అమెరికా అధికారులు తెలిపారు. ఎఫ్‌-22, ఎఫ్‌-35, ఎఫ్‌-16 యుద్ధ విమానాలు ఆ ప్రాంతం దిశగా కదులుతున్నాయని స్వతంత్ర ఫ్లయిట్‌ ట్రాకింగ్‌ డేటా, సైనిక ఏవియేషన్‌ మానిటర్స్‌ చెబుతున్నాయి. వీటితో పాటు యుద్ధ విమానాలకు అవసరమైన ఇంధనాన్ని నింపుకొని కొన్ని ట్యాంకర్లు కూడా ఆ ప్రాంతానికి చేరుకుంటున్నాయి. ఇదంతా చూస్తుంటే అమెరికా దళాలు ఏ క్షణంలో అయినా ఇరాన్‌పై యుద్ధానికి దిగవచ్చునని అర్థమవుతోంది.

గత 24 గంటల వ్యవధిలో యాభైకిపైగా యుద్ధ విమానాలు మధ్యప్రాచ్యానికి తరలి వెళ్లాయని అమెరికా అధికారి ఒకరు ఆక్సియాస్‌ వార్తా సంస్థకు తెలి యజేశారు. ఇదిలావుండగా అమెరికాకు చెందిన యూఎస్‌ఎస్‌ గెరాల్డ్‌ ఆర్‌.ఫోర్డ్‌ యుద్ధ విమాన వాహక నౌక కరేబియన్‌ నుంచి బయలుదేరింది. అది ఇప్పుడు అట్లాంటిక్‌ సముద్రం మధ్యలో ఉంది. ఈ నౌకతో పాటు మూడు క్షిపణి విధ్వంసక నౌకలు… యూఎస్‌ఎస్‌ మహాన్‌, యూఎస్‌ఎస్‌ బెయిన్‌బ్రిడ్జ్‌, యూఎస్‌ఎస్‌ విన్‌స్టన్‌ చర్చిల్‌ కూడా ప్రయాణిస్తున్నాయని పేరు చెప్పడానికి ఇష్టపడని నౌకాదళ అధికారి ఒకరు చెప్పారు. ఇవి ఇరాన్‌ సమీపంలోని సముద్ర జలాలకు చేరుకోవడానికి వారం రోజులకు పైగా పట్టవచ్చు. యుద్ధ విమాన వాహక నౌక యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌తో పాటు మరికొన్ని నౌకలు, విమానాలు ఇప్పటికే మధ్యప్రాచ్య జలాలలో మోహరించి ఉన్నాయి.

తొలిసారిగా హార్ముజ్‌ జలసంధి మూసివేత
ట్రంప్‌పై ఒత్తిడి పెంచేందుకు ఖమేనీ వ్యూహం
అణ్వస్త్ర కార్యక్రమంపై అమెరికాతో చర్చలు జరుపుతున్న ఇరాన్‌ మంగళవారం(ఫిబ్రవరి 17న) సంచలన ప్రకటన చేసింది. తాత్కాలికంగా హార్ముజ్‌ జలసంధిని మూసివేశామని వెల్లడించింది. తద్వారా ఎన్నో దేశాల ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన అంతర్జాతీయ జలమార్గం హార్ముజ్‌పై తమకు పట్టు ఉందనే పరోక్ష సందేశాన్ని అమెరికాకు ఇరాన్‌ పంపింది. హార్ముజ్‌ జలసంధి వద్ద తాము చేస్తున్న సైనిక విన్యాసాల ప్రభావం అమెరికా తో జరుపుతున్న చర్చలపై పడుతుందని ఇరాన్‌ భావిస్తోంది. హార్ముజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించడం ఇదే తొలిసారి.

ఇంతకీ ‘హార్ముజ్‌’ ఎక్కడుంది? ఇది భారత్‌కు, ప్రపంచ చమురు మార్కెట్‌కు ఎంత ముఖ్యమైంది?
చరిత్రను తిరగేస్తే ఒక విషయం క్లియర్‌గా తెలిసిపోతుంది. ‘హార్ముజ్‌’ జలసంధిని మూసివే స్తామని చాలాసార్లు ఇరాన్‌ హెచ్చరించిందే కానీ, ఎన్నడూ ఆ పని చేయలేదు. 1980 నుంచి 1988 వరకు ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధం జరిగింది. అప్పట్లో పర్షియన్‌ గల్ఫ్‌, గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ సముద్ర జలాల మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని ఇరుదేశాలు పరస్పర దాడులు చేశాయి. అంతే తప్ప హార్ముజ్‌ను మూసివేయలేదు.

-తమ చమురు ఎగుమతులపై పశ్చిమ దేశాలు మరిన్ని ఆంక్షలను విధిస్తే హార్ముజ్‌ను మూసేస్తామని 2011, 2012 సంవత్సరాల్లో నాటి ఇరాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మహ్మద్‌ రెజా రహీమీ హెచ్చరించారు.
-ఇరాన్‌తో అమెరికా కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు 2018లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. దీంతో హార్ముజ్‌ను మూసేస్తామని ఇరాన్‌ బెదిరించింది.
-2019లో ఇరాన్‌ – అమెరికా మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరిగాయి. ఈక్రమంలో యూఏఈ వైపునున్న హార్ముజ్‌ జలసంధి భాగంలోని నాలుగు నౌకలపై దాడి జరిగింది. ఈ ఎటాక్‌ను తాము చేయలేదని ఇరాన్‌ ప్రకటించింది.
-ఇజ్రాయిల్‌తో ఉద్రిక్తతల నడుమ 2024 ఏప్రిల్‌లో హార్ముజ్‌ వద్ద ఒక కంటైనర్‌ నౌకను ఇరాన్‌ ఆర్మీ సీజ్‌ చేసింది.
-2025 జూన్‌లో ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలు లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్‌ 12 రోజుల పాటు దాడులు చేశాయి. అప్పట్లో కూడా హార్ముజ్‌ను మూసివేస్తామని ఇరాన్‌ వార్నింగ్‌ ఇచ్చిందే కానీ, ఆ పనిని చేయలేదు.

తొలిసారి హార్ముజ్‌ను ఎందుకు మూసివేశారు?
ఈసారి ఇరాన్‌ పూర్తి భిన్నమైన నిర్ణయాన్ని తీసుకుంది. అకస్మాత్తుగా ఫిబ్రవరి 17న కొన్ని గంటల పాటు ‘హార్ముజ్‌’ జలసంధిని మూసివేసింది. ఆ వెంటనే ఇరాన్‌ సైన్యం అక్కడ సైనిక విన్యాసాలు చేసింది. సైనిక విన్యాసాలు ముగియగానే ‘హార్ముజ్‌’ను తెరిచారు. తొలిసారిగా హార్ముజ్‌ను ఇరాన్‌ ఎందుకు మూసివేసింది? అక్కడ సైనిక విన్యాసాలు ఎందుకు చేసింది? అంటే, ఇరాన్‌ లక్ష్యంగా పశ్చిమాసియా దేశాల్లో అమెరికా భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. ఇరాన్‌ అణ్వస్త్ర కార్యక్రమం పూర్తిగా ఆగాల్సిందే అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే హెచ్చరిస్తున్నారు. ఓ వైపు ఈ హెచ్చరికలను చేస్తూనే, మరోవైపు ఇరాన్‌ చుట్టూ సముద్ర జలాల్లో, పొరుగుదేశాల్లో సైనిక మోహరింపులను ఆయన పెంచుతున్నారు. యుద్ధ విమానాలు, మిస్సైళ్లతో కూడిన అమెరికా యుద్ధ నౌకలు ఇప్పుడు ఇరాన్‌ దరిదాపుల్లోనే చక్కర్లు కొడుతున్నాయి.

2025 డిసెంబరు 28 నుంచి జనవరి నెలాఖరు వరకు ఇరాన్‌లో పెద్దఎత్తున ప్రజా నిరసనలు జరిగాయి. దీని వెనుక అమెరికా, ఇజ్రాయిల్‌ గూఢచార సంస్థల హస్తం ఉందని ఇరాన్‌ ఆరోపిస్తోంది. గత నెల రోజుల వ్యవధిలో ఇరాన్‌లో పలుచోట్ల ఉగ్రదాడులు కూడా జరిగాయి. ఈ పరిణామాలను ఇరాన్‌లోని ఆయతుల్లా అలీ ఖమేనీ సర్కారు తీవ్రంగా పరిగణించింది. అమెరికాతో పాటు అమెరికా సైనిక స్థావరాలకు నెలవుగా ఉన్న అరబ్‌ దేశాలకు బలమైన హెచ్చరికను పంపే ఉద్దేశంతో మంగళవారం ఉదయం కొన్నిగంటల పాటు ‘హార్ముజ్‌’ను మూసివేశారు. హార్ముజ్‌ తాత్కాలిక మూసివేతపై ఇప్పటివరకు అమెరికా వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.

అమెరికాతో చర్చలపై హార్ముజ్‌ ఎఫెక్ట్‌
స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరం వేదికగా అమెరికాతో ఇరాన్‌ చర్చలు జరిపింది. సరిగ్గా అదే రోజు(మంగళవారం) ఉదయం ఇరాన్‌ ప్రభుత్వ మీడియాలో ఓ సంచలన కథనం ప్రసారమైంది. దేశ భద్రత కోసం హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ తాత్కాలికంగా మూసివేసింది అనేది ఆ కథనం సారాంశం.

హార్ముజ్‌ ఎక్కడుంది ?
మధ్యధరా సముద్రంలోని పర్షియన్‌ గల్ఫ్‌, హిందూ మహా సముద్రంలోని గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ మధ్య 33 కిలోమీటర్ల వెడల్పుతో హార్ముజ్‌ జలసంధి ఉంది. పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతం నుంచి బహిరంగ సముద్ర జలాల్లోకి నౌకలు ఎంటర్‌ కావాలంటే మార్గం మధ్యనున్న అత్యంత ఇరుకైన హార్ముజ్‌ జలసంధిని దాటాల్సిందే. ఈ జలసంధిపై ఇరాన్‌కు పూర్తి పట్టు ఉంది. సైనికపరంగా ఇరాన్‌కు ఇది వ్యూహాత్మక ప్రాంతం. హార్ముజ్‌ జలసంధికి ఓ వైపున ఇరాన్‌, మరోవైపున ఒమన్‌, యూఏఈ దేశాలు ఉన్నాయి.

ప్రపంచ వాణిజ్యానికి పట్టుకొమ్మ హార్ముజ్‌
ఇరాన్‌ పరిధిలో ఉన్న హార్ముజ్‌ జలసంధి అనేది ప్రపంచ వాణిజ్యానికి పట్టుకొమ్మ లాంటిది. ఈ మార్గం మీదుగా నిత్యం పెద్దసంఖ్యలో ముడి చమురు, సహజ వాయువు ట్యాంకర్లు రాకపోకలు సాగిస్తుంటాయి. సౌదీ అరేబియా, కువైట్‌, ఇరాక్‌, ఖతర్‌, బహ్రయిన్‌, యూఏఈ దేశాలు ఈ రూట్‌ మీదుగా ముడి చమురు, సహజ వాయువును సప్లై చేస్తుంటాయి. ఈ అరబ్‌ దేశాల నుంచి ఎక్కువగా ఆసియా దేశాలకే ఎగుమతులు జరుగు తుంటాయి. ఇక ఇరాన్‌ ముడి చమురుకు అతిపెద్ద కస్టమర్‌ చైనా. చైనాకు సైతం వాణిజ్యపరంగా ఈ జలసంధి మార్గం కీలకమైంది. సిరామిక్‌ ఉత్పత్తులు, ఏనుగు దంతాలు, సిల్క్‌, వస్త్ర ఉత్పత్తుల సప్లై కూడా ఈ రూట్‌లోనే జరుగుతుంటుంది.

సౌదీ, యూఏఈ ముందు జాగ్రత్త చర్యలు
ఎప్పుడైనా హార్ముజ్‌ జలసంధి మార్గంలో రాకపోకలు ఆగితే ఇబ్బంది అనే ఉద్దేశంతో సౌదీ అరేబియా పెట్రో పైప్‌లైన్‌ను నిర్మించుకుంది. సౌదీలోని సముద్ర తీర నగరం యంబు నుంచి సముద్రజల మార్గంలో నేరుగా ఈజిప్టు, సూడాన్‌, ఎరిత్రియా దేశాలను ఇది కనెక్ట్‌ చేస్తుంది. యూఏఈ సైతం తమ దేశంలోని ఫుజైరా ఓడరేవు నుంచి నేరుగా గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ను కనెక్ట్‌ చేసే పెట్రో పైప్‌లైన్‌ను నిర్మించుకుంది. దీనివల్ల హార్ముజ్‌ జలసంధిని టచ్‌ చేయకుండానే, తమ 70 శాతం ముడి చమురును ఆసియా దేశాలకు యూఏఈ సప్లై చేయగలుగుతోంది.

భారత్‌కు హార్ముజ్‌ ఎందుకు ముఖ్యం?
రోజూ ప్రపంచవ్యాప్తంగా జరిగే ముడిచమురు సప్లైలో 20 శాతం హార్ముజ్‌ జలసంధి మీదుగానే వెళ్తుంటుంది. రోజూ భారత్‌కు వచ్చే 5.5 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురులో దాదాపు 2 మిలియన్‌ బ్యారెళ్లు హార్ముజ్‌ మీదుగానే వస్తుంది. భారత్‌కు చెందిన 40 శాతం ముడి చమురు దిగుమతులు, 54 శాతం లిక్విఫైడ్‌ సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) దిగుమతులు హార్ముజ్‌ మీదుగానే వస్తుంటాయి. హార్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేస్తే భారత్‌పై తక్షణ ప్రభావమేదీ పడదని వాణిజ్యరంగ పరిశీలకులు అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -